
దుమ్మెత్తిపోసుకుంటున్న మాజీ మిత్రులు
కొంతకాలంగా ఉప్పునిప్పుగా వ్యవహారం
‘బ్యూటిఫుల్’ బిల్లుతో రచ్చకెక్కిన విభేదాలు
సెక్స్ కుంభకోణంలో ట్రంప్ పేరు: మస్క్
ఎప్‌స్టీన్ ఫైళ్లు బయటపెట్టనిది అందుకే
ఆ ఉదంతంలో గద్దె దిగడం ఖాయం
వాన్స్ అధ్యక్షుడవుతారంటూ జోస్యం
మస్క్‌కు మతి చలించినట్టుంది: ట్రంప్
కాంట్రాక్టులన్నీ ఆపేస్తానని హెచ్చరిక
వాషింగ్టన్: ఒకరు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. మరొకరు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశానికి అధినేత. బెదిరించి పనులు చక్కబెట్టుకోవడంలో, అవసరం తీరిందనుకుంటే ఎంతటి వారినైనా సరే దూరం పెట్టడంలో, భావోద్వేగాలకు తావన్నదే లేకుండా స్వీయ ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరించడంలో ఒకరికొకరు ఏ మాత్రమూ తీసిపోరు. అలాంటి వాళ్లు పరస్పరం తలపడితే ఎలా ఉంటుంది? అచ్చం ఎలాన్ మస్క్ , డొనాల్డ్ ట్రంప్ తాజా రగడ మాదిరిగానే ఉంటుంది.
నిజానికి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు మొదలైన వారి బ్రొమాన్స్ ట్రంప్ గద్దెనెక్కాక కూడా బ్రహా్మండంగా కొనసాగింది. అవకాశం దొరికినప్పుడల్లా మస్క్ ను ఇంద్రుడు చంద్రుడంటూ ట్రంప్ ఆకాశానికెత్తేశారు. ప్రభుత్వ వ్యయానికి కత్తెర వేసేందుకు సృష్టించిన డోజ్ విభాగపు సారథ్యం అప్పగించారు. దాని ముసుగులో కీలకమైన ప్రభుత్వ డేటాను మస్క్ చేజిక్కించుకున్నారంటూ ఆరోపణలు వచ్చినా పట్టించుకోలేదు.
అధ్యక్ష కార్యాలయమైన ఓవల్ ఆఫీసులో, అధికారిక విమానం ఎయిర్‌ఫోర్స్‌వన్‌లో, కేబినెట్ సమావేశాల్లో... ఇలా ఎక్కడ చూసినా మస్కే. వైట్‌హౌస్‌ను చివరికి మస్క్‌కు అత్తారిల్లుగా మార్చేశారంటూ ట్రంప్‌పై విపక్షాలు దుమ్మెత్తిపోసేదాకా వెళ్లింది. అంతలా కొనసాగిన ట్రంప్, మస్క్ సాన్నిహిత్యానికి మూడు రోజుల క్రితం అనూహ్యంగా, అర్ధాంతరంగా తెరపడింది. అంతే! ఒక్కసారిగా అంతా తల్లకిందులైంది.
అసలే మొండితనంలోనూ, నోటి దురుసులోనూ ఒకరికొకరు ఏ మాత్రమూ తీసిపోని బాపతు కావడంతో పరస్పర నిందలు, విమర్శలు, ఆరోపణలతో ‘తగ్గేదే లే’అంటూ ఇద్దరూ చెలరేగిపోతున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనే రీతిలో సోషల్ మీడియాలో సవాళ్లు విసురుకుంటున్నారు. మస్క్ కు మతి చలించిందంటూ ట్రంప్ దుయ్యబట్టడమే గాక ఆయన స్పేస్ ఎక్స్, స్టార్‌లింక్ తదితర సంస్థలకు బిలియన్ల కొద్దీ డాలర్ల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టులు రద్దు చేసి పారేస్తానని హెచ్చరించారు. దాంతో చిర్రెత్తుకొచ్చిన మస్క్ , దమ్ముంటే ఆ పని చేసి చూపించాలంటూ సవాలు విసిరారు.
నాసాకు అతి కీలకమైన స్పేస్‌ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌక సేవలను తక్షణం నిలిపేస్తానంటూ బెదిరించారు. అంతేగాక, ‘‘అసలు నావల్లే ట్రంప్ అధ్యక్షునిగా గెలిచారు. కనీసం ఆ కృతజ్ఞత కూడా లేకుండా వ్యవహరిస్తున్నారు’’అంటూ మండిపడ్డారు. అంతటితో ఆగకుండా మైనర్లతో సెక్స్ కార్యకలాపాల ‘ఎప్‌స్టీన్ కుంభకోణం’లో ట్రంప్ పేరూ ఉందంటూ పెద్ద బాంబు పేల్చారు. ఈ ఉదంతంలో ఆయన గద్దె దిగడం, ఉపాధ్యక్షుడు వాన్స్ అధ్యక్ష పీఠమెక్కడం తప్పదని జోస్యం చెప్పారు. వారి వాగ్యుద్ధం ఇప్పుడు టాక్ ఆఫ్ ద వరల్డ్‌గా మారిపోయింది. ఇది చివరికి ఎటు దారి తీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
అలా మొదలైంది...
నిజానికి ట్రంప్, మస్క్ సంబంధాలు కొంతకాలంగా ఒడిదొడుకులమయంగానే సాగుతున్నాయి. ప్రభుత్వ పనితీరుపై మస్క్ పెత్తనం మరీ మితిమీరుతోందని ట్రంప్ బృందం ఆక్షేపిస్తూ వస్తోంది. ఆ క్రమంలో ట్రంప్ గద్దెనెక్కిన ఒకట్రెండు రోజుల నుంచే ఆయన సన్నిహితులతో మస్క్ తరచూ గొడవ పడుతూ వస్తున్నారు. వ్యవహారం శ్రుతి మించుతోందని భావించిన ట్రంప్ కూడా క్రమంగా ఆయనను దూరం పెడుతూ వచ్చారు.
