
ఘనా పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
గ్లోబల్ సౌత్ దేశాల గొంతుకకు బలం ఇవ్వాలి
ప్రపంచ పాలనా విధానంలో సంస్కరణలు రావాల్సిందేన్న ప్రధాని
ఆక్రా: భారతదేశం బలంగా ఉంటే ప్రపంచం మరింత స్థిరంగా, సౌభాగ్యవంతంగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచ పరిణామాలు వేగంగా మారిపోతున్న నేపథ్యంలో ప్రపంచ పాలనా విధానంలో విశ్వసనీయమైన, ప్రభావవంతమైన సంస్కరణలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టంచేశారు. ఘనా పార్లమెంట్‌లో గురువారం ప్రధాని మోదీ ప్రసంగించారు.
దక్షిణార్ధ గోళ దేశాల (గ్లోబల్ సౌత్) గొంతుకకు బలం, విలువ ఇవ్వకపోతే ప్రపంచ అభివృద్ధి సాధ్యం కాదని తేల్చిచెప్పారు. ప్రస్తుత ప్రపంచ అనిశ్చిత పరిస్థితుల్లో స్థిరమైన భారత ప్రజాస్వామ్యం ఒక ఆశారేఖగా వెలిగిపోతోందని హర్షం వ్యక్తంచేశారు. ఇండియా సాధిస్తున్న వేగవంతమైన అభివృద్ధి ప్రపంచ ప్రగతికి ఉ్రత్పేరకంగా మారిందన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ప్రపంచానికి ఒక బలమైన మూలస్తంభంగా నిలుస్తోందన్నారు. భారత్ మరింత బలోపేతమైతే ప్రపంచ స్థిరత్వానికి, సౌభాగ్యానికి తిరుగు ఉండదని స్పష్టంచేశారు. ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారంటే...
నినాదాలకు మించిన కార్యాచరణ
‘‘అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా అగ్రస్థానంలో ఉంది. స్థిరమైన పాలన, రాజకీయ వ్యవస్థ అనే పునాదిపై ఇండియా త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం తథ్యం. గ్లోబల్ సౌత్‌లో మా వాటా 16 శాతంగా ఉంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ మా దేశంలోనే ఉంది. ఇండియా ఇన్నోవేషన్, టెక్నాలజీ హబ్‌గా మారింది. పెట్టుబడులకు అంతర్జాతీయ కంపెనీలు ముందుకొస్తున్నాయి. మరోవైపు ప్రపంచానికి కొత్తకొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి.
వాతావరణ మార్పులు, మహమ్మారులు, ఉగ్రవాదం, సైబర్ సెక్యూరిటీ వంటివి సమస్యగా మారాయి. గత శతాబ్దంలో ఏర్పాటైన అంతర్జాతీయ సంస్థలు వీటిని పరిష్కరించలేకపోతున్నాయి. అందుకే గ్లోబల్ గవర్నెన్స్‌లో విశ్వసనీయమైన, ప్రభావంతమైన సంస్కరణలు కచి్చతంగా రావాలి. ప్రపంచం బాగు కోసం గ్లోబల్ సౌత్‌కు మరింత బలం చేకూరాలి. నినాదాలకు మించిన కార్యాచరణ కావాలి. జీ20 కూటమికి మేము సారథ్యం వహించినప్పుడు ‘ఒకే భూగోళం, ఒకే కుటుంబం, ఒక భవిష్యత్తు’ అనే విజన్‌తో పనిచేశాం. మా హయాంలోనే ఆఫ్రికన్ యూనియన్ జీ20లో శాశ్వత సభ్యదేశంగా మారింది.
ఆఫ్రికా అభివృద్ధి ఎజెండాకు మద్దతు
ఆఫ్రికా అభివృద్ధి ప్రయాణంలో పాలుపంచుకొనేందుకు ఇండియా కట్టుబడి ఉంది. ఆఫ్రికా ప్రజల అభ్యున్నతి కోసం ఆఫ్రికా అభివృద్ధి ఎజెండా–2063కు మద్దతిస్తున్నాం. ఆఫ్రికా లక్ష్యాలు మాకు ప్రాధాన్యతలు. కలిసి పనిచేస్తూ సమానంగా ఎదగాలన్నదే మా విధానం. ఆఫ్రికాతో మా అభివృద్ధి భాగస్వామ్యం కొనసాగుతుంది. స్థానికంగా నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల సృష్టికి కృషి చేస్తాం.
