టారిఫ్‌ల ఎఫెక్ట్‌.. కోర్టు తీర్పుపై ట్రంప్‌నకు టెన్షన్‌! | Donald Trump Key Comments On Tariff Issue In Supreme Court | Sakshi
Sakshi News home page

టారిఫ్‌ల ఎఫెక్ట్‌.. కోర్టు తీర్పుపై ట్రంప్‌నకు టెన్షన్‌!

Jan 14 2026 11:28 AM | Updated on Jan 14 2026 11:54 AM

Donald Trump Key Comments On Tariff Issue In Supreme Court

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు టెన్షన్‌ మొదలైంది. ట్రంప్‌ అమలు చేసిన టారిఫ్‌ విధానాలపై అక్కడి సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు ఇవ్వనుంది. మరోవైపు.. ఒకవేళ కోర్టు టారిఫ్‌లను వ్యతిరేకిస్తూ తమ ప్లాన్‌-బీ ఉందని ధీమా వ్యక్తం చేశారు. దీంతో, కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.. ట్రంప్‌ ఏం చేస్తారా? అని ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కోర్టు తీర్పు నేపథ్యంలో స్పందిస్తూ..‘మా ప్రభుత్వం విధించిన సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు నిలిపివేస్తే ప్రత్యామ్నాయ మార్గాలను తప్పకుండా అన్వేషిస్తాం. ఇతర అవకాశాలను వెతుక్కుంటాం. ప్లాన్‌-బీ అమలు చేస్తాం. చైనా ప్రయోజనాలను కాపాడాలనే ఉద్దేశంతోనే కొందరు ఈ టారిఫ్‌లపై కోర్టుల్లో కేసులు వేశారు. నేను అమలు చేసిన టారిఫ్‌ల వల్ల తక్కువ కాలంలోనే ఫెడరల్‌ బడ్జెట్‌ లోటు సుమారు 27 శాతం వరకు తగ్గింది. ఈ సుంకాల కారణంగా అమెరికాలో వినియోగదారుల ఖర్చులు పెరిగాయని విమర్శలు వస్తున్నాయి. అయితే అది నిజం కాదు. ఈ టారిఫ్‌లను విదేశీ దేశాలే చెల్లిస్తున్నాయి. అమెరికా వినియోగదారులపై ఎలాంటి భారం పడటం లేదు. ఈ విషయంలో నేను తీసుకున్న నిర్ణయం పూర్తిగా సరైనదే’ అని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా.. అమెరికాలో డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అనేక దేశాలపై సుంకాలు విధించడం ప్రారంభించారు. తన ఇష్టానుసారం పలు దేశాలను బెదిరింపులకు గురిచేస్తూ సుంకాల పేరుతో బాదడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా న్యాయస్థానాల్లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం ఈ అంశం దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు పరిధిలోకి చేరింది. టారిఫ్‌ల అమలులో ట్రంప్‌ అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని ఉల్లంఘించారా? లేదా? అనే అంశంపై సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే, ఒకవేళ సుప్రీంకోర్టు తాను విధించిన సుంకాలను రద్దు చేస్తే ప్రభుత్వం తీవ్ర ఇబ్బందుల్లో పడుతుందని, ఇప్పటివరకు వసూలు చేసిన టారిఫ్‌లను తిరిగి చెల్లించడం అసాధ్యమని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. దీంతో, కొంత ఆందోళనకు గురవుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement