Sakshi News home page

ఫ్లైట్‌మోడ్‌లో ఫోన్‌.. విమానాల్లో ఇంటర్నెట్‌ ఎలా?

Published Mon, Jul 10 2023 2:58 AM

Chances to provide internet through WiFi in airplanes - Sakshi

ఏదైనా ఊరెళ్తున్నాం.. బస్సులోనో, రైల్లోనో అయితే వెంటనే స్మార్ట్‌ఫోన్‌ బయటికి తీయడం, ఏ సినిమాలో, వెబ్‌ సిరీస్‌లో చూడటం, సోషల్‌ మీడియాలో కాలక్షేపం చేయడం కనిపించేదే. అదే మరి విమానాల్లో అయితే..!? టవర్‌ సిగ్నల్స్‌ ఉండవు. ఉన్నా ఫోన్‌ను ఫ్లైట్‌ మోడ్‌లో పెట్టాల్సిందే. దీంతో ఫోన్‌ మెమరీలో ఉన్న వీడియోలు చూస్తూనో, పాటలు వింటూనో గడిపేయాల్సిందే. గంటా గంటన్నర జర్నీ అయితే ఓకేగానీ.. ఆరేడు గంటలకుపైన ప్రయాణించాల్సి వస్తే కష్టమే. అదే విమానాల్లో వైఫై ఉంటే కాసింత కాలక్షేపం. 

రెండు రకాలుగా ఇంటర్నెట్‌ 
విమానాల్లో వైఫై ద్వారా ఇంటర్నెట్‌ ఇచ్చేందుకు రెండు రకాల అవకాశాలు ఉన్నాయి. ఒకటేమో ఇప్పుడు మనం స్మార్ట్‌ఫోన్లలో వాడుతున్నట్టుగా టెలికాం టవర్ల నుంచి సిగ్నల్‌ అందుకోవడం. రెండోది శాటిలైట్ల ద్వారా ఇంటర్నెట్‌కు అనుసంధానం కావడం. 

శాటిలైట్‌కు అనుసంధానమై ఇంటర్నెట్‌ పొందే విమానాలకు పైభాగంలో యాంటెన్నాలు ఉంటాయి. ఈ ఇంటర్నెట్‌కు సిగ్నల్‌ సమస్యేదీ ఉండదు. కానీ అందుబాటు తక్కువ. ఖర్చు చాలా ఎక్కువ. 

♦ టెలికం సిగ్నల్స్‌ నుంచి ఇంటర్నెట్‌ పొందే విమానాలకు దిగువ భాగంలో యాంటెన్నాలు ఉంటాయి. భూమ్మీద ఉన్న టెలికాం టవర్ల నుంచి సిగ్నల్స్‌ అందుకుంటూ ఇంటర్నెట్‌ వాడుతారు. అయితే ఇలాంటి వాటిలో అడవులు, ఎడారులు, సముద్రాల మీదుగా ప్రయాణించిన సమయంలో సిగ్నల్స్‌ ఉండవు. 

♦ దాదాపు అన్ని దేశాలు యుద్ధ విమానాలు, ప్రత్యేక విమానాల్లో మాత్రం శాటిలైట్‌ కనెక్షన్‌ను వినియోగిస్తున్నాయి. 

చాలా విమానాల్లో ఇంటర్నెట్‌.. బాగా స్లో 
ప్రస్తుతం విమానాల్లో కొంతవరకు వైఫై సదుపాయం ఉన్నా.. దాని వేగం అత్యంత తక్కువ. ఎందుకంటే చాలా వరకు ప్రయాణికుల విమానాల్లో టెలికాం టవర్లకు అనుసంధానమయ్యే పరికరాలే ఉంటున్నాయి. వీటి నుంచి వచ్చే కాస్త ఇంటర్నెట్‌ స్పీడ్‌నే వైఫై ద్వారా అందిస్తున్నారు. విమానంలోని వారంతా ఆ స్పీడ్‌నే పంచుకోవాల్సి ఉంటుంది. దీనితో ఇంటర్నెట్‌ బాగా స్లోగా వస్తుంది. 

విమానాల్లో ఇంటర్నెట్‌ కోసం ప్రత్యేకంగా.. 
విమానాల్లో ఇంటర్నెట్‌ కోసమంటూ ఇటీవలే ప్రత్యేక సంస్థలు తెరపైకి వస్తున్నాయి. అందులో ‘గోగో కమర్షియల్‌ ఏవియేషన్‌’ ఒకటి. ఇది ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్‌ సేవలు అందించే ఇంటెల్‌శాట్‌ కంపెనీకి అనుబంధ సంస్థ. అత్యంత అధునాతనమైన ‘2కేయూ వ్యవస్థ’తో విమానాల్లో వేగవంతమైన ఇంటర్నెట్‌ను అందిస్తోంది. 

♦ ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌కు చెందిన శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సంస్థ ‘స్టార్‌ లింక్‌’ కూడా.. సముద్రాలు, ఎడారులు, ధ్రువ ప్రాంతాలు అనే తేడా లేకుండా భూమ్మీద అన్నిచోట్లా వేగవంతమైన ఇంటర్నెట్‌ అందిస్తామంటూ తెరపైకి వచ్చింది. 

ఇలాంటి శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సంస్థలు రావడం, ఆ ఇంటర్నెట్‌కు అయ్యే వ్యయం కూడా తగ్గుతుండటంతో విమానయాన సంస్థలు తమ అంతర్జాతీయ, దేశీయ విమానాల్లో వైఫై­ను అందించేందుకు ముందుకు వస్తున్నాయి.  
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌

Advertisement
Advertisement