ఆఫ్రికాలో కేవలం పెట్టుబడులు పెట్టడమే కాదు, స్థానిక ప్రజల సాధికారతే మా ధ్యేయం. స్ఫూర్తిదాయకమైన చరిత్ర కలిగిన ఘనాలో పర్యటిస్తుండడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది భారత్. మాకు ప్రజాస్వామ్యం అంటే కేవలం ఒక వ్యవస్థ కాదు.. మా ప్రాథమిక విలువల్లో అదొక అంతర్భాగం. ఇండియాలో ప్రజాస్వామ్యానికి వేలాది సంవత్సరాల చరిత్ర ఉంది. నిజమైన ప్రజాస్వామ్యం చర్చ, సంవాదాన్ని ప్రోత్సహిస్తుంది.
అది ప్రజలను ఐక్యం చేస్తుంది. గౌరవం, మానవ హక్కులకు అండగా నిలుస్తుంది. ఏ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకైనా పారదర్శక, స్వేచ్ఛాయుత ఎన్నికలు ఆత్మలాంటివి. ఇండియాలో ఎన్నికల సంఘం పనితీరును దగ్గరగా గమనించడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది’’ అని ప్రధానమంత్రి స్పష్టంచేశారు. ఘనా పార్లమెంట్‌లో ఘనా–ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ సొసైటీని స్థాపించడాన్ని ఆయన స్వాగతించారు. ఇండియాలో 2,500 రాజకీయ పారీ్టలున్నాయని మోదీ చెప్పగా ఘనా పార్లమెంట్ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తంచేశారు.
భారత్–ఘనా మధ్య ‘సమగ్ర భాగస్వామ్యం’
భారత్–ఘనా దేశాలు తమ పరస్పర సంబంధాలను ‘సమగ్ర భాగస్వామ్యం’ స్థాయికి పెంచుకున్నాయి. ఘనా అభివృద్ధి ప్రయాణానికి భారత్ తోడుగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఆయన గురువారం ఘనా అధ్యక్షుడు జాన్ ద్రమానీ మహామాతో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్–ఘనా మధ్య పరస్పర వాణిజ్యాన్ని రాబోయే ఐదేళ్లలో రెండింతలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
రెండు రోజుల పర్యటన కోసం మోదీ బుధవారం రాత్రి ఘనా చేరుకున్నారు. తొలుత ఘనా అధ్యక్షుడితో కలిసి ప్రతినిధుల స్థాయి చర్చల్లో పాల్గొన్నారు. గురువారం ఇరువురు నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య నాలుగు కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. సంస్కృతి, సంప్రదాయ వైద్యంతోపాటు వేర్వేరు రంగాల్లో సహకారం కోసం ఈ ఒప్పందాలు కుదిరాయి. ఘనాకు భారత్ కేవలం భాగస్వామి మాత్రమే కాదని, ఘనా దేశ నిర్మాణంలో అండగా నిలుస్తోందని మోదీ ఉద్ఘాటించారు.
మోదీకి ఘనా జాతీయ గౌరవ పురస్కారం
ప్రధాని నరేంద్ర మోదీకి ఘనా జాతీయ గౌరవ పురస్కారం ‘ద ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఘనా’ లభించింది. ఘనా అధ్యక్షుడు జాన్ ద్రమానీ మహామా ఆయనకు ఈ పురస్కారం ప్రదానం చేశారు. ప్రశంసనీయమైన రాజనీతిజ్ఞత ప్రదర్శించడంతోపాటు ప్రపంచ స్థాయి నేతగా ప్రభావం చూపుతున్నందుకు గాను మోదీని ఘనా ప్రభుత్వం ఈ పురస్కారంతో సత్కరించింది. ఇది తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఇది ఎంతో గర్వకారణమని చెప్పారు. 140 కోట్ల మంది భారతీయుల తరఫున ఘనా జాతీయ గౌరవ పురస్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.
ముగిసిన ఘనా పర్యటన
భారత ప్రధానమంత్రి ఘనాలో రెండు రోజుల పర్యటన ముగించుకొని గురువారం ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి పయనమయ్యారు. శుక్రవారం ఆ దేశ పార్లమెంట్ సంయుక్త సమావేశంలో మోదీ ప్రసంగించే అవకాశం ఉంది.