హమ్మయ్య.. గండం తప్పింది

Chinese rocket debris lands in Indian Ocean - Sakshi

హిందూ మహా సముద్రంలో పడిన చైనా రాకెట్‌ శకలాలు

బీజింగ్‌: ప్రపంచవ్యాప్తంగా తీవ్ర భయాందోళనకు గురిచేసిన చైనా లాంగ్‌మార్చ్‌ 5బీ రాకెట్‌ శకలాల కథ సుఖాంతమయ్యింది. ఈ శకలాలు ఆదివారం హిందూ మహా సముద్రంలో మాల్దీవుల సమీపంలో కూలిపోయాయి. శకలాలన్నీ సురక్షితంగా సాగర గర్భంలోకి చేరడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. ఈ విషయాన్ని అంతరిక్ష సంస్థ అధికారికంగా ప్రకటించింది. చైనా స్థానిక కాలమానం ప్రకారం.. లాంగ్‌మార్చ్‌ రాకెట్‌ శకలాలు ఆదివారం ఉదయం 10.24 గంటలకు భూవాతావరణంలోకి ప్రవేశించాయి. 72.47 డిగ్రీల తూర్పు రేఖాంశం(లాంగీట్యూడ్‌), 2.65 డిగ్రీల ఉత్తర అక్షాంశం(లాటీట్యూడ్‌) వద్ద సముద్రంలో కూలిపోయినట్లు చైనా స్పేస్‌ ఇంజనీరింగ్‌ ఆఫీస్‌ వెల్లడించింది. చాలా శకలాలు భూవాతావరణంలో మండిపోయి, నీళ్లల్లో కూలాయి.

ఇక రిలాక్స్‌ కావొచ్చు
చైనా రాకెట్‌ శకలాల కథ సుఖాంతం కావడాన్ని నాసా కూడా ధ్రువీకరించింది. లాంగ్‌మార్చ్‌ 5బీ పునరాగమనాన్ని ఉత్కంఠతో పరిశీలిస్తున్నవారంతా ఇక రిలాక్స్‌ కావొచ్చని, రాకెట్‌ సముద్రంలో కూలిపోయిందని స్పష్టం చేసింది. ఈ గండం నుంచి చైనా ఇప్పటికిప్పుడు గట్టెక్కింది గానీ దాని నిర్లక్ష్యం మాత్రం వీడడం లేదని హార్వర్డ్‌ వర్సిటీకి చెందిన ఆస్ట్రోఫిజిసిస్ట్‌ జోనాథన్‌ మెక్‌డొవెల్‌ తప్పుపట్టారు.  చైనా ప్రభుత్వం తియాన్‌గాంగ్‌ పేరిట అంతరిక్ష కేంద్ర నిర్మాణాన్ని తలపెట్టింది. ఇందులో భాగంగా ఏప్రిల్‌ 29న హైనన్‌ ప్రావిన్స్‌లోని వెన్‌చాంగ్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ లాంచ్‌ సైట్‌ నుంచి లాంగ్‌మార్చ్‌ 5బీ (సీజెడ్‌–5బీ) రాకెట్‌ను ప్రయోగించింది.

అంతరిక్ష కేంద్రానికి అవసరమైన కీలక భాగాన్ని (కోర్‌ మా డ్యుల్‌) ఈ రాకెట్‌ మోసుకెళ్లింది. అయితే, మా డ్యుల్‌ను విజయవంతంగా రోదసీలో ప్రవేశపెట్టాక నియంత్రణ కోల్పోయింది. అంతరిక్షంలోనే పేలి పోయింది. దాని శకలాలు మళ్లీ భూమి పైకి దూసుకొచ్చాయి. అవి ఎక్కడ పడతాయన్న దాని పై భిన్న వాదనలు వినిపించాయి. ఒక దశలో ఇం డియా రాజధాని ఢిల్లీని ఢీకొట్టడం ఖాయమన్న పుకార్లు కూడా వినిపించాయి. చివరకు సముద్రంలో కూలిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాకెట్‌ శకలాలకు సంబంధించి బాధ్యతాయుతమైన ప్రమాణాలను పాటించడంలో చైనా విఫలమైందని అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ ప్రతినిధి బిల్‌ నెల్సన్‌ విమర్శించారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top