తోమహాక్ క్రూయిజ్ క్షిపణుల దాడి.. 156 మంది మృతికి AI కారణమా? | Human Pulled The Trigger, Machine Helped : Ex CIA Chief On Iran School incident | Sakshi
Sakshi News home page

తోమహాక్ క్రూయిజ్ క్షిపణుల దాడి.. 156 మంది మృతికి AI కారణమా?

Oct 23 2026 5:26 PM | Updated on Oct 23 2026 5:35 PM

Human Pulled The Trigger, Machine Helped : Ex CIA Chief On Iran School incident

సాక్షి,న్యూఢిల్లీ : ఇరాన్‌పై అమెరికా యుద్ధానికి సంబంధించి తాజాగా వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరాన్‌లోని ఓ ఎలిమెంటరీ స్కూల్‌పై జరిగిన భీకర వైమానిక దాడిలో 156 మంది ప్రాణాలు కోల్పోవడంపై అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మాజీ డైరెక్టర్ డేవిడ్ పెట్రేయస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో జరిగిన ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన ఈ ఘోర విషాదం వెనుక అసలు నిజాలను బయటపెట్టారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 28న దక్షిణ ఇరాన్‌లోని హార్మోజ్గాన్ ప్రావిన్స్, మీనాబ్ నగరంలో అమెరికా - ఇజ్రాయెల్ సంయుక్తంగా వైమానిక దాడులు జరిపాయి. ఈ దాడిలో భాగంగా ప్రయోగించిన శక్తివంతమైన తోమహాక్ క్రూయిజ్ క్షిపణులు నేరుగా షజరా తయ్యేబా ఎలిమెంటరీ స్కూల్ సముదాయంపై పడ్డాయి. వరుసగా జరిగిన ఈ క్షిపణి దాడి ధాటికి స్కూల్ భవనం పూర్తిగా కుప్పకూలడంతో.. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు సహా మొత్తం 156 మంది దుర్మరణం చెందారు.

ఏఐ తప్పిదమా? మనుషుల వైఫల్యమా?
దశాబ్దానికి పైగా క్రితం ఆ ప్రాంతంలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నావల్ యూనిట్ ఉండేది. కాలక్రమేణా స్థానికులు ఆ స్థలాన్ని పాఠశాలగా మార్చారు. అయితే, అమెరికా సెంట్రల్ కమాండ్ సైనిక లక్ష్యాలను గుర్తించేందుకు ‘మేవెన్ స్మార్ట్ సిస్టమ్’ అనే ఏఐ ఆధారిత కిల్ చైన్ టూల్‌ను ఉపయోగించింది. కానీ, ఇంటెలిజెన్స్ డేటాబేస్‌లో ఆ భవనం ఇప్పటికీ పాత మిలిటరీ స్థావరంగానే రిజిస్టర్ అయి ఉండటంతో.. ఏఐ ఆ పాఠశాలను శత్రువుల స్థావరంగా గుర్తించి తప్పుగా సిఫార్సు చేసింది.

ట్రిగ్గర్ నొక్కింది మనుషులే: పెట్రేయస్
ఈ పెను విషాదంపై మాజీ సీఐఏ చీఫ్ డేవిడ్ పెట్రేయస్ స్పందిస్తూ.. ఈ ఘటన పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మాత్రమే జరిగిందనడంలో వాస్తవం లేదన్నారు. అది పూర్తిగా మానవ నిర్ణయమే. యంత్రం స్వయంగా ఆ నిర్ణయం తీసుకోలేదు. లక్ష్యాలను గుర్తించడంలో ఏఐ సహాయపడింది అంతే. మధ్యప్రాచ్యంతో పాటు ఉక్రెయిన్‌లోనూ ఇలాంటి పొరపాట్లు జరిగి ఉండవచ్చు. అయినప్పటికీ, ట్రిగ్గర్ నొక్కాలా?,వద్దా? అనే విచక్షణ అంతిమ నిర్ణయం ఎప్పుడూ మనుషులదే అని ఆయన తేల్చిచెప్పారు. డేటాను సరిగ్గా వెరిఫై చేయకుండా, ఏఐ ఇస్తున్న సిఫార్సులను సైనిక అధికారులు గుడ్డిగా నమ్మడం వల్లే ఇన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆధునిక యుద్ధాలలో టెక్నాలజీపై అతిగా ఆధారపడటం ఎంతటి పెను ముప్పునకు దారితీస్తుందో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.

ఇదీ చదవండి : ఫ్రాన్స్‌ని వణికిస్తున్న షమోండా వైరస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement