కరోనా పుట్టిల్లు వూహాన్‌ ప్రయోగశాలే

Covid virus developed in Wuhan lab - Sakshi

శాస్త్రీయ ఆధారాలున్నాయని వెల్లడించిన హాంకాంగ్‌ సైంటిస్ట్‌

లండన్‌: ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోన్న కరోనా వైరస్‌ పుట్టింది వూహాన్‌లోని ప్రభుత్వ ప్రయోగశాలలోనేనని చైనాకి చెందిన వైరాలజిస్టు సంచలన విషయాన్ని బయటపెట్టారు. దీనికి తన వద్ద శాస్త్రీయ ఆధారాలున్నాయని ఆమె వెల్లడించారు. బ్రిటిష్‌ టాక్‌ షో ‘లూస్‌ వుమన్‌’ఎక్స్‌క్లూజివ్‌ కార్యక్రమంలో డాక్టర్‌ లి–మెంగ్‌ యాన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

వూహాన్‌లో కొత్తగా న్యూమోనియా ప్రబలడంపై విచారించాల్సిందిగా తనని ప్రభుత్వం కోరిందనీ, ఆ విచారణలో భాగంగా ఈ వైరస్‌ను దాచిపెట్టడానికి జరిగిన ప్రయత్నాలు తన దృష్టికి వచ్చినట్లు ఆమె వెల్లడించారు. ఈమె హాంకాంగ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌లో వైరాలజీ, ఇమ్యునాలజీలో శాస్త్రవేత్త. డిసెంబర్‌– జనవరిలో తొలిసారి, జనవరి మధ్యలో మరోమారు డాక్టర్‌ లీ –మెంగ్‌ చైనాలో న్యూమోనియాపై రెండు పరిశోధనలు చేశారు.

తరువాత ఆమె హాంకాంగ్‌ నుంచి అమెరికా పారిపోయారు. తన సూపర్‌వైజర్‌ అయిన డబ్ల్యూహెచ్‌వో కన్సల్టెంట్‌తో ఈ విషయం చెప్పాలని భావించాననీ, కానీ ఆయన నుంచి ఎటువంటి స్పందన లేదని ఆమె తెలిపారు. తన పరిధి దాటి వ్యవహరించడం సరికాదని, లేదంటే తాను అదృశ్యమవడం ఖాయమని, అంతా తనను హెచ్చరించినట్టు ఆమె వెల్లడించారు.

కరోనా వైరస్‌ ప్రకృతి నుంచి రాలేదని, చైనాలో మనిషి నుంచి మనిషికి కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిందని, ఈ వైరస్‌ తన రూపాన్ని మార్చుకుంటుందని, మహమ్మారిగా విస్తరిస్తుందని, అయితే చైనా కమ్యూనిస్టు పార్టీ ఈ విషయాన్ని బాహ్యప్రపంచానికి తెలియకుండా దాచిందని డాక్టర్‌ లీ–మెంగ్‌ తెలిపారు. కొందరు సైంటిస్టులతో కలిసి, దీనిపై రిపోర్టు తయారుచేస్తున్నామని, మొదటి రిపోర్టు విడుదలకు సిద్ధంగా ఉందని ఆమె స్పష్టం చేశారు. ప్రపంచానికి నిజం చెప్పకపోతే తానెంతో విచారించాల్సి ఉంటుందన్నారు. న్యూయార్క్‌ కేంద్రంగా పనిచేసే ఒక ఫౌండేషన్, తాను హాంకాంగ్‌ వదిలి వెళ్ళడానికి సహకరించినట్టు, ఈ ఫౌండేషన్‌ చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేవారికి సహాయం చేస్తుందని ఆమె తెలిపారు.

48 లక్షలు దాటిన కేసులు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ ఆగడం లేదు. గత 24 గంటల్లో 92,071 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 48,46,427 కు చేరుకుంది. ఇటీవల రోజుకు 90 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల్లో 1,136 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 79,722కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 37,80,107 కు చేరుకోగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 9,86,598 గా ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు ప్రస్తుతం  78 శాతానికి పెరిగినట్లు తెలిపింది. మరణాల రేటు 1.64 శాతానికి పడింది. సెప్టెంబర్‌ 13 వరకు 5,72,39,428 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top