
ఫోన్, టెలికాం నెట్‌వర్క్‌ల ట్రేడ్‌మార్క్‌కు దరఖాస్తు
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆయన మద్దతుదారులు రెడ్ టోపీలను మాత్రమే కాదు.. ఇక నుంచి పసిడి వర్ణపు ఫోన్లను కూడా క్యారీ చేయనున్నారు. ఎందుకంటే ట్రంప్ ఇప్పుడు టెలికాం రంగంపై దృష్టి సారించారు. కొత్త ఫోన్ బ్రాండ్‌తోపాటు ఒక నెట్‌వర్క్‌నే ఏర్పాటు చేయాలనే ప్రణాళికలో ఉన్నారు. ఆయన ట్రేడ్‌మార్క్‌లను నిర్వహించే కంపెనీ డీటీటీఎమ్ ఆపరేషన్స్ ఎల్‌ఎల్‌సీ రెండు ట్రేడ్ మార్క్‌లకోసం యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ అండ్ ట్రేడ్‌మార్క్ ఆఫీస్‌లో దరఖాస్తు చేసుకుంది. అందులో ట్రంప్ బ్రాండ్ మొబైల్‌ఫోన్, టెలికాం నెట్‌వర్క్ ఉన్నట్లు తెలుస్తోంది.
జూన్ 12న ట్రంప్, టీ1 పేర్లపై పేటెంట్ కోరినట్లు తెలుస్తోంది. దరఖాస్తు పత్రాల ప్రకారం.. మొబైల్ ఫోన్లు, ఫోన్‌కేసులు, బ్యాటరీ ఛార్జర్లు, వైర్‌లెస్ టెలికాం సేవలు, ట్రంప్ బ్రాండ్‌తో రీటైల్ దుకాణాలు ప్రారంభించే ప్రణాళికలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి ఊతమిస్తూ ట్రంప్ వ్యాపారాలను నిర్వహించే ఆయన కుమారుడు ఎరిక్ ట్రంప్ ఓ ప్రకటన చేశారు. ట్రంప్ మొబైల్ అనే కొత్త వెంచర్ అమెరికాలో తయారయ్యే ఫోన్లను విక్రయిస్తుందని, కాల్ సెంటర్‌కూడా నిర్వహిస్తుందని వెల్లడించారు. ఆగస్టులో అందుబాటులోకి వచ్చే టీ1 ఫోన్ బంగారు రంగులో ఉంటుందని, అయితే దీనిని మరో కంపెనీ తయారు చేస్తుందని ట్రంప్ కుటుంబ సంస్థ తెలిపింది. మరిన్ని వివరాలను వెల్లడించలేదు.