గంట తరువాత బిడ్డ చావు కబురు.. కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి! | Father Of Indian Killed In US Attack On Ship Off Oman Coast | Sakshi
Sakshi News home page

గంట తరువాత బిడ్డ చావు కబురు.. కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి!

Jun 11 2026 10:52 PM | Updated on Jun 11 2026 11:18 PM

Father Of Indian Killed In US Attack On Ship Off Oman Coast

గల్ఫ్ ఆఫ్ ఒమాన్ ప్రాంతంలో.. జరిగిన ఒక విషాదకర ఘటన భారతదేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పలావు (Palau) దేశ జెండా కింద ప్రయాణిస్తున్న ఏంటీ సెట్టెబెల్లో (MT Settebello) అనే చమురు ట్యాంకర్‌పై అమెరికా సైన్యం దాడి చేయడంతో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో 23 ఏళ్ల యువకుడు ఆదిత్య శర్మ (Aditya Sharma) కూడా ఉన్నాడు. ఈ సంఘటన అంతర్జాతీయ సముద్ర రవాణా భద్రత, యుద్ధ నిబంధనలు & భారతీయ నావికుల రక్షణపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది.

అమెరికా ఆరోపణలు
అమెరికా ఆరోపణల ప్రకారం.. ఏంటీ సెట్టెబెల్లో నౌక ఇరాన్ నుంచి చమురును తరలిస్తూ అమెరికా విధించిన సముద్ర దిగ్బంధనాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నించింది. ఈ కారణంగా నౌకపై దాడి చేసినట్లు అమెరికా తెలిపింది. అయితే.. నౌక యాజమాన్యం ఈ ఆరోపణలను ఖండిస్తూ అంతర్జాతీయ విచారణ జరపాలని డిమాండ్ చేసింది.

ఈ నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. దాడి తర్వాత ఒమాన్ అధికారులు 21 మందిని సురక్షితంగా రక్షించగలిగారు. అయితే.. ముగ్గురు భారతీయ నావికులు కనిపించకుండా పోయారు. అనంతరం వారి మృతదేహాలను గుర్తించి మరణించినట్లు భారత ప్రభుత్వం ధృవీకరించింది. మరణించిన వారిలో డెక్ కేడెట్ ఆదిత్య శర్మ, ఇంజిన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా, చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్ ఉన్నారు.

క్షేమంగా ఉన్నా అని మెసేజ్.. అంతలోనే
ఆదిత్య శర్మ మరణం హృదయ విదారకంగా మారింది. దాడికి ఒక గంట ముందు మాత్రమే ఆయన తన తండ్రికి వాట్సాప్‌లో ''నేను క్షేమంగా ఉన్నాను'' అని సందేశం పంపారు. ఆ తరువాత జరిగిన దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. తన కుమారుడి మరణంతో తీవ్ర వేదనకు గురైన ఆయన తండ్రి, వాణిజ్య నౌకపై క్షిపణులతో దాడి చేయడం యుద్ధ నేరంగా పరిగణించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటికే.. ఏంటీ మారివెక్స్ నౌకపై కూడా అమెరికా దాడికి గురైంది. అందులోని 24 మంది భారతీయ నావికులను ఒమాన్ అధికారులు రక్షించారు. అదేవిధంగా ఏంటీ జాల్వేర్ ఏంటీ జావీర్‌ అనే మరో నౌక ప్రమాదంలో చిక్కుకోవడంతో భారత రాయబార కార్యాలయం, ఒమాన్ నౌకాదళం సహాయంతో సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు ప్రారంభించింది.

ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత విదేశాంగ శాఖ అమెరికా ప్రతినిధిని పిలిపించి అధికారిక నిరసన తెలిపింది. భారత ప్రభుత్వం సముద్ర రవాణా రంగంలో పనిచేస్తున్న భారతీయుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేసింది.

ప్రమాదకర పరిస్థితుల్లో నావికులు
ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరాలో కీలక మార్గం. ప్రపంచంలోని రోజువారీ చమురు రవాణాలో సుమారు 20 శాతం ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఈ ప్రాంతంలో కొనసాగుతున్న ఘర్షణల వల్ల వేలాది మంది నావికులు ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement