ఇజ్రాయెల్‌-స్ట్రైకర్‌.. ఇరాన్‌ ఫతా ఎంత డేంజరో తెలుసా? | Here Is Full Details About Irans Hypersonic Missile Fattah 1 And Know How Danger It Is | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌-స్ట్రైకర్‌.. ఇరాన్‌ ఫతా ఎంత డేంజరో తెలుసా?

Jun 18 2025 4:24 PM | Updated on Jun 18 2025 4:48 PM

Here Is Full Details About Irans Hypersonic Missile Israel Striker Fattah 1

పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ.. ఇజ్రాయెల్‌ ప్రజల పట్ల కనికరం చూపించే ప్రసక్తే లేదని ఇరాన్ ‌సుప్రీం అయతొల్లా అలీ ఖమేనీ ప్రకటించారు. ఈ క్రమంలోనే శక్తివంతమైన హైపర్‌సోనిక్‌ మిస్సైల్స్‌ను ప్రయోగించినట్లు ప్రకటించారాయన. మరోవైపు.. ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌ కూడా‌ ‘ఫతా-1 మిస్సైల్స్‌’ను ప్రయోగాన్ని ధృవీకరించింది. ఈ నేపథ్యంలో ఈ క్షిపణి అంత శక్తివంతమైందా? దాని సామర్థ్యం ఏపాటిదో ఓ లుక్కేద్దాం. 

ఫతా(Fattah) హైపర్‌సోనిక్‌ మిస్సైల్‌.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్నట్లు ఇరాన్‌ ప్రకటించుకుంది. అయితే ఈ విషయంలో పలు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే హైపర్‌సోనిక్ క్షిపణి సాంకేతికతను అభివృద్ధి చేయడం చాలా క్లిష్టమైన పని. ఇరాన్‌ గతంలో రష్యా, చైనా వంటి దేశాలతో రక్షణ రంగంలో పరస్పర సహకారం కొనసాగించింది. బహుశా ఈ దేశాల భాగస్వామ్యంతోనే ఫతాను రూపొందించి ఉండొచ్చని పలువురు విశ్లేషకులు భావిస్తుంటారు. అయితే.. 

ఈ క్షిపణి అభివృద్ధితో అమెరికా, రష్యా, చైనా తర్వాత హైపర్‌సోనిక్ క్షిపణి కలిగిన నాలుగో దేశంగా ఇరాన్‌ నిలిచింది. అలాగని ఇజ్రాయెల్‌ మీదకు ఫతా హైపర్‌సోనిక్‌ మిస్సైల్స్‌ను ఇరాన్‌ ప్రయోగించడం ఇప్పుడే తొలిసారేం కాదు!. కిందటి ఏడాది అక్టోబర్‌ 1వ తేదీన జరూసలేం మీదకు ఈ క్షిపణలను ప్రయోగించినట్లు కథనాలు ప్రచారంలో ఉన్నాయి.  ఇటు ఇరాన్‌, అటు ఇజ్రాయెల్‌ ఈ ప్రచారంపై ఇప్పటిదాకా మౌనం వీడలేదు. అయితే తాజాగా మాత్రం ఇరాన్‌ అధికారిక ప్రకటనతో వీటి ప్రయోగం జరిగిందన్న విషయం వెలుగు చూసింది. 

హైపర్‌సోనిక్‌ అనే పదాన్ని సాధారణంగా అత్యంత వేగమైన రవాణా వ్యవస్థకు ఉపయోగిస్తుంటారు. ఆ తర్వాతి కాలంలో అది యుద్ధ రంగానికి అన్వయించడం మొదలుపెట్టారు. హైపర్‌ సోనిక్‌ మిస్సైల్స్‌ అంటే.. అత్యాధునికమైన క్షిపణులు అని అర్థం. ఇవి శబ్ధ వేగం కంటే అధిక రెట్లతో ప్రయాణిస్తాయి. అత్యంత వేగంతో ప్రయాణించడం వల్ల శత్రుదేశాలు గుర్తించడంగానీ, మార్గంమధ్యలోనే నాశనం చేయడంగానీ చాలా కష్టం. 

ఫతాను 2003లో ఇరాన్‌ ఆవిష్కరించింది. దీనికి ఆ పేరు పెట్టింది ఇరాన్‌ సుప్రీం ఖమేనీనే. దీని పొడవు 12 మీటర్లు. 1,400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఇది చేధించగలదు. సుమారు 200 కేజీల పేలుడు పదార్థాలను మోసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉంది. శబ్ద వేగం కంటే 13 నుంచి 15 రెట్లు అధికంగా ఇది ప్రయాణించగలదు. అంటే దాదాపు గంటకు 16,000–18,500 కిలోమీటర్లు వేగం ఉంటుందన్నమాట.  ఇది హైపర్‌సోనిక్ గ్లైడ్ వెహికిల్ (HGV), హైపర్‌సోనిక్ క్రూజ్ మిసైల్ (HCV) లక్షణాలను కలిగి ఉంది. కానీ, 

ఫతా సామర్థ్యానికి సంబంధించిన సరైన వివరాలను ఇరాన్‌ ఇప్పటిదాకా వెల్లడించకపోవడం గమనార్హం. కాకుంటే.. ఐరన్‌ డోమ్‌, ఆరో లాంటి అత్యాధునిక రక్షణ వ్యవస్థలు ఉన్న ఇజ్రాయెల్‌కు సైతం ఈ క్షిపణి అంతు చిక్కదు. అందుకే ఇరాన్‌ దీనిని ముద్దుగా ఇజ్రాయెల్‌-స్ట్రైకర్‌ అని అభివర్ణిస్తుంటుంది. ఇజ్రాయెల్‌ మాత్రమే కాదు.. హిందూమహాసముద్రంలో సంచరించే అమెరికా యుద్ధ నౌకలను కూడా ఇది ఆనాశనం చేయగలదని ఇరాన్‌ తరచూ ధీమాగా చెబుతుంటుంది. తాజా పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఇజ్రాయెల్‌ ఆక్రమిత ప్రాంతాల గగన తలాలను పూర్తిగా ఇరాన్‌ తమ స్వాధీనంలోకి తెచ్చుకోగలిగిందంటే మాత్రం.. అందుకు ఫతాలాంటి హైపర్‌సోనిక్‌ మిస్సైల్‌ కారణం.

Advertisement
 
Advertisement
Advertisement