అమెరికాలో రికార్డుస్థాయి మరణాలు

COVID-19: US logs more than 3900 Covid deaths in new 24-hour record - Sakshi

24 గంటల్లో 3,936 మంది మృతి 

కొత్తగా 2,54,019

కరోనా పాజిటివ్‌ కేసులు  

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా విలయ తాండవం కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 3,936 మంది కరోనా బాధితులు కన్నుమూశారని జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ వెల్లడించింది. దేశంలో ఒక్కరోజులోనే ఈ స్థాయిలో కరోనా సంబంధిత మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. అలాగే కొత్తగా 2,54,019 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో అమెరికాలో ఇప్పటివరకు మొత్తం మరణాలు 3,66,662కు, పాజిటివ్‌ కేసులు 2.16కోట్లకుపైగా చేరుకున్నాయి. ప్రస్తుతం 1,31,000 మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అమెరికాలో నవంబర్‌ నెలాఖరు తర్వాత కోవిడ్‌–10 ఉధృతి భారీగా పెరిగింది. వరుసగా సెలవులు రావడం, జనం పెద్ద యెత్తున గుంపులుగా చేరుతుండడమే ఇందుకు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

జర్మనీలో 31 దాకా లాక్‌డౌన్‌
కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా జర్మనీలో అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించేందుకు చాన్స్‌లర్‌ యాంజెలా మెర్కెల్‌ అంగీకరించారు. అలాగే జన సంచారంపై మరికొన్ని కఠిన ఆంక్షలు విధించనున్నట్లు ఆమె తెలిపారు. కరోనా ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. జర్మనీలో కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతుండడంతో లాక్‌డౌన్‌ను పొడిగించడం మినహా మరో గత్యంతరం లేదని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దేశంలో ఇప్పటివరకు 37,744 కరోనా మరణాలు నమోదయ్యాయి. జర్మనీలో 8.3 కోట్ల జనాభా ఉండగా, సోమవారం నాటికి 2.65 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చారు. దేశంలో గత ఏడాది నవంబర్‌ 2 నుంచి పాక్షిక లాక్‌డౌన్, డిసెంబర్‌ 16 నుంచి కఠినమైన లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. ముందే నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది జనవరి 10న లాక్‌డౌన్‌ ముగించాల్సి ఉండగా పొడిగించారు.   

బ్రిటన్‌లో 62 వేల కేసులు
లండన్‌: గత ఏప్రిల్‌ తర్వాత తొలిసారి బుధవారం బ్రిటన్‌లో కోవిడ్‌ కారక రోజూవారీ మరణాల సంఖ్య 1000దాటింది. బుధవారం కరోనాతో 1041 మరణాలు సంభవించాయని హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రకటించింది. ఇలా రోజూ వేయి దాటడం పదోసారి. బుధవారం 62322 కేసులు నమోదయినట్లు గణాంకాలు తెలిపాయి. ఒకపక్క దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధించి, మరోపక్క వ్యాక్సినేషన్‌ ఆరంభించినా కరోనా కలకలం ఆగకపోవడం ఆందోళన సృష్టిస్తోంది. అయితే యూరప్‌తో పోలిస్తే ఇంగ్లండ్‌లో ఎక్కువమందికి టీకా అందిందని ప్రధాని జాన్సన్‌ చెప్పారు. ప్రతిపక్షాలు లాక్‌డౌన్‌ నిర్ణయాన్ని విమర్శిస్తున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తప్పవని జాన్సన్‌ చెప్పారు. లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తివేస్తామన్నారు. వ్యాక్సినేషన్‌ విజయవంతంగా కొనసాగితే లాక్‌డౌన్‌ ఎత్తివేయడం సాధ్యమవుతుందన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top