డోజ్ సారథిగా కేవలం 130 రోజుల కోసం జరిగిన తన నియామకాన్ని పొడిగిస్తారని మస్క్ ఆశించారని కూడా అంటారు. అలాంటి సూచనలు కన్పించకపోవడంతో ఇటీవల ఆయనే తప్పుకున్నారు. ట్రంప్ ఇటీవల తెరపైకి తెచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ను తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ వ్యయానికి కత్తెర వేస్తానని గొప్పలు చెప్పుకున్న పెద్దమనిషి చివరికిలా భారీ దుబారాకు వీలు కలి్పంచే బిల్లుకు రూపమిచ్చారంటూ నిప్పులు చెరిగారు. దాంతో అప్పటిదాకా సంయమనం పాటిస్తూ వచ్చిన ట్రంప్ కూడా శషభిషలన్నీ పక్కనపెట్టి మస్క్ పై విరుచుకుపడ్డారు.
ఏమిటీ ఎప్‌స్టీన్ కుంభకోణం?
మైనర్ బాలికలతో పాటు మహిళలను లైంగికంగా వేధించినట్టు ఎప్‌స్టీన్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. తన ఎదుగుదల కోసం వారిని సన్నిహితులైన రాజకీయ తదితర రంగాల ప్రముఖులకు ఎరగా వేశాడని అభియోగాలు నమోదయ్యాయి. జాబితాలో ట్రంప్, బిల్ క్లింటన్, ప్రిన్స్ ఆండ్రూ, పలు దేశాల ప్రధానులు, రాజకీయ దిగ్గజాలు, హాలీవుడ్ తారలు తదితరులున్నారు. 2019లో అతను జైల్లో అనుమానాస్పదంగా మరణించాడు. సంబంధిత ఫైళ్లను బయట పెడతానని గత అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ హామీ ఇచ్చారు.
మస్క్ కు ఎదురుదెబ్బలు
విద్యుత్ కార్లపై ట్యాక్స్ క్రెడిట్‌కు ‘బ్యూటిఫుల్’ బిల్లులో భారీ కోతలు ప్రతిపాదించారు. అందులోని పలు అంశాలు తన వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీసేవి కావడం మస్క్ కు మంటెక్కించింది. అంతకుముందు అమెరికా వైమానిక వ్యవస్థ తన స్టార్‌లింక్ శాటిలైట్ సిస్టం సేవలను వాడుకునేలా ఒప్పించేందుకు ప్రయతి్నంచినా కుదరలేదు. మస్క్ సన్నిహితున్ని నాసా చీఫ్ పదవికి పరిగణించొద్దని ట్రంప్ నిర్ణయించారు. ట్రంప్‌తో రగడ నేపథ్యంలో మస్క్ కార్ల కంపెనీ టెస్లా షేర్లు ఏకంగా 14 శాతం పడిపోయాయి.
ట్రంప్ గద్దె దిగుతారు: మస్క్
అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌కు సంబంధాలున్నట్టు మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. ‘‘అతి పెద్ద బాంబు పేల్చాల్సిన సమయం ఆసన్నమైంది. ఎప్‌స్టీన్ దర్యాప్తు ఫైళ్లలో ట్రంప్ పేరు కూడా ఉంది. అందుకే వాటిని ఆయన బయట పెట్టడం లేదు’’అంటూ ఆరోపించారు. ట్రంప్‌ను అభిశంసించాలంటూ ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్‌ను సమరి్థంచారు. వాన్స్‌ను అధ్యక్షున్ని చేయాలన్న పోస్ట్‌ను రీ పోస్ట్ చేస్తూ ‘అవు’నని కామెంట్ చేశారు. ‘‘ట్రంప్ అధ్యక్షునిగా ఉండేది మహా అయితే మూడున్నరేళ్లు. నేను మాత్రం కనీసం ఇంకో 40 ఏళ్ల దాకా ఉంటాను’’ అన్నారు. అమెరికన్లలో కనీసం 80 శాతం మందికి ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ స్థాపనపై ఒపీనియన్ పోల్ పెట్టారు. నాసాకు డ్రాగన్ సేవలు ఆపేయబోనంటూ కాస్త వెనక్కు తగ్గారు.
మస్క్ తో మాట్లాడను: ట్రంప్
మస్క్ వంటి వ్యక్తి డోజ్ పదవిని నెలల క్రితమే వదిలేసి ఉంటే బాగుండేదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ‘బ్యూటిఫుల్ బిల్లు’లో టెస్లాకు మస్క్ ఆశించిన లబ్ధి కని్పంచకపోవడంతో తనపై నిందారోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘ట్రంప్ గురించి కనీసం ఆలోచించడం కూడా లేదు. కొంతకాలం ఆయనతో మాట్లాడబోను’’అని సీఎన్‌ఎన్ వార్తా సంస్థతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. ‘‘పాపం మస్క్ . అతనికేదో సమస్య ఉన్నట్టుంది! బహుశా మతి చలించినట్టుంది’’ అంటూ ఎద్దేవా చేశారు. ‘‘బిలియన్ల కొద్దీ డాలర్లు ఆదా చేసేందుకు సులువైన మార్గం ఒకటుంది. మస్క్ సంస్థలకు అందుతున్న ప్రభుత్వ కాంట్రాక్టులు, రాయితీలను తెగ్గోస్తే చాలు!’’అంటూ గురువారం ట్రూత్ సోషల్‌లో వరుస పోస్టులు పెట్టారు.