అమెరికాలో పని చేయాలంటే 70 వేల డాలర్లు
వారిని చేర్చుకున్న విద్యా సంస్థలే భరించాలి
హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదన
వాషింగ్టన్: అమెరికాలో ఉన్నత చదువులు చదువుకుంటూనే ఖర్చుల కోసం ఏదైనా ఉద్యోగం చేసుకోవాలన్నది విదేశీ విద్యార్థుల ఆకాంక్ష. అయితే, ఇందుకు పలు షరతులు ఉంటాయి. యూనివర్సిటీ బయట ఉద్యోగాలు చేసుకోవడానికి అనుమతి ఉండదు. విదేశీ విద్యార్థులకు పనులు చేసుకొనే అవకాశం కల్పిస్తూనే, వారి నుంచి రుసుము వసూలు చేయాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. చదువుకుంటూనే పని చేసుకోవచ్చు. కానీ, ప్రభుత్వానికి 70,000 డాలర్ల రుసుమును వారిని చేర్చుకున్న విద్యాసంస్థలే చెల్లించాల్సి ఉంటుంది.
అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం బుధవారం ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. దీనిప్రకారం.. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ) అని పిలిచే కార్యక్రమంలో పాల్గొనే ప్రతి విద్యారి్థకి గాను సంబంధిత విద్యా సంస్థలే రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమం ద్వారా విదేశీ విద్యార్థులు అమెరికా వర్సిటీల్లో చదువుకుంటున్నప్పుడు లేదా ఆ తర్వాత తమ ప్రధాన సబ్జెక్టుకు సంబంధించిన ఉద్యోగాల్లో పనిచేయడానికి అవకాశం లభిస్తుంది.
సాధారణంగా విదేశీ విద్యార్థులు అమెరికాలో పట్టభద్రులైన తర్వాత ఒక సంవత్సరం పాటు పని చేయడానికి అర్హులు. కొన్ని సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణిత శాస్త్ర ప్రధాన కోర్సులు చదివిన వారు అదనంగా మరో రెండు సంవత్సరాలకు అర్హులు. నూతన ప్రతిపాదన ప్రకారం.. ప్రతి కొత్త విద్యార్థి తొలి దరఖాస్తు కోసం విద్యాసంస్థలు 70,000 డాలర్లు, ప్రతి పునరుద్ధరణకు 30,000 డాలర్ల రుసుమును అమెరికా ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంటుంది. విదేశీ విద్యార్థులను చేర్చుకోకుండా అమెరికా వర్సిటీలను నిరుత్సాహపర్చాలన్నదే ట్రంప్ ప్రభుత్వ ప్రయత్నంగా కనిపిస్తోంది. ట్యూషన్ ఫీజు ఆదాయం కోసం విదేశీ విద్యార్థులను భారీగా చేర్చుకునే అమెరికా వర్సిటీలకు ఇది ఒక ఎదురుదెబ్బ అవుతుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ విద్యార్థుల రాకపై కఠినంగా వ్యవహరిస్తున్నారు.


