దుబాయ్: యూఏఈలోని దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ నుంచి ఇజ్రాయెల్ నగరమైన టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానం ఎఫ్‌జెడ్1073లో జరిగిన సంచలన ఘటనకు సంబంధించిన మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారత్‌కు చెందిన విమాన కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌పై ఓమాన్ దేశానికి చెందిన కో-పైలట్ హమామ్ అల్ హమ్మమీ గొడ్డలితో దాడి చేసిన ఉదంతం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
అయితే, ఈ దాడిని ధైర్యంగా అడ్డుకుని, నిందితుడిని బంధించిన ఇజ్రాయెల్ ప్రయాణికులు తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. నిందితుడిని తాళ్లతో కట్టేసిన తర్వాత, కొందరు విమాన సిబ్బంది వచ్చి అతడిని విడిచిపెట్టమని డిమాండ్ చేశారని వారు పేర్కొన్నారు.
విమానం గాల్లో ఉండగా కో-పైలట్ హమామ్ అల్-హమ్మమి విమానంలోని క్రాష్ యాక్స్ (గొడ్డలి) తీసుకుని భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌పై దాడికి పాల్పడ్డాడు. అదే సమయంలో విమానం కేవలం 30 సెకన్లలోనే 14,000 అడుగులకు పైగా కిందికి దూసుకెళ్లడంతో పెను ప్రమాదం ముంచుకొచ్చింది. తీవ్ర గాయాలలైనప్పటికీ, కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ అత్యంత సాహసంతో కాక్‌పిట్ డోర్ తెరిచారు.
ఈ ప్రమాదాన్ని గమనించిన ఇజ్రాయెల్ ప్రయాణికులు త్వివికా మానేస్ , డేనియల్ లిచ్టర్, యానివ్ హయాన్, అసాఫ్ రాజువాన్ వెంటనే కాక్‌పిట్‌లోకి దూసుకెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హెడ్‌ఫోన్ వైర్లు, జిప్ టైలతో నిందితుడి చేతులను వెనక్కి కట్టి, బోర్లా పడుకోబెట్టి బంధించారు.
ప్రయాణికుల సంచలన ఆరోపణలు
'ది న్యూయార్క్ పోస్ట్' కథనం ప్రకారం.. నిందితుడిని కట్టేసిన కొద్దిసేపటికి కొందరు విమాన సిబ్బంది అక్కడికి వచ్చి అతడిని విడిచిపెట్టాలని కోరినట్లు ప్రయాణికులు తెలిపారు.
కోపైలట్‌ను విడిచిపెట్టమని వారు మమ్మల్ని అడిగారు. అసలు వారెందుకు అలా అన్నారో మాకు అర్థం కాలేదు అని త్వివికా మానేస్ ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది ప్రవర్తనతో ప్రయాణికులలో అనుమానాలు తలెత్తాయని, అయితే ఏ సిబ్బంది కూడా ఈ దాడిలో ప్రత్యక్షంగా భాగస్వాములని తాము అనడం లేదని డేనియల్ లిచ్టర్ స్పష్టం చేశారు. ప్రయాణికులు మాత్రం అతడిని చంపాలని అనుకోలేదని, భవిష్యత్తులో విచారణ జరగడం కోసమే అతడిని సజీవంగా ఉంచాలని భావించామని తెలిపారు.
ఇదీ చదవండి : ఫ్లైదుబాయ్ విమానంలో.. ఉడత సాయం కాదు.. అంతకు మించి
సిబ్బంది పదేపదే తాము ఇన్‌చార్జ్ అని వాదిస్తూ, కాక్‌పిట్ చుట్టూ ఉన్న ప్రదేశం నుండి ప్రయాణికులను వెళ్ళిపోవాలని కోరడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి ప్రయాణికులు సిబ్బందిని ఐదు, ఆరవ వరుస సీట్లకు పంపించి, కాక్‌పిట్ ప్రవేశ ద్వారం వద్ద కాపలాగా మరో ప్రయాణికుడిని ఉంచారు. ఆ తర్వాత విమానంలో ఉన్న రిజర్వ్ పైలట్లు విమానాన్ని నియంత్రణలోకి తీసుకుని సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
ఉగ్రదాడిగా ప్రకటించిన యూఏఈ
ఈ ఘటనను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అటార్నీ జనరల్ అధికారికంగా ఉగ్రవాద దాడిగా ప్రకటించారు. ఇది ముందస్తు కుట్రా? లేక దీని వెనుక ఎవరి ప్రమేయం ఉందా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. కో-పైలట్ రాడికల్ ఇస్లామిస్ట్ భావజాలం ఉందని, ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కనిపిస్తోందని అన్నారు.


