గ్రీన్‌ల్యాండ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తగ్గేదే లే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో వ్యతిరేక గళం వినిపిస్తున్న యూరప్‌పైనా టారిఫ్ యుద్ధం ప్రకటించారాయన. అయితే ఆ వార్నింగ్‌కు కౌంటర్ యాక్షన్ ఇచ్చేందుకు యూరోపియన్ యూనియన్ (EU) సిద్ధమైంది. తొలిసారి తన వాణిజ్య బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీసింది. ఎక్కువ చేస్తే.. దీనిని అగ్రరాజ్యంపై ఉపయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలిచ్చింది.
ట్రంప్ గ్రీన్‌లాండ్ విషయంలో యూరప్‌పై టారిఫ్‌లు విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఫిబ్రవరి 1 నుంచి డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, యుకే నుంచి వచ్చే వస్తువులపై 10% దిగుమతి పన్ను విధిస్తానన్నారు. అంతటితో ఆగకుండా.. జూన్ 1 నుంచి ఈ పన్ను 25% వరకు పెరగవచ్చని హెచ్చరించారు. అయితే.. ఈయూ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతోంది. ఇది బ్లాక్‌మెయిలింగ్ అవుతుందని మండిపడుతోంది. ఈ క్రమంలోనే శక్తివంతమైన ‘ఏసీఐ’(Anti-Coercion Instrument)ను తెరపైకి తెచ్చింది.
ఇతర దేశాల ఆర్థిక ఒత్తిళ్ల (coercion) నుంచి ఈయూ సభ్య దేశాలను కాపాడుకునేందుకు రూపొందించిందే ఏసీఐ. వాణిజ్య బ్లాక్‌మెయిలింగ్‌లు లేదంటే రాజకీయ ఒత్తిడి ప్రయత్నాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం దీని ఉద్దేశం. ఇది 2023 డిసెంబర్ 27 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఇంతకాలం కాగితానికే పరిమితమైన దానిని.. తొలిసారిగా ఏకంగా అమెరికాపై ప్రయోగించేందుకు ఈయూ రంగం సిద్ధం చేసుకుంటోంది.
ఏసీఐ(Anti-Coercion Instrument).. దీనిని ట్రేడ్ బజుకాగా అభివర్ణిస్తారు. అమెరికాపై దీనిని ప్రయోగిస్తే గనుక.. అమెరికాపై భారీ టారిఫ్‌లు, ఈయూ దేశాల్లో అమెరికా సింగిల్ మార్కెట్ యాక్సెస్‌ను నిరోధించడం, ఎగుమతులను పరిమితం చేయడం లాంటివి జరుగుతాయి. అలాగే పెట్టుబడులపై నియంత్రణలు విధించే అవకాశం లేకపోలేదు. తద్వారా ఈయూలో వ్యాపారం చేసే అమెరికా సంస్థలకు అదనపు అడ్డంకులు ఎదురవుతాయి.
ట్రేడ్ బజుకా ద్వారా సుమారు 93 బిలియన్ పౌండ్ల(రూ11.31) లక్షల కోట్లు విలువైన అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధించే అవకాశముంది. ఈ నేపథ్యంతోనైనా గ్రీన్‌ల్యాండ్ టారిఫ్‌ల విషయంలో అమెరికా వెనక్కి తగ్గే అవకాశం ఉంది. అందుకే ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సహా పలువురు నాయకులు దీన్ని ప్రయోగించాలని అంటున్నారు.
ఈయూ చర్యను ట్రంప్ చర్యలకు కౌంటర్‌గా తీసుకున్న అత్యంత కఠినమైన వాణిజ్య ప్రతీకార చర్యగా విశ్లేషకులు భావిస్తున్నారు. దీని ద్వారా అమెరికాపై భారీ టారిఫ్‌లు విధించవచ్చు. అయితే.. ఇది అమెరికా–యూరప్ వాణిజ్య సంబంధాల్లో కొత్త ఉద్రిక్తతలకు దారి తీయడంతో పాటు అంతర్జాతీయ సంక్షోభానికి దారి తీసే అవకాశం ఉందని ఆదోళన వ్యక్తం అవుతోంది.


