అమెరికా వైట్‌ హౌజ్‌ చీఫ్‌ మెడికల్‌ అడ్వైజర్‌ డా.ఫౌచీ హెచ్చరిక

Dr Anthony Fauci Comments On Covid Situations In India - Sakshi

న్యూయార్క్‌ : భారత్‌లో ప్రస్తుత కరోనా పరిస్థితులపై అమెరికా వైట్‌ హౌజ్‌ చీఫ్‌ మెడికల్‌ అడ్వైజర్‌ డా. ఆంథోనీ ఫౌచీ కీలక వ్యాఖ్యలు చేశారు. నిత్యం లక్షల్లో నమోదవుతున్న కేసులు, వేల సంఖ్యలో మరణాలపై ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో వెంటనే 3-4 వారాలపాటు లాక్‌డౌన్ విధించాలని విజ్ఞప్తి చేశారు. వైరస్ సంక్రమణను బ్రేక్ చేయడానికి లాక్‌డౌన్ తప్పదన్నారు. లాక్‌డౌన్‌తో ఆర్థికవ్యవస్థ దెబ్బతింటుందనే ఆందోళన వద్దని, లాక్‌డౌన్‌ కారణంగా కలిగే ఆర్థిక నష్టం కంటే పెట్టకపోతే వచ్చే నష్టం ఇంకా పెద్దదన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఊహించని నష్టం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తాత్కాలిక హాస్పిటల్స్‌, కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. వీలైనంత ఎక్కువమందికి వ్యాక్సిన్‌ ఇవ్వాలని, వ్యాక్సిన్ ఉత్పత్తి గణనీయంగా పెంచాలని తెలిపారు. ఎక్కువ కంపెనీల్లో వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయాలన్నారు. కష్టకాలంలో ఇతర దేశాలకు భారత్‌ అండగా నిలిచిందని, ప్రస్తుతం భారత్‌కు ప్రపంచదేశాలు మద్దతుగా నిలవాలని.. వైద్య పరికరాలు అందించడమే కాదు.. వైద్య సిబ్బందిని పంపాలని కోరారు.

కొద్దిరోజుల క్రితం కూడా ఆయన భారత్‌లోని కరోనా పరిస్థితులపై మాట్లాడుతూ.. ‘‘కోవిడ్‌ వ్యాప్తి తీవ్రతతో భారత్‌ చాలా ఒత్తిడికి గురవుతోంది. అమెరికా మాదిరిగానే మిగతా దేశాలు కూడా భారత్‌కు సాయం అందించేందుకు ముందుకు రావాలి. భారత్‌లో కోవిడ్‌ చికిత్సలో ఉపయోగించే వైద్య సామాగ్రి కొరత ఉన్న దృష్ట్యా ప్రపంచ దేశాలు అవసరమైన ఆ సామాగ్రిని అందజేయాలి. దీంతోపాటు వైద్య సిబ్బందిని కూడా పంపించాలి. అదే సమయంలో, వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం పౌరులందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలి. భారత్‌లో అభివృద్ధి పరిచిన రెండు టీకాలతోపాటు, అమెరికా, రష్యాతోపాటు ఇందుకోసం ముందుకు వచ్చే మరే ఇతర దేశాలకు చెందిన సంస్థల నుంచయినా సరే కూడా టీకాలను సేకరించి సాధ్యమైనంత మందికి ఇవ్వడం తక్షణం ప్రారంభించాలి. టీకా ఇవ్వడం వల్ల ప్రస్తుతానికి సమస్య పరిష్కారం కాకపోవచ్చు. కానీ, కొన్ని వారాలపాటు వ్యాధి వ్యాప్తిని నిరోధించవచ్చు’’అని ఫౌచీ పేర్కొన్నారు.

చదవండి : భారత్‌లో పరిస్థితి తీవ్ర ఆందోళనగా ఉంది..సైన్యాన్ని దించండి

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top