శుక్రవారం నాటికి ‘శుభవార్త’.. ట్రంప్‌ కీలక ప్రకటన | Good News On Talks With Iran Could Come By Friday: Trump | Sakshi
Sakshi News home page

శుక్రవారం నాటికి ‘శుభవార్త’.. ట్రంప్‌ కీలక ప్రకటన

Apr 22 2026 8:31 PM | Updated on Apr 22 2026 9:15 PM

Good News On Talks With Iran Could Come By Friday: Trump

వాషింగ్టన్: అమెరికా, ఇరాన్‌ రెండో దఫా చర్చలపై సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. రెండో విడత చర్చలపై శుక్రవారం నాటికి శుభవార్త రావచ్చని.. రాబోయే 36 నుంచి 72 గంటల్లో శాంతి చర్చలు పునఃప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసినట్లు 'న్యూయార్క్‌ పోస్ట్’ పేర్కొంది. ఇరాన్‌తో కాల్పుల విరమణను పొడిగించిన కొద్ది గంటలకే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిపింది. 

మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్‌ అభ్యర్థన మేరకు.. ఇరాన్‌తో కాల్పుల విరమణను ట్రంప్‌ పొడిగించిన సంగతి తెలిసిందే. ఏడు వారాలుగా సాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ నాయకత్వం ఒక ఏకీకృత ప్రతిపాదనతో రావడానికి సమయం ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్ 8న ప్రకటించిన రెండు వారాల కాల్పుల విరమణ గడువు ముగియడానికి కొన్ని గంటల ముందే ఈ కీలక ప్రకటన వెలువడింది. దీంతో పాకిస్తాన్‌కు వెళ్లాల్సిన అమెరికా ప్రతినిధి బృందం పర్యటన ప్రస్తుతానికి వాయిదా పడింది.

ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్‌లతో కూడిన బృందం మంగళవారం ఇస్లామాబాద్ వెళ్లాల్సి ఉంది. అయితే, హార్మూజ్‌ జలసంధి దిగ్భంధం, తమ కార్గో నౌకపై దాడి, స్వాధీనం ఘటనలతో ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న ఇరాన్‌ పాకిస్తాన్‌కు శాంతి చర్చల బృందాన్ని పంపేదిలేదని తెగేసి చెప్పింది. ఈ క్రమంలో పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్ అభ్యర్థన మేరకు ఇరాన్ ఒక సమగ్ర ప్రతిపాదనతో వచ్చే వరకు దాడులు నిలిపివేయాలని నిర్ణయించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. అయితే, చర్చల కోసం ఇరాన్ ఏకీకృత ప్రతిపాదనను తెచ్చే వరకు మాత్రమే అమెరికా దాడులకు దూరంగా ఉంటుందని.. కానీ ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

అమెరికా చర్యలను ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ తీవ్రంగా ఖండించారు. ఓడరేవులను దిగ్బంధించడం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని, ఇది ఒక ‘యుద్ధ చర్య’గా ఆయన అభివర్ణించారు. వాణిజ్య నౌకలపై దాడులు చేయడం, సిబ్బందిని బందీలుగా పట్టుకోవడం అన్యాయమని, తమ ప్రయోజనాలను ఎలా కాపాడుకోవాలో ఇరాన్‌కు తెలుసని ఆయన హెచ్చరించారు. మరోవైపు, ఆసియాలో ఇరాన్ ముడి చమురును అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ఆరోపణలున్న 'M/T టిఫానీ' అనే చమురు ట్యాంకర్‌ను అమెరికా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్-అమెరికా.. ఇరాన్‌పై దాడులు చేయడంతో ఈ యుద్ధం మొదలైంది. హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టుతో అంతర్జాతీయంగా చమురు ధరలు దాదాపు 30 శాతం పెరిగి, బ్యారెల్ ధర 95 డాలర్లకు చేరుకుంది. ఏప్రిల్ 11-12 తేదీల్లో జరిగిన మొదటి విడత చర్చలు విఫలం కావడంతో, ఇప్పుడు రెండో విడత చర్చలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement