అమెరికాలో డెల్టా దందా

Delta Variant Now Makes Up 51 Percent Of COVID19 Cases In US - Sakshi

సగానికి పైగా కేసులు డెల్టా వేరియంట్‌వేనంటున్న గణాంకాలు

హూస్టన్‌: అమెరికాలో కరోనా వైరస్‌ డెల్టా వేరియంట్‌ ఆధిపత్యం చూపుతోంది. నమోదవుతున్న కేసుల్లో 51.7 శాతం కేసులు ఈ వేరియంట్‌వేనని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ) తెలిపింది. కరోనా వేరియంట్లలో వేగవంతమైన ఈ వేరియంట్, ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించింది. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లోనైతే దాదాపు 80 శాతం కేసులకు డెల్టా వేరియంటే కారణమవుతోంది. ఒకప్పుడు దేశంలో ఎక్కువగా కనిపించిన ఆల్ఫా వేరియంట్‌ ప్రస్తుతం 28.7 శాతం కేసులకు కారణమవుతోందని సీడీసీ గణాంకాలు వెల్లడించాయి.

టీకా ఎందుకు అని ఎవరైనా అడిగితే డెల్టా వేరియంట్‌ వ్యాప్తి పెరగడమే కారణమని చెప్పవచ్చని అమెరికా ఆరోగ్య నిపుణుడు డాక్టర్‌ ఫౌచీ వ్యాఖ్యానించారు. ఇది కేవలం వేగంగా వ్యాప్తి చెందడమే కాకుండా, ఎక్కువ ప్రభావాన్ని చూపగలదని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ఈవేరియంట్‌ ఆధిపత్యం మరింతగా కొనసాగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు టీకా రెండో డోసు తీసుకున్న తర్వాత కూడా కరోనా సోకుతున్న కేసులు కనిపిస్తున్నాయని, కానీ వీటి సంఖ్య తక్కువేనని ఆరోగ్య నిపుణులు తెలిపారు.  

వ్యాక్సినేషనే శరణ్యం 
దేశంలోని 12– 15 సంవత్సరాల పిల్లల్లో ఐదుగురిలో ఒకరు టీకా తీసుకున్నట్లు సీడీసీ తెలిపింది. అదే 16–17 సంవత్సరాల యువతలో ముగ్గురిలో ఒకరు టీకా తీసుకున్నారు. డెల్టా వేరియంట్‌ కారణంగా కేసులు పెరగడంపై అధికారులు ఆందోళన చెందుతున్నారు. దీన్ని తట్టుకోవాలంటే ఎక్కువమందికి టీకా ఇవ్వడమే మార్గమని డాక్టర్లు చెబుతున్నారు.

వేరియంట్‌ రూపుమార్చుకొని మరింత వేగంగా వ్యాపించే సామర్ధ్యం పెంచుకుంటున్నప్పుడు, దాన్ని అడ్డుకునేందుకు సమాజంలో టీకా తీసుకున్న వారి సంఖ్యను పెంచుకుంటూ పోవడమే మార్గమని డాక్టర్‌ డేవిడ్‌ పెర్సీ చెప్పారు. కొందరు డాక్టర్లు పిల్లలు సైతం మాస్కు ధరించడం మంచిదని సూచిస్తున్నారు. ఇప్పటివరకు టీకా తీసుకోని వారు డెల్టా బారిన పడే ప్రమాదం ఉందని డాక్టర్‌ పీటర్‌ హెచ్చరించారు. డెల్టా వేరియంట్‌ నుంచి సైతం రక్షణ ఇచ్చేలా ప్రస్తుత వ్యాక్సిన్లున్నాయని, కానీ అధిక శాతం జనాభా ఇంకా టీకా తీసుకోకపోవడం వల్ల రిస్కు పెరుగుతోందని వైరాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. స్పైక్‌ ప్రోటీన్‌లో ఉత్పరివర్తనంతో డెల్టా వేరియంట్‌ ఆవిర్భవించింది. ఇది గత వేరియంట్ల కన్నా ఎక్కువ ప్రభావవంతంగా ఆరోగ్యంగా ఉన్న మానవ కణాల్లోకి చొచ్చుకుపోయే శక్తిని పొందింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top