సెక్యూరిటీ చెక్‌పాయింట్ వద్ద దుండగుడి కాల్పులు
సీక్రెట్ సర్వీసు సిబ్బంది ఎదురు కాల్పులు
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన దుండగుడు
కాల్పుల సమయంలో వైట్‌హౌస్‌లోనే అధ్యక్షుడు ట్రంప్
నెల రోజుల వ్యవధిలో మూడో కాల్పుల ఘటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన వైట్‌హౌస్ వద్ద మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. శనివారం ఓ ఆగంతకుడు సీక్రెట్ సర్వీసు సెక్యూరిటీ చెక్‌పాయింట్‌కు వద్దకు దూసుకొచ్చి భద్రతా సిబ్బందిపై తుపాకీతో కాల్పులు జరపడం సంచలనం సృష్టించింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరపడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని యూఎస్ సీక్రెట్ సర్వీసు విభాగం వెల్లడించింది. ఆ సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లోనే ఉన్నారు. ట్రంప్‌కు సమీపంలో కాల్పులు జరగడం గత నెల రోజుల వ్యవధిలో ఇది మూడోసారి కావడం గమనార్హం. ట్రంప్ భద్రత ప్రశ్నార్థకంగా మారిందని చెబుతున్నారు.
నేనే ఏసుక్రీస్తుని..
రాజధాని వాష్టింగన్‌లో వైట్‌హౌస్ కాంప్లెక్స్‌కు ఆనుకొని 17వ వీధి, పెన్సిల్వేనియా అవెన్యూ ప్రాంతంలో శనివారం సాయంత్రం 6 గంటల తర్వాత దుండగుడు తన బ్యాగ్ నుంచి హఠాత్తుగా ఆయుధాన్ని బయటకు తీసి కాల్పులు ప్రారంభించాడని సీక్రెట్ సర్వీసు అధికారులు తెలిపారు. తాము వెంటనే ఎదురు కాల్పులు ప్రారంభించామని అన్నారు. దుండగుడితోపాటు అతడికి సమీపంలోనే ఉన్న ఓ వ్యక్తికి కూడా గాయాలయ్యాయని వెల్లడించారు. దుండగుడిని నాసిర్ బెస్ట్(21)గా గుర్తించినట్లు చెప్పారు.
నాసిర్ బెస్ట్‌కు నేరచరిత్ర ఉంది. డి్రస్టిక్ట్ ఆఫ్ కొలంబియా కోర్టు రికార్డుల ప్రకారం.. 2025 జూలైలో అరెస్టయ్యాడు. అప్పట్లో అనుమతి లేకుండా వైట్‌హౌస్ మరో చెక్‌పాయింట్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. ఆగాలంటూ అధికారులు ఇచ్చిన ఆదేశాలను పాటించలేదు. తానే ఏసుక్రీస్తునని చెప్పుకున్నాడు. తాను అరెస్టు కావాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. అప్పట్లో అతడిపై ప్రాథమిక విచారణ జరిగింది. కానీ, తదుపరి విచారణకు హాజరు కాలేదు. నిందితుడి కాల్పుల్లో సీక్రెట్ సర్వీసు సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ తెలియజేశారు.
టార్గెట్ ట్రంప్?
అధ్యక్షుడు ట్రంప్‌ను ఎవరైనా టార్గెట్ చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో మూడుసార్లు కాల్పులు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్ 25న వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్ సమీపంలో ఓ హోటల్‌లో కరెస్పాండెంట్స్ అసోసియేషన్ విందులో ట్రంప్ పాల్గొన్నారు. ఆ సమయంలో ఓ దుండగుడు అదే హోటల్‌లో కాల్పులకు తెగబడ్డాడు. మే 4న వాషింగ్టన్ మాన్యుమెంట్ సమీపంలో కాల్పులు జరిగాయి.
ట్రంప్ అక్కడికి దగ్గర్లోనే ఉన్నారు. తాజాగా వైట్‌హౌస్‌లో ట్రంప్ ఉండగానే, బయట సెక్యూరిటీ చెక్‌పాయింట్ వద్ద యువకుడు కాల్పులు జరిపాడు. వైట్‌హౌస్‌లో ఉన్న ట్రంప్‌పై ఈ కాల్పుల ప్రభావం పడలేదని సీక్రెట్ సర్వీస్ స్పష్టంచేసింది. వాస్తవానికి ట్రంప్ వారాంతాన్ని తన న్యూజెర్సీ గోల్ఫ్ క్లబ్‌లో గడపాల్సి ఉండగా, దానికి బదులుగా వైట్‌హౌస్‌లోనే ఉండాలని తన ప్రణాళికను మార్చుకున్నారు.
కాల్పుల ఘటనపై శనివారం సాయంత్రం వైట్‌హౌస్‌లో ఉన్న జర్నలిస్టులు స్పందించారు. బయట నుంచి వరుసగా తుపాకీ కాల్పుల శబ్దాలు విన్నట్లు తెలిపారు. జర్నలిస్టులు బయటకు రాకుండా సీక్రెట్ సర్వీసు సిబ్బంది అడ్డుకున్నారు. ప్రెస్ బ్రీఫింగ్ గదిలోకి వెళ్లాలని సూచించారు. ఇదిలా ఉండగా, కాల్పులు జరగ్గానే సీక్రెట్ సర్వీసు సిబ్బంది వైట్‌హౌస్ ప్రాంగణం చుట్టూ లాక్‌డౌన్ విధించారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. పరిస్థితి సద్దుమణిగినట్లు గుర్తించి, 45 నిమిషాల తర్వాత లాక్‌డౌన్ ఎత్తివేశారు.


