అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చైనా షాకిచ్చింది. గాజా పునర్నిర్మాణం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం కోసం ట్రంప్ ప్రతిపాదించిన "బోర్డ్ ఆఫ్ పీస్"లో చేరేందుకు చైనా నిరాకరించింది. ఐక్యరాజ్యసమితికి సంబంధం లేని ఏ వ్యవస్ధలోనూ చేరే ఉద్దేశం తమకు లేదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్ స్పష్టం చేశారు.
"ప్రపంచ పరిస్థితులు ఎలా మారినా చైనా మాత్రం ఐరాస చట్టాలకు, అంతర్జాతీయ నిబంధనలకే కట్టుబడి ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు. ఈ 'బోర్డ్ ఆఫ్ పీస్' ఐక్యరాజ్యసమితికి ప్రత్యామ్నాయంగా మార్చాలనే వ్యూహంతో ట్రంప్ ముందుకెళ్తున్నారు. అయితే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న చైనా.. ట్రంప్ శాంతి మండలి విజయవంతమైతే తమకు ప్రాధాన్యత తగ్గిపోతుందని భయపడుతోంది. ఈ క్రమంలోనే ట్రంప్ ఆహ్వానాన్ని చైనా తిరస్కరించింది.
కాగా ట్రంప్ శాంతి మండలికి యూరప్ నుంచి కూడా ఊహించని వ్యతిరేకత ఎదురవుతోంది. ఇప్పటికే ఫ్రాన్స్, నార్వే, స్వీడన్ వంటి దేశాలు ట్రంప్ శాంతి మండలిలో చేరబోమని స్పష్టం చేశాయి. తాజాగా ఇటలీ కూడా తమ దేశ రాజ్యాంగ నిబంధనలకు విరుద్దంగా ఈ మండలిలో చేరలేమని స్పష్టం చేసింది.
ప్రస్తుతానికి 20 దేశాలు ఈ మండలిలో చేరేందుకు అంగీకరించినట్లు అమెరికా ప్రకటించింది. ఇజ్రాయోల్ కూడా ఈ బోర్డ్ ఆఫ్ పీస్ చేరింది. తొలుత టర్కీ, ఖతార్ వంటి దేశాలకు చోటు కల్పించడంపై అభ్యంతరాలు ఇజ్రాయోల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ట్రంప్ పంపిన ఆహ్వానాన్ని గౌరవిస్తూ ఈ పీస్ బోర్డులో చేరాలని ఇజ్రాయోల్ ప్రధాని నెతన్యాహు నిర్ణయించుకున్నారు.
ఈ బోర్డులో భాగస్వామి కావడానికి పాకిస్తాన్ కూడా సుముఖత వ్యక్తం చేసింది. అయితే భారత్‌కు కూడా ఈ శాంతి మండలిలో చేరాలని ఆహ్వానం అందింది. కానీ దీనిపై భారత ప్రభుత్వం ఇంకా ఎటువంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదు.


