2024లో మళ్లీ వస్తా: ట్రంప్‌

Donald Trump hints at run for president in 2024 - Sakshi

వాషింగ్టన్‌: 2024 అధ్యక్ష ఎన్నికల బరిలో ఉంటానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంకేతాలిచ్చారు. బైడెన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘అమెరికా ఫస్ట్‌’ నుంచి ‘అమెరికా లాస్ట్‌’కు దిగజారామన్నారు. అధ్యక్ష పదవి నుంచి దిగిపోయాక సోమవారం తొలిసారి బహిరంగ సమావేశంలో ట్రంప్‌ పాల్గొన్నారు. ఆర్లాండొలో జరిగిన కన్జర్వేటివ్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ సమావేశంలో ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘మనం మళ్లీ గెలుపుబాట పట్టాలి. ముందు సెనెట్‌ ఎన్నికల్లో గెలుపొందాలి. తరువాత, రిపబ్లికన్‌ అధ్యక్షుడు వైట్‌హౌజ్‌లో మళ్లీ అడుగుపెట్టాలి’ అని మద్దతుదారుల హర్షధ్వానాల మధ్య వ్యాఖ్యానించారు. 2022 మిడ్‌ టర్మ్‌ ఎన్నికల్లో డెమొక్రాట్‌ అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు.

కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదని, అలా చేయడం వల్ల కన్సర్వేటివ్‌ ఓట్లు చీలుతాయని ట్రంప్‌ పేర్కొన్నారు. రిపబ్లికన్‌ ప్రైమరీల్లో ట్రంప్‌ గెలిస్తే.. ఆయనకు అధ్యక్ష ఎన్నికల్లో మద్దతిస్తానని రిపబ్లికన్‌ పార్టీ సీనియర్‌ నేత మిట్‌ రోమ్నీ ఇప్పటికే ప్రకటించారు. కరోనాపై పోరు సహా అన్ని అంశాల్లో బైడెన్‌ ప్రభుత్వం విఫలమైందని ట్రంప్‌ విమర్శించారు. అక్రమ వలసదారుల కోసం సరిహద్దులను తెరిచారన్నారు. ట్రంపిజం అంటే దృఢమైన సరిహద్దులని వ్యాఖ్యానించారు. పారిస్‌ ఒప్పందంలో అమెరికా తిరిగి చేరడంపై బైడెన్‌పై విమర్శలు గుప్పించారు. వాతావరణ సమతౌల్యత విషయంలో అమెరికా కన్నా భారత్, చైనా, రష్యాల బాధ్యత ఎక్కువగా ఉందని స్పష్టం చేశారు. ‘రష్యా, చైనా, భారత్‌లు కాలుష్యాన్ని వెదజల్లుతూ ఉంటే, ఆ భారం మనపై పడుతోంది’ అని విమర్శించారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top