
వేల ఏళ్లనాటి స్వర్ణ కంకణాన్ని అత్యల్ప ధరకు అమ్ముకున్న దొంగ
కైరో: దాదాపు 3,000 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉండి అలనాటి ఈజిప్ట్ ఫారో రాజుల ఘనతను చాటిన స్వర్ణకంకణం చోరీ కథ చివరకు విషాదంగా ముగిసింది. ఈజిప్ట్ లోని ప్రఖ్యాత మ్యూజియంకు సంబంధించిన పునరుద్ధరణ ల్యాబ్‌లో తస్కరణకు గురైన కంకణాన్ని వెతికిపట్టుకునేందుకు రంగంలోకి దిగిన ఈజిప్ట్ దర్యాప్తు సంస్థ అధికారులు, పోలీసులుకు చివరకు ముద్ద బంగారమే లభించింది.
సీసీకెమెరాల లేని ల్యాబ్‌లో కంకణం చోరీకి గురయ్యాక పలువురు అక్రమ పురాతన వస్తువుల డీలర్ల చేతులు మారి చివరకు స్వర్ణకారుల చేతుల్లో పడి కరిగిపోయింది. తొలుత చోరీ చేరిన దొంగ మొదలు చివరిసారిగా కొనుగోలుచేసిన వ్యక్తిదాకా ఎవరికీ దాని చారిత్రక నేపథ్యం, అమూల్యమైన అంతర్జాతీయ మార్కెట్ విలువ తెలియదు. దీంతో సాధారణ బంగారు కడియంగా భావించి దానిని కరిగించి ముడి బంగారాన్ని బయటకుతీశారు.
ఇటలీలో ఒక పురాతన వస్తు ప్రదర్శన కోసం కైరో నగరంలోని తహ్రీర్ స్క్వేర్‌లోని ప్రఖ్యాత మ్యూజియం నుంచి ఈ కంకణాన్ని తెప్పించగా సెపె్టంబర్ 9వ తేదీన చోరీకి గురైన విషయం తెల్సిందే. క్రీస్తు పూర్వం 1,076 సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 723 సంవత్సరాల కాలంలో ఈజిప్ట్ ను పరిపాలించిన రాజవంశానికి చెందిన అమేనీమోప్ ఫారో రాజుకు చెందిన ఈ కంకణంను అమేనీమోప్ ఆన్‌ఆర్‌టీ–4 ఛాంబర్‌లో గతంలో కనుగొన్నారు. మధ్యలో లాపిస్ లజూలీ మణిపూస పొదిగిన ఈ కంకణం అత్యంత అరుదైంది. చోరీ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్‌చేశారు. చేతులు మారిన నగదునూ స్వా«దీనంచేసుకున్నారు.
అసలేమైంది?
భద్రంగా ‘సేఫ్’లో దాచిన కంకణాన్ని ల్యాబ్‌లో పునరుద్ధరణ పనులు చూసే ఒక మహిళా నిపుణురాలు దొంగలించింది. ఆమె కైరోలోని ఒక వెండి దుకాణం యజమానికి అత్యల్ప ధరకు విక్రయించింది. దీనిని ఆ వెండి దుకాణదారు మరో బంగారం దుకాణం యజమానికి కేవలం 3,800 డాలర్లకు విక్రయించాడు. దీనిని అతను 200 డాలర్ల లాభానికి అంటే 4,000 డాలర్లకు మరో బంగారం దుకాణయజమానికి అమ్మేశాడు. ఇతను కంకణాన్ని కరిగించి వచి్చన బంగారంతో తన కస్టమర్లకు కావాల్సిన స్వర్ణాభరణాలు చేసి ఇచ్చి డబ్బు సంపాదించాడు. కంకణం కోసం బయల్దేరిన పోలీసులకు కంకణానికి బదులు ఈ నలుగురు నేరస్తులు చిక్కారని ఈజిప్ట్ పర్యాటక, పురాతత్వ శాఖ మంత్రి షెరీఫ్ ఫతీ చెప్పారు.
‘‘కంకణం మాత్రమే కాదు ఈజిప్ట్ లో మరెన్నో చారిత్రక వస్తువులకు సరైన భద్రత లేదు. మ్యూజియంలలో సీసీటీవీలు సరిగా పనిచేయవు. రక్షణ ఏర్పాట్లను పటిష్టంచేయకపోతే అమూల్యసంపద ఇలాగే అదృశ్యమయ్యే ప్రమాదం ఉంది’’ అని ఈజిప్ట్ మహిళా పురాతత్వవేత్త మోనికా హనా ఆవేదన వ్యక్తంచేశారు. ఈమె ఈజిప్ట్ నుంచి విదేశాలకు అక్రమంగా తరలిపోయి అక్కడి మ్యూజియంలలో ప్రత్యక్షమైన పలు వస్తువులను తిరిగి తీసుకొచ్చేందుకు ఉద్యమిస్తున్నారు. ఈమె అరబ్ అకాడమీ ఫర్ సైన్స్, టెక్నాలజీ, మారిటైమ్ ట్రాన్స్‌పోర్ట్ యూనివర్సిటీలో డీన్‌గా సేవలందిస్తున్నారు.