అమెరికా హెచ్-1బీ వీసా నిబంధనలు కఠినంగా మారడంతో ఆందోళన చెందుతున్న భారతీయ నిపుణులకు ట్రంప్ ప్రభుత్వం కీలక సందేశం ఇచ్చింది. వీసా ఆంక్షలు భారత్‌ను లక్ష్యంగా చేసుకుని తీసుకున్నవి కావని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. అమెరికా కార్మికులు, దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చే క్రమంలోనే వలస విధానాల్లో మార్పులు చేస్తున్నామని వెల్లడించారు. ఈ నిబంధనలు భారత్‌కే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాలకు వర్తిస్తాయని పేర్కొన్నారు.
ఇండియా టుడే టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రూబియో ఈ వ్యాఖ్యలు చేశారు. హెచ్-1బీ వీసా నిబంధనల్లో మార్పుల ప్రభావం అమెరికాలో ఉద్యోగాలు కోరుకునే భారతీయులపై, విదేశీ నిపుణులను నియమించుకోవాలనుకునే అమెరికా కంపెనీలపై పడుతోందని అంగీకరించారు. అయితే, ఈ మార్పులు భారత్‌ను ఉద్దేశించి చేసినవి కావని స్పష్టం చేశారు. ఇదే సమయంలో అమెరికా వలస వ్యవస్థలో చాలా కాలంగా సమస్యలు ఉన్నాయని రూబియో పేర్కొన్నారు. వ్యాపార అవసరాల కోసం విదేశీ నిపుణులను నియమించుకునే కొన్ని కార్యక్రమాల్లో మోసాలు, దుర్వినియోగం చోటుచేసుకున్నాయని ఆరోపించారు. అమెరికా కార్మికులకు లభించాల్సిన ఉద్యోగావకాశాలు దెబ్బతింటున్నాయనే ఆందోళనలు కూడా ఉన్నాయని చెప్పారు. ఈ సమస్యలను పరిష్కరించి, తమ ఆర్థిక వ్యవస్థకు, ప్రజలకు ప్రయోజనం కలిగించే విధానాన్ని రూపొందించడమే లక్ష్యమని వివరించారు.
అమెరికన్లకే తొలి ప్రాధాన్యం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ విధానాన్ని రూబియో మరోసారి స్పష్టం చేశారు. భారత ప్రభుత్వం తన ప్రజలకు, దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తుందని తాను భావిస్తున్నానని పేర్కొన్న ఆయన.. అమెరికా కూడా తమ ప్రజలు, కార్మికులు, దేశ ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. వీసాలు, వాణిజ్య విధానాల విషయంలో ఇరు దేశాల మధ్య తలెత్తే విభేదాలను పరస్పర సంబంధాలు, ఉమ్మడి ప్రయోజనాల ఆధారంగా పరిష్కరించుకోవచ్చని అభిప్రాయపడ్డారు.
రూబియోకు మద్దతుగా సెర్గియో గోర్
భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా రూబియో వ్యాఖ్యలకు మద్దతు తెలిపారు. వీసా విధానాల్లో మార్పులు భారత్‌కు మాత్రమే పరిమితం కాలేదని, ప్రపంచంలోని అన్ని దేశాలపై ప్రభావం చూపుతున్నాయని చెప్పారు. ‘అమెరికా ఫస్ట్’ విధానం అంటే ప్రపంచంతో సంబంధాలు తెంచుకోవడం కాదని పేర్కొన్నారు. భారత్ తన జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లే, అమెరికా కూడా తన ప్రయోజనాలను కాపాడుకునే హక్కు కలిగి ఉందని వివరించారు. గతంలో అమెరికా సరిహద్దుల నియంత్రణలో లోపాలు ఉన్నాయని, వలస విధానాలను సమీక్షించాల్సిన అవసరం ఏర్పడిందని గోర్ అన్నారు. ప్రస్తుత మార్పులను ఏదైనా ఒక దేశాన్ని లక్ష్యంగా చేసుకున్న చర్యలుగా చూడకూడదని పేర్కొన్నారు.
భారతీయ ఐటీ నిపుణులపై ప్రభావం
అమెరికా హెచ్-1బీ వీసా కార్యక్రమం ద్వారా ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాల్లో విదేశీ నిపుణులను నియమించుకునేందుకు అక్కడి కంపెనీలకు అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమంలో భారతీయుల వాటా గణనీయంగా ఉండటంతో నిబంధనల్లో మార్పులు భారత ఐటీ నిపుణులు, ఇతర వృత్తి నిపుణులతో పాటు వారిని నియమించుకునే కంపెనీలపైనా ప్రభావం చూపుతున్నాయి. వీసా పొడిగింపుల విషయంలో గతంలో ఆమోదించిన దరఖాస్తులకు ఇచ్చే ప్రాధాన్యాన్ని తొలగించడం, కొన్ని కొత్త దరఖాస్తులకు భారీ ఆర్థిక భారం విధించడం, అధిక వేతనాలు పొందే ఉద్యోగాలకు ప్రాధాన్యం ఇచ్చే విధానాలపై చర్చలు వంటి పరిణామాలు భారతీయ నిపుణుల్లో ఆందోళన పెంచుతున్నాయి. మొత్తంగా, అమెరికా వలస విధానాల్లో మార్పులు భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నవి కావని ట్రంప్ ప్రభుత్వంలోని కీలక నేతలు చెబుతున్నప్పటికీ.. ఆంక్షల ప్రభావం భారతీయ ఐటీ నిపుణులు, అమెరికా కంపెనీలపై ఎంతవరకు ఉంటుందన్నది కీలకంగా మారింది.
ఇదీ చదవండి: విద్యార్థి ఆందోళనలపై ఫ్రాన్స్ నిషేధం


