
ఎండల తీవ్రతకు 8 మంది మృతి
స్విస్ అణు రియాక్టర్ మూసివేత
బెర్లిన్: యూరప్ దేశాల్లో వడగాడ్పుల తీవ్రత కొనసాగుతోంది. ఇప్పటివరకు స్పెయిన్‌లో నలుగురు, ఇటలీ, ఫ్రాన్స్‌లో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. కార్చిచ్చు ముప్పు పొంచి ఉండటంతో ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించాయి. స్విట్జర్లాండ్‌లోని బెజ్‌నౌ అణు రియాక్టర్‌ను మూసివేశారు. మరో అణు రియాక్టర్‌లో విద్యుదుత్పత్తిని సగానికి తగ్గించారు. స్పెయిన్‌లోని కాటలోనియా ప్రాంతంలో కార్చిచ్చుతో ఇద్దరు చనిపోయారు.
ఎండల వేడిమికి తాళలేక 300 మంది ఆస్పత్రి పాలయ్యారని ఫ్రాన్స్ మంత్రి ఒకరు వివరించారు. ఇటలీ ప్రభుత్వం 18 నగరాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించింది. జర్మనీలోని అత్యధిక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటాయి. దీంతో, జనం వేడి నుంచి ఉపశమనం కోసం ఓపెన్ ఎయిర్ స్విమ్మింగ్ పూల్స్, సరస్సులను ఆశ్రయిస్తున్నారు. జర్మనీలోని చాలా ప్రాంతాల్లో స్కూళ్లను మూసివేశారు. బ్రాండెన్‌బర్గ్, సాగ్జనీల్లో పలు ప్రాంతాల్లో మొదలైన కార్చిచ్చును ఫైర్ సిబ్బంది అదుపులోకి తెచ్చారు. పర్యాటక ప్రాంతాలైన పారిస్‌లోని ఈఫిల్ టవర్‌తోపాటు బ్రస్సెల్స్‌లోని అటోమియంను మూసివేశారు.