అమెరికాలో.. స్వేచ్ఛకు తూట్లు..! పెరుగుతున్న పేదరికం..!! | Donald Trump has completed his first year in office as President | Sakshi
Sakshi News home page

అమెరికాలో.. స్వేచ్ఛకు తూట్లు..! పెరుగుతున్న పేదరికం..!!

Jan 19 2026 5:20 PM | Updated on Jan 19 2026 5:34 PM

Donald Trump has completed his first year in office as President

వాషింగ్టన్‌ డీసీ: ‘అందమైన లోకమని.. రంగురంగులుంటాయని.. అందరూ అంటుంటారు రామరామ.. అంత అందమైంది కానేకాదు చెల్లెమ్మా’ అని సినీకవి అన్న మాటలు అగ్రరాజ్యం అమెరికాకు సరిగ్గా నప్పుతాయి..! స్వేచ్ఛాసమానత్వాల భూమిగా అమెరికా గడ్డకు పేరుంది. కానీ, ఆ పేరు వెనక విరోధ భావాలు కూడా ఉన్నాయి. అణచివేత ధోరణులూ ఉన్నాయి. మరో కోణంలో అమెరికాను చూస్తే.. విస్తుపోయే నిజాలు కనిపిస్తాయి. డొనాల్డ్ ట్రంప్ ఏడాది పాలన నేపథ్యంలో.. ‘అమెరికా మరో పార్శ్వం’పై సాక్షి డిజిటల్ ఎక్స్‌క్లూజివ్ స్పెషల్ రిపోర్ట్..

గన్‌కల్చర్‌కు అమెరికా పెట్టింది పేరు..! ఎప్పుడు ఏ బడిలో తూటా పేలుతుందో తెలియదు..! ఎప్పుడు ఏ పబ్లిక్ ఈవెంట్‌పై ఉన్మాదుల తుపాకీ గర్జిస్తుందో ఊహించలేం..! మనుషుల కంటే తుపాకులే ఎక్కువ సంఖ్యలో ఉన్న దేశం అమెరికా. విద్యార్థులు పరీక్షలకు కాకుండా.. గన్ షూటింగ్‌కు సన్నద్ధమవుతుంటారు. తొమ్మిది.. పదేళ్ల వయసులోనే బ్యాగులో తుపాకీ తెచ్చుకుని, కోపంతో టీచర్లు, తోటి విద్యార్థులపై గురిపెడతారు. 

33.5 కోట్ల జనాభాకు 40 కోట్ల గన్స్ ఉండడం పరిస్థితి తీవ్రతకు దర్పణం పడుతోంది. 2024లో తుపాకీ తూటాలకు 40 వేల మంది బలవ్వగా.. వారిలో 1,200 మంది చిన్నపిల్లలున్నారు. అమెరికాలో తల్లిదండ్రులు ఏకంగా తమ పిల్లలకు బుల్లెట్ ప్రూఫ్ బ్యాగులు, దుస్తులు కొనే పరిస్థితి అక్కడ నెలకొంది. తుపాకీ కారణంగా అమెరికాలో పౌరులు బిక్కుబిక్కుమంటూ గడిపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి పౌరులకు స్వేచ్ఛ ఉన్నట్లా..? లేనట్లా..?

స్వేచ్ఛావాయువులు అమెరికాలో బలంగా వీస్తాయంటారు. ఇంకా చెప్పాలంటే.. ఫలానా దేశంలో స్వేచ్ఛేలేదంటూ రిపోర్టులిచ్చే ఎన్నెన్నో ఏజెన్సీలకు అమెరికా ఆలవాలం. ఫలానా దేశంలో ఫలానా మతస్థులను ఊచకోత కోస్తున్నారంటూ గగ్గోలు పెట్టే మీడియా అమెరికాకు సొంతం. అయితే.. ఇదంతా గురివింద చందమే..! అమెరికాలో జాతి వివక్ష ఏమాత్రం తగ్గ లేదు. ఇంకా చెప్పాలంటే.. అమెరికా జైళ్లలో ఉంటున్న ఖైదీల్లో శ్వేత జాతీయుల కంటే.. నల్ల జాతీయుల సంఖ్య ఐదు రెట్లు అధికంగా ఉంటోంది. 

