
చంద్రధూళి నుంచి నీరు, ఆక్సిజన్‌ను సృష్టించిన చైనా శాస్త్రవేత్తలు
కీలక వనరుల కొరతకు వినూత్న సాంకేతికతతో చెక్‌పెడుతున్న చైనా
చంద్రునిపై స్థిరనివాస కలలను సాకారంచేసే దిశలో ప్రయోగ ఫలితాలు
చిన్నతనంలో గోరు ముద్దలు తినిపించేందుకు అమ్మ చందమామను చూపిస్తుంది. అన్నం తినేందుకు పరోక్షంగా అక్కరకొచ్చే చందమామ మన శాశ్వత స్థిరనివాసానికి ఆమోదయోగ్యంగా లేదని ఇన్నాళ్లూ అంతా భావించారు. భూమి మాదిరి అక్కడ వాతావరణం, గాలి, నీరు వంటివేమీ అక్కడ లేకపోవడమే ఇందుకు ప్రధానకారణం. జీవన మనుగడకు కీలకమైన ఆక్సిజన్, నీటి కొరతల సమస్యను తీర్చేలా చంద్రుని మట్టి నుంచే ఆ రెండింటినీ తయారుచేసి చూపి చైనా శాస్త్రవేత్తలు మానవాళి చంద్రునిపై స్థిరనివాస కలలకు కొత్త రెక్కలు తొడిగారు.
నీటి తయారీకి పనికొచ్చే కీలక మూలకాలు చంద్రుని మట్టిలో పుష్కలంగా ఉన్నాయని చైనా శాస్త్రవేత్తలు తాజాగా ప్రకటించారు. చాంగ్–ఈ–5 మిషన్ ద్వారా తీసుకొచి్చన చంద్రశిలలు, చంద్రుని మట్టిని సమగ్ర స్థాయిలో విశ్లేíÙంచడం ద్వారా చంద్రునిపైనే ఉదజని, జీవజలం పునర్‌సృష్టి సాధ్యమని చైనా శాస్త్రవేత్తలు వెల్లడించారు. కొత్త సాంకేతికత సాయంతో చంద్రుని నేల నుంచి నీరు, ఆక్సిజన్‌ను తయారుచేసి చూపడం విశేషం. సంబంధిత పరిశోధనా తాలూకు వివరాలు సెల్ ప్రెస్ వారి ‘జూలీ’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
లీటర్ నీటికి రూ.19 లక్షలు !!
అంతరిక్ష పరిశోధనలో భాగంగా వ్యోమగాములు భవిష్యత్తులో చంద్రునిపై ఎక్కువ కాలం గడపాల్సి రావొచ్చు.ఆ సమయంలో ఆక్సిజన్, నీరువంటి ప్రాణాధార వ్యవస్థలను అక్కడ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. భూమి మీద నుంచి వ్యోమనౌక ద్వారా వందల లీటర్ల నీటిని, భారీ స్థాయిలో ఆక్సిజన్ సిలిండర్లను తరలించడం ఎంతో శ్రమతో, అంతకుమించిన ఖర్చుతో కూడిన వ్యవహారం.
కేవలం 3.785 లీటర్ల( ఒక గ్యాలన్) నీటిని భూమి మీద నుంచి చంద్రుడి వద్దకు వ్యోమనౌకలో చేర్చాలంటే కనీసం రూ.72 లక్షలు ఖర్చు అవుతుంది. అంటే ఒక లీటర్ నీటిని ఇక్కడి నుంచి అక్కడికి పంపాలంటే అక్షరాలా పంతొమ్మిది లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంతటి వ్యయప్రయాసలకోర్చి పంపేకంటే అక్కడే నీటిని తయారుచేస్తే ఉత్తమం అన్న నిర్ణయానికొచ్చి ఆమేరకు చైనా శాస్త్రవేత్తలు కొత్త సాంకేతికతను విజయవంతంగా అభివృద్ధిచేశారు. చందమామ మట్టి నుంచి నీటిని సంగ్రహించి ఆ నీటి సాయంతో కార్భన్‌డయాక్సైడ్‌ను ఆక్సిజన్‌గా, ఇతర ఇంధన సంబంధిత రసాయనాలుగా మార్చే సాంకేతికతను చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు.
ఏమిటీ టెక్నాలజీ?
ఈ టెక్నాలజీ సాయంతో చంద్రుని మట్టి నుంచి నీటిని సంగ్రహించవచ్చు. ప్రయోగాల కోసం అక్కడే ఉన్న వ్యోమగామని ఉచ్చా్వస నుంచి వెలువడిన కార్భన్‌డయాక్సడ్‌ను ఇదే నీటి సాయంతో కార్భన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ వాయువుగా మార్చొచ్చు. ఇలా అందుబాటులోకి వచి్చన కార్భన్‌మోనాక్సైడ్, హైడ్రోజన్ ఇంధనం, ఆక్సీజన్ తయారీ కోసం ఉపయోగించుకోవచ్చు. ఇలా తయారైన ఆక్సిజన్‌ను మళ్లీ అక్కడి వ్యోమగాముల కోసం సిలిండర్‌లలో భద్రపరుస్తారు.
ఈ టెక్నాలజీ పనిచేయడానికి అవసరమయ్యే వేడిని తీక్షణమైన సూర్యరశ్మి నుంచి సంగ్రహించనున్నారు. టైటానియం ఐరన్ ఆక్సైడ్ ధాతువులున్న చంద్రుని ‘ఇన్మెనైట్’ మట్టితో నీటిని సృష్టించడం సాధ్యమేనని శాస్త్రవేత్తలు చెప్పారు. ల్యాబ్‌లో సూక్ష్మస్థాయిలో నీటిని, ఆక్సిజన్‌ను సృష్టించగలిగామని, చంద్రునిపై వ్యోమగామలు నిరంతరం శ్వాసించి, ఉపయోగించుకునే స్థాయిలో ఆక్సిజన్ తయారీకి మరికొంత కాలం ఆగకతప్పదని పరిశోధకులు తెలిపారు. ఆ రోజు కోసం మేం కూడా ఎదురుచూస్తున్నామని వారు వ్యాఖ్యానించారు.
– సాక్షి, నేషనల్ డెస్క్