‘వైట్‌హౌస్’ఘటన అప్‌డేట్‌: ఎవరీ నాసిరే బెస్ట్? | Firing Panic Near White House Who is Nazire Best | Sakshi
Sakshi News home page

‘వైట్‌హౌస్’ఘటన అప్‌డేట్‌: ఎవరీ నాసిరే బెస్ట్?

May 24 2026 9:08 AM | Updated on May 24 2026 9:55 AM

Firing Panic Near White House Who is Nazire Best

వాషింగ్టన్‌: అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని  వైట్‌హౌస్ సమీపంలో శనివారం సాయంత్రం విచక్షణారహితంగా కాల్పులు జరిపి తీవ్ర ఉద్రిక్తతకు కారణమయ్యాడు 21 ఏళ్ల నాసిరే బెస్ట్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భవనం లోపల ఉన్న సమయంలోనే, సెక్రెట్ సర్వీస్ చెక్‌పోస్ట్ వద్దకు వచ్చి ఈ ఘాతుకానికి ఒడిగట్టిన నిందితుడి వివరాలు బయటకు వచ్చాయి. దర్యాప్తు సంస్థలు సేకరించిన వివరాల ప్రకారం అతని ప్రొఫైల్ ఇలా ఉంది..

నిందితుడి వివరాలు
చిరునామా: నాసిరే బెస్ట్ అమెరికాలోని మేరీల్యాండ్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. అతని వయసు 21 సంవత్సరాలు.

మానసిక స్థితి: ఇతను గత కొంతకాలంగా తీవ్రమైన మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు విచారణలో తేలింది.

నేర చరిత్ర: వైట్‌హౌస్ భద్రతా వలయాన్ని దాటేందుకు ఇతడు ప్రయత్నించడం ఇది మొదటిసారేం కాదు. గతంలో కూడా పలుమార్లు వైట్‌హౌస్ పరిసరాల్లోకి చొరబడేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కాడు.

గతంలో అరెస్టులు: ఏడాది క్రితం, అంటే 2025 జూన్, జూలై నెలల్లోనే ఇతను ఇటువంటి చొరబాటు కేసుల్లో అరెస్టయ్యాడు.

కోర్టు నిషేధాజ్ఞలు: ఇతని మానసిక స్థితి, ప్రవర్తనను గమనించిన కోర్టు.. గతంలోనే ఇతనిపై ఒక కీలకమైన ఆదేశాన్ని జారీ చేసింది. వైట్‌హౌస్ పరిసర ప్రాంతాల్లోకి అస్సలు రావద్దంటూ బెస్ట్‌పై గతంలోనే కోర్టు నిషేధాజ్ఞలు విధించింది.

శనివారం సాయంత్రం ఏం జరిగింది?
కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ శనివారం సాయంత్రం వైట్‌హౌస్ సమీపంలోని 17వ వీధి, పెన్సిల్వేనియా అవెన్యూ వద్ద ఉన్న సెక్రెట్ సర్వీస్ చెక్‌పోస్ట్ వద్దకు నాసిరే బెస్ట్ చేరుకున్నాడు. అందరూ చూస్తుండగానే తన బ్యాగులో నుంచి తుపాకీ తీసి విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించాడు.

సెక్రెట్ సర్వీస్ అధికారులు తక్షణమే స్పందించి ఎదురుకాల్పులు జరపడంతో నిందితుడు నాసిరే బెస్ట్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మరణించాడు. ఈ కాల్పుల్లో ఒక సాధారణ పౌరుడు (బైస్టాండర్) కూడా గాయపడగా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్షేమంగా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. ప్రస్తుతం ఎఫ్బీఐ , ఫెడరల్ దర్యాప్తు సంస్థలు ఈ ఘటనపై  దర్యాప్తు జరుపుతున్నాయి. 

ఇది కూడా చదవండి: వైట్‌హౌస్‌: అటు కాల్పులు.. ఇటు లైవ్‌ రిపోర్టింగ్‌

Advertisement
 
Advertisement
Advertisement