China Protests: తిరగబడ్డ చైనా.. మితిమీరిన ఆంక్షలపై కన్నెర్రజేసిన జనం..

Covid Protests Flare Across China Clashes In Shanghai - Sakshi

బీజింగ్‌: చైనా తిరగబడింది. కరోనా కట్టడి పేరుతో జిన్‌పింగ్‌ సర్కారు విధించిన మితిమీరిన ఆంక్షలపై జనం కన్నెర్రజేశారు. దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ వీధుల్లోకి వెల్లువెత్తుతూ నిరసనలకు దిగుతున్నారు. స్వేచ్ఛ కావాలంటూ నింగినంటేలా నినదిస్తున్నారు. పాలక కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా (సీపీసీ)కి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిస్తున్నారు. అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తక్షణం తప్పుకోవాలంటూ ముక్త కంఠంతో డిమాండ్‌ చేస్తున్నారు! చిన్నపాటి నిరసనలను కూడా ఉక్కుపాదంతో అణచేసే డ్రాగన్‌ దేశంలో అత్యంత అరుదుగా కనిపించే ఈ మూకుమ్మడి జనాగ్రహ జ్వాలలను ప్రపంచమంతా అబ్బురపాటుతో వీక్షిస్తోంది.

జనాందోళనలకు సంబంధించిన వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. వాటితో సోషల్‌ సైట్లన్నీ హోరెత్తుతున్నాయి. పలుచోట్ల యువతీ యువకులు నేరుగా పోలీసులతోనే బాహాబాహీ తలపడుతున్నారు! దేశవ్యాప్తంగా యూనివర్సిటీల క్యాంపస్‌లన్నీ నిరసన కేంద్రాలుగా మారుతున్నాయి. స్టూడెంట్లు కూడా భారీగా రోడ్లెక్కుతున్నారు. సోషల్‌ డిస్టెన్సింగ్‌ కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లు తదితర అడ్డంకులన్నింటినీ బద్దలు కొడుతూ కదం తొక్కుతున్నారు.

నిరసనకారులను పెద్ద సంఖ్యలో అరెస్టు చేస్తున్నా ఆందోళనలు నెమ్మదించడం లేదు. మతిలేని లాక్‌డౌన్‌ నిబంధనలను ఎత్తేయాలన్న డిమాండ్‌ దేశమంతటా ప్రతిధ్వనిస్తోంది. నిరసనల ధాటికి పలుచోట్ల ప్రభుత్వమే వెనక్కు తగ్గుతుండటం విశేషం! జిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌ రాజధాని ఉరుంఖిలో కఠిన లాక్‌డౌన్‌ ఆంక్షల వల్ల ఫ్లాట్లలో బందీలుగా మారిన వారిలో పది మంది అమాయకులు అగ్నిప్రమాదానికి నిస్సహాయంగా బలయ్యారన్న వార్తలు అగ్నికి మరింత ఆజ్యం పోస్తున్నాయి!

దీనిపై వెల్లువెత్తిన జనాగ్రహానికి వెరచి ఉరుంఖిలోనే గాక రాజధాని బీజింగ్‌తో పాటు పలుచోట్ల లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించాల్సి వచ్చింది!! జీరో కోవిడ్‌ విధానంపై జనం నుంచి ఇంతటి ప్రతిఘటన ఎదురవుతుందని ప్రభుత్వం ఊహించలేదని పరిశీలకులు భావిస్తున్నారు. ఇటీవలే పార్టీ నియమావళిని సవరించి మరీ వరుసగా మూడోసారి అధ్యక్షునిగా ఎన్నికైన జిన్‌పింగ్‌కు ఈ ఉదంతం అగ్నిపరీక్షగా మారింది. మరోవైపు కరోనా కల్లోలం కూడా చైనాలో నానాటికీ పెరుగుతూనే వస్తోంది. ఆదివారం 40 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి!!  

మార్మోగుతున్న షాంఘై 
కరోనా నేపథ్యంలో మూడేళ్లుగా ఏదో ఒక రూపంలో చైనాలో ఆంక్షలు కొనసాగుతూనే వస్తున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొద్ది రోజులుగా మళ్లీ జీరో కొవిడ్‌ విధానం అమలవుతోంది. దీనిపై కొంతకాలంగా జనంలో పెల్లుబుకుతున్న వ్యతిరేకత రెండు రోజులుగా కట్టలు తెంచుకుంటోంది. అతి పెద్ద నగరమైన షాంఘై ఆందోళనలతో అట్టుడుకుతోంది. ప్రజలు భారీ సంఖ్యలో రోడ్లపైకొచ్చి నిరసన ప్రదర్శనలకు దిగారు. సీపీసీకి, జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వం మారాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

‘‘షాంఘైలో ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలను కల్లో కూడా ఊహించలేం! అలాంటిది ఇంత భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి రావడం, అధ్యక్షుడు దిగిపోవాలంటూ బాహాటంగా నినాదాలు చేయడం నమ్మశక్యంగా లేదు. ఇది మా జీవితకాలంలో ఎన్నడూ చూడనిది’’ అంటూ స్వయానా నిరసనకారులే ఆశ్చర్యానందాలకు లోనవుతున్నారు. బీజింగ్‌లోని ప్రతిష్టాత్మక సిన్‌గువా యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలతో అట్టుడుకుతోంది. ప్రభుత్వ సెన్సార్షిప్‌కుకు వ్యతిరేకంగా తెల్ల కాగితాలను ప్రదర్శిస్తూ ప్రతీకాత్మకంగా నిరసన తెలుపుతున్నారు. మరోవైపు ఉరుంఖిలో వారం రోజులుగా జరుగుతున్న ఆందోళనల్లో కమ్యూనిస్టు ప్రభుత్వం చేతుల్లో ఏళ్లుగా తీవ్ర అణచివేతకు గురవుతున్న ఉయ్‌గర్‌ ముస్లింలు భారీగా పాల్గొంటున్నారు!

అపార్ట్‌మెంట్లో మరణమృదంగం 
కరోనా ఆంక్షలున్న చోట్ల ఇళ్లలోంచి జనం బయటికి రాకుండా అధికారులు బయటినుంచి తాళాలు వేసి సీల్‌ చేస్తున్నారు! ఈ చర్య జిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌ రాజధాని ఉరుంఖిలో పది మంది ఉసురు తీసింది. గురువారం ఓ అపార్ట్‌మెంట్లో అగ్నిప్రమాదం సంభవించడంతో ఫ్లాట్లలో ఉన్న పది మంది ఎటూ తప్పించుకోలేక పొగకు ఉక్కిరిబిక్కిరై నిస్సహాయంగా చనిపోయారు.

దీనిపై జనం తీవ్రంగా ఆగ్రహించారు. వేలాదిగా వీధులకెక్కి ప్రదర్శనలకు దిగారు. తీవ్ర పదజాలంతో ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. దాంతో ఆంక్షలను అధికారులు కాస్త సడలించారు. మితిమీరిన ఆంక్షలే వారి ఉసురు తీశాయన్న ఆరోపణలను ప్రభుత్వం ఖండించినా స్థానిక అధికారులు మాత్రం ఈ ఘటనకు క్షమాపణ చెప్పడం విశేషం! నెలల తరబడి కొనసాగుతున్న లాక్‌డౌన్‌తో ఇళ్లకు పరిమితం కావాల్సి రావడంతో పిచ్చెక్కిపోతోందని జనం వాపోతున్నారు.
చదవండి: Ju Ae: కిమ్‌ వారసురాలు ఆమే?

మరిన్ని వార్తలు :

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top