
బీజింగ్: చైనాలో అభివృద్ధి చేయబడుతున్న నాలుగు కరోనావైరస్ వ్యాక్సిన్లు నవంబర్ నాటికి సాధారణ ప్రజలకు అందుబాటులోకి వస్తాయని, చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అధికారి ఒకరు తెలిపారు.చైనా నాలుగు వ్యాక్సిన్‌లు క్లినికల్ ట్రయల్స్ చివరి దశలో ఉన్నాయని వెల్లడించారు. వీటిలో మూడింటిని ఇప్పటికే అత్యవసర సేవలు అందిస్తున్న వారికి ఇచ్చామని తెలిపారు. వారికి జూలై నెలలోనే ఈ వ్యాక్సిన్ ఇచ్చినట్లు వెల్లడించారు. మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ సజావుగా సాగుతున్నాయని, ఇవి నవంబర్ లేదా డిసెంబర్‌లో సాధారణ ప్రజలకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఏప్రిల్‌లో స్వయంగా తానే ప్రయోగాత్మక వ్యాక్సిన్ తీసుకున్నానని ఒక అధికారి తెలిపారు.
తరువాత తనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని ఆమె పేర్కొన్నారు. దీని గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు. ఔషధ దిగ్గజం చైనా నేషనల్ ఫార్మాస్యూటికల్ గ్రూప్ (సినోఫార్మ్), యూఎస్ కాన్సినో బయోలాజిక్స్ 6185 చే అభివృద్ధి చేయబడుతున్న నాల్గవ కోవిడ్-19 వ్యాక్సిన్‌ను చైనా సైన్యం ఉపయోగించడానికి జూన్ నెలలో ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ ముగిసిన తరువాత 2020 చివరి నాటి ఈ వ్యాక్సిన్‌ను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని సినోఫార్మ్ జూలైలోనే ప్రకటించింది. చైనాలో పుట్టిన వైరస్ కారణంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో వ్యాక్సిన్ కోసం యావత్ ప్రపంచం సమాయత్తమయ్యింది. ఈ వైరస్ నిర్మూలనలో భాగంగా వ్యాక్సిన్‌ను కనిపెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే రష్యా ఒక వ్యాక్సిన్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.