అమెరికాలో జీఈ, న్యూస్ కార్ప్, డిస్నీ, వియాకామ్, టైమ్ వార్నర్, సీబీఎస్ అనే ఆరు సంస్థల చేతుల్లో 90% మీడియా ఉంది. ఈ సంస్థలేవీ అమెరికాలో జరుగుతున్న జాతి వివక్షను బయటి ప్రపంచానికి చూపించవు. కానీ, భారత్ లాంటి దేశాల్లో స్వేచ్ఛ లేదంటూ గగ్గోలు పెడతాయి. అమెరికా జైళ్లలో రెండు మిలియన్ల ఖైదీలుండగా.. వీరిలో సింహభాగం శ్వేతజాతీయులు కాని వారే. 21 లక్షల మంది జైళ్లలో మగ్గుతున్నారు. వీరితో జైళ్లలో బండ చాకిరీ చేయించుకుని, ముష్టి పారేసినట్లు గంటకు 25 సెంట్ల చొప్పున కూలీ ఇస్తారు.
 
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కడో స్లమ్‌లలో పరిస్థితులను భూతద్దంలో చూపించే అమెరికా మీడియా.. ఆయా దేశాల్లో పేదరికం పేట్రేగుతోందని, ప్రజలు కూడు, గూడు, గుడ్డకు నోచుకోవడం లేదని చూపడం సహజమే..! అయితే.. అమెరికాలో అంతా సంపన్నులే ఉన్నారా? పేదలే లేరా? అనే ప్రశ్నకు పాశ్చాత్య మీడియా కూడా నోరు మెదపదు. నిజమేంటంటే.. అమెరికాలో 18శాతం మంది పౌరులు నిరాశ్రయులు. ఆరున్నర లక్షల మంది పౌరులు వంతెనల కింద, రోడ్లపైనే నిద్రిస్తుంటారు. సైనికులు ఏర్పాటు చేసే టెంట్లలో 40 వేల మంది నిద్రిస్తారని అంచనా..! ఇక లాస్ ఏంజిల్స్, సాన్ ఫ్రాన్సిస్కో, సియాటిల్ ప్రాంతాల్లో ఏకంగా ‘టెంట్ సిటీస్’ పేరుతో పేదల బస్తీలు పుట్టుకొస్తున్నాయి. అదే సమయంలో.. బిలియనీర్ల సంపద ఒక్క కొవిడ్ సమయంలోనే 2 ట్రిలియన్ డాలర్ల మేర పెరగడం గమనార్హం..! 

ఏటా వైద్యంపై 4.5 ట్రిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నామని అమెరికా గొప్పలు చెప్పుకొంటోంది. అయితే.. అనారోగ్యంతో సరైన వైద్యం అందక అమెరికాలో చనిపోతున్న వారి ఏటా 50 వేల మంది చనిపోతున్నట్లు ఓ నివేదిక ఉంది. అమెరికా అంటేనే వైద్య బీమా తప్పనిసరి అంటారు. అది కేవలం ఇమిగ్రెంట్లకేనని తెలుస్తోంది. ఇప్పటికీ అమెరికాలో 2 కోట్ల 70 లక్షల మంది పౌరులకు బీమా అందడం లేదని, ఐదు లక్షల కుటుంబాలు వైద్య ఖర్చుల కారణంగా దివాళా తీస్తున్నాయని పలు నివేదికలు వచ్చాయి. వైద్యం ప్రాథమిక హక్కు అని చెప్పుకొనే అమెరికాలో ఒక సర్జరీ కాస్ట్ 50 వేల డాలర్లుగా.. అంబులెన్స్ చార్జీలు కనీసం రెండు వేల డాలర్లుగా ఉండడం గమనార్హం..! అంటే.. అమెరికాలో రోగి ప్రాణాన్ని ధనమే నిర్ణయిస్తుందని స్పష్టమవుతోంది. 
 
ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఇప్పుడు అమెరికాలో ధరాభారం పెరిగింది. అమెరికాలో ఒక సగటు ఉద్యోగి జీతం తీసుకుని ఒక్కరోజు గడవక ముందే.. మళ్లీ జీతం రావడానికి ఎన్నిరోజులు ఉందా? అని లెక్కలేసుకుంటున్నాడు. ఈ కోవలో 60శాతం మంది ఉద్యోగులు ఉన్నట్లు ఓ అధ్యయనం చెబుతోంది. ఇళ్ల ధరలు, అద్దెలు, విద్య, వైద్యం, నిత్యావసరాలు.. ఇలా అన్నీ చుక్కలనంటుతున్నాయి. దిగుమతులపై ట్రంప్ టారిఫ్‌లతో ధరలు పెరిగి, అమెరికా పౌరులు విలవిల్లాడుతున్నారు. వేతనాలు పెరగవు.. ధరలు తగ్గవు అంటూ నిట్టూరుస్తున్నారు. 
 
భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎన్నికల వ్యవస్థపై అభాండాలు వేసే అమెరికాలో.. ఎన్నికలు కూడా అత్యంత ఖరీదుతో కూడుకున్నవే..! ట్రంప్ విజయం సాధించిన 2024 ఎన్నికలు అమెరికా చరిత్రలోనే అత్యంత ఖరీదైనవిగా నిలిచిపోయాయి. ఇందుకు 16 బిలియన్ డాలర్ల మేర ఖర్చయిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఖర్చులో కార్పొరేట్ కంపెనీల విరాళాలు కూడా ఉంటాయి. ఫలితంగా ఆయా సంస్థలు తమకు అనుకూల చట్టాలు తెప్పించుకుంటాయి. నేతల స్టాక్ పోర్ట్‌ఫోలియోలు కూడా విమర్శలకు తావిస్తున్నాయి. 2023లో 50 మంది నేతలు ఈ తరహాలో వ్యాపారం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. 
 
ఇక అమెరికాలో ట్రంప్ వంటి పాలకుల కారణంగా.. పౌరుల్లో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. ప్రతి ఐదుగురిలో ఒకరు ఏదో ఒక రకమైన మానసిక రుగ్మతను ఎదుర్కొంటున్నట్లు అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ సైకియాట్రీ చెబుతుంగా.. ఈ కారణాలతో 15 – 34 ఏజ్ గ్రూప్ వారిలోనే ఎక్కువగా ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. ఒంటరితనం, ఒత్తిడి, డ్రగ్స్ వంటివి ఈ ఆత్మహత్యలకు కారణాలుగా తెలుస్తోంది. యాంటీ డిప్రెసెంట్ ఔషధాలు అత్యధికంగా అమెరికాలోనే వినియోగమవుతున్నట్లు సమాచారం. ఓహియో, వెస్ట్ వర్జీనియా, పెన్సిల్వేనియా వంటి రాష్ట్రాల్లో డ్రగ్స్ వ్యసనం తీవ్రంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. డ్రగ్స్ ఓవర్ డోస్ మరణాలు కూడా ఇక్కడ ఎక్కువే..! ఇక్కడి యువత డీ-అడిక్షన్ ఔషధాల కోసం వేల డాలర్లు ఖర్చుపెడుతోంది. ఎడ్వర్డ్ స్నోడెన్ డేటా ఈ విషయాలను చెబుతోంది.

ఇక టెక్నాలజీ.. డిజిటల్ యుగం అని చెప్పే అమెరికాలో యువత చదువు కోసం విలవిల్లాడుతోంది. విద్య ఓ హక్కు అయినా.. మన విద్యావేత్త చుక్కా రామయ్య లాంటి వారు రాసిన ‘అమెరికా పాఠం’ వంటి పుస్తకాల్లో ఆ దేశంలో విద్యకు ఇచ్చే ప్రాధాన్యతను చక్కగా వివరించినా.. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. విద్యలో ఒకప్పుడు అమెరికా నాయకత్వ ధోరణిలో ఉన్నా.. ఇప్పుడు విద్యపై అప్పులు పెరుగుతున్నాయి. స్టూడెంట్ డెబ్ట్ ఇప్పుడు 1.7 ట్రిలియన్ డాలర్లను దాటినట్లు అంచనా. సగటు కాలేజీ విద్యార్థి 38 వేల డాలర్ల మేర అప్పును భరిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం పాఠశాలల బడ్జెట్‌ను తగ్గిస్తోంది. ప్రైవేటు యూనివర్సిటీలు భారీ లాభాల్లో ఉంటున్నాయి. అమెరికాలో ఇప్పుడు విద్య అంటే ఆలోచనల సృష్టి కాదు. ఉద్యోగుల తయారీ వ్యాపారం అనే స్థాయికి చేరుకుంది. ఇక కాలుష్యంలోనూ అమెరికా అతిపెద్ద ఉత్పత్తిదారు కావడం తెలిసిందే. ఏటా 5 బిలియన్ టన్నుల మేర కార్బన్-డై-యాక్సైడ్ ఆ దేశంలో ఉత్పత్తి అవుతోంది. క్లైమేట్ యాక్షన్, పారిస్ ఒప్పందాలను తీవ్రంగా నిర్లక్ష్యం చేసేది కూడా అమెరికానే. ప్రపంచాన్ని పాలించాలని ట్రంప్ ఉవ్విళ్లూరుతుంటే.. ఆ ప్రపంచాన్ని నాశనం చేసే రేంజ్‌లో కాలుష్యం వెదజల్లుతోంది అమెరికా..! ఇప్పుడు చెప్పండి.. ఇంతటి దరిద్రాలను కలిగి ఉన్న అమెరికాకు వెళ్లడం.. అక్కడ సెటిల్ అవ్వాలని, గ్రీన్‌కార్డు పొందాలని ఆశించడం సరైనదేనా?? 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement