బెల్జియం: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్ తగిలింది. గ్రీన్‌లాండ్ దక్కించునేందుకు అమెరికా ప్రయత్నిస్తుండగా.. అందుకు ఒప్పుకోని యూరోపియన్ యూనియన్ దేశాలపై సుంకాలు విధిస్తామని ట్రంప్ బెదిరింపులకు దిగాడు. అయితే, ఈక్రమంలో ట్రంప్ బెదిరింపులకు తాము తలొగ్గబోమని, అవసరమైతే అమెరికాతో ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాల్ని రద్దు చేసుకుంటామంటూ యూరోపియన్ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది. అంతేకాదు, తమ దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికన్ కంపెనీలపై సుంకాల పేరుతో ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
గత ఏడాది జూలైలో అమెరికా-యూరోపియన్ యూనియన్ దేశాల మధ్య వాణిజ్య చర్చలు ప్రారంభమయ్యాయి. కానీ ట్రంప్ తాజా బెదిరింపులు ఈ ఒప్పంద భవిష్యత్తుపై ఆందోళనలను రేకెత్తించాయి. ఫిబ్రవరి 1 నుంచి గ్రీన్‌లాండ్ కొనుగోలుకు ఒప్పుకోని డెన్మార్క్‌తో సహా ఎనిమిది దేశాలపై 10శాతం సుంకం విధిస్తామని స్పష్టం చేశారు. అప్పటికీ ఒప్పుకోకపోతే, జూన్ నుంచి ఈ సుంకం 25 శాతం వరకు పెరుగుతుందన్నారు. గ్రీన్‌లాండ్ అమెరికా జాతీయ భద్రతకు కీలకం. చైనా, రష్యా ఈ ప్రాంతంలో ఆధిపత్యం పెంచుతున్నందున గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకోవడం అమెరికాకు అవసరమని ట్రంప్ పేర్కొన్నారు.
ఈ క్రమంలో డెన్మార్క్‌తో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు ఈ ప్రతిపాదనను తిరస్కరించాయి. ఈయూ నాయకులు సైతం సోషల్ మీడియా వేదికగా..‘అమెరికా బెదిరింపులకు తలొగ్గం. అవసరమైతే ఒప్పందాలను రద్దు చేస్తాం’ అని స్పష్టం చేశారు. అదే సమయంలో యూరప్‌లో పనిచేస్తున్న అమెరికన్ కంపెనీలపై జరిమానాలు, నిషేధాలు విధించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇది గూగుల్, మెటా, ఎక్స్ వంటి టెక్ దిగ్గజాలకు పెద్ద ఎదురుదెబ్బే అవుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ట్రంప్ సైనిక చర్య తీసుకోవచ్చనే భయంతో జర్మనీ, స్వీడన్, ఫ్రాన్స్ గ్రీన్‌లాండ్‌లో దళాలను మోహరించాయి. డెన్మార్క్ కూడా తన సైనిక ఉనికిని పెంచుకుంది. ట్రంప్ సైనిక చర్య తీసుకుంటే నాటో కూటమి కూలిపోతుంది. ఈ పరిస్థితి ట్రాన్స్ అట్లాంటిక్ భద్రతా వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది.
గ్రీన్‌లాండ్ వివాదం అమెరికా-ఈయూ సంబంధాలను కొత్త సంక్షోభంలోకి నెడుతోంది. ట్రంప్ సుంకాల బెదిరింపులు, ఈయూ ప్రతిస్పందన, సైనిక ఉద్రిక్తత అన్నీ కలిపి ఇరు దేశాల వాణిజ్య ఒప్పంద భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయి. రానున్న రోజుల్లో ఈ సమస్య అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక రంగంలో ప్రధాన చర్చగా మారనుంది.


