
రాంగ్‌రూట్‌లో వచ్చి కారును ఢీకొన్న ట్రక్కు
కారులోనే నలుగురు మృతి మృతులంతా హైదరాబాద్‌వాసులు
కుత్బుల్లాపూర్: అమెరికాలోని డాలస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనమయ్యారు. ఆదివారం రాంగ్ రూట్లో వచ్చిన ట్రక్కు కారును ఢీకొట్టింది. దీంతో కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి అందులో ప్రయాణిస్తున్న శ్రీ వెంకట్, తేజస్విని దంపతులతోపాటు కొడుకు సిద్ధార్థ, కూతురు మృద కాలిపోయారు. తిరుమలగిరికి చెందిన పశుపతినాథ్–గిరిజ దంపతుల కుమారుడు శ్రీ వెంకట్‌కు జీడిమెట్లకు చెందిన తేజస్వినితో 2013లో వివాహం జరిగింది.
పశుపతినాథ్ కొంపల్లి ఎన్సీఎల్‌లో నివాసముంటున్నారు. ఉద్యోగ నిమిత్తం మూడేళ్ల క్రితం కుటుంబంతో సహా శ్రీ వెంకట్–తేజస్విని దంపతులు డాలస్‌కు వెళ్లారు. శ్రీ వెంకట్ సోదరి దీపిక అట్లాంటాలో ఉండగా, మూడు రోజుల క్రితం తల్లిదండ్రులతో కలిసి అక్కడకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరు ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టగా మంటలు చెలరేగి నలుగురూ అక్కడికక్కడే మృతి చెందారు. అయితే వీరితో పాటు ప్రయాణించాల్సిన శ్రీవెంకట్ తల్లిదండ్రులు విమానంలో డాలస్‌కు వచ్చారు. తమ కొడుకు ఇంటికి రాలేదంటూ ఆరా తీయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
