British PM Boris Johnson: Judge Taliban on Actions Not Words - Sakshi
Sakshi News home page

Afghanistan: తాలిబన్ల రాజ్యం.. బ్రిటన్‌ ప్రధాని కీలక వ్యాఖ్యలు

Published Wed, Aug 18 2021 4:46 PM

British PM Boris Johnson Says Judge Taliban On Actions Not Words - Sakshi

Judge Taliban on Actions Not Words: ‘‘ఉగ్రవాదం, నార్కొటిక్స్‌, నేరాల పట్ల తాలిబన్ల విధానం.. మానవత్వం, మహిళా విద్య- హక్కులకై వారు చేపట్టే చర్యలు... కేవలం మాటలకే పరిమితం కాకుండా.. ఆచరణలోకి వచ్చిన రోజే తాలిబన్ల పాలనను జడ్జ్‌ చేయాలి. అంతేగానీ వారి మాటలు నమ్మి ముందే ఒక నిశ్చిత అభిప్రాయానికి రావడం తొందరపాటు చర్యే అవుతుంది’’ అని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ అన్నారు. అఫ్గనిస్తాన్‌ను తాలిబన్లు ఆధీనంలోకి తీసుకున్న నేపథ్యంలో పార్లమెంటులో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. 

కాగా రాజధాని కాబూల్‌ సహా ప్రధాన పట్టణాలన్నింటినీ ఆక్రమించిన తాలిబన్లు అఫ్గన్‌నిస్తాన్‌ను తమ గుప్పిట్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరాన్‌, సౌదీ అరేబియా, ఇతర ఇస్లామిక్‌ దేశాలు వ్యూహాత్మక సమదూరం పాటిస్తుండగా.. చైనా, పాకిస్తాన్‌ తాలిబన్లతో సత్సంబంధాలు ఏర్పరచుకునేందుకు సిద్ధమని ప్రకటించాయి. అయితే, జర్మనీ వంటి యూరోపియన్‌ దేశాలు మాత్రం అఫ్గనిస్తాన్‌ అభివృద్ధి కోసం అందిస్తున్న సాయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ తాలిబన్లకు షాకిచ్చాయి.

ఈ క్రమంలో బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ బుధవారం పార్లమెంటులో మాట్లాడుతూ... ‘‘ అఫ్గనిస్తాన్‌ మెరుగైన భవిష్యత్తుకై కలిసి పనిచేయాలనుకుంటున్న దేశాలు తొలుత కొత్త పాలన ఎలా ఉండబోతుందో ఒక అంచనాకు వచ్చిన తర్వాతే వారి అధికారాన్ని గుర్తించే ప్రయత్నం చేయాలి. మారిపోయామని వారు చెబుతున్న మాటలు.. ఆచరణలో ఏవిధంగా ఉంటాయో గమనించి అప్పుడే వారి పాలనను జడ్జ్‌ చేయాలి. అలా కాకుండా.. ముందే ద్వైపాక్షిక బంధాలు ఏర్పరచుకోవడం నిజంగా తొందరపాటు చర్యే అవుతుంది ’’ అని పేర్కొన్నారు.  

అదే విధంగా ఇటీవలి కాలంలో సుమారు 2 వేల మంది అఫ్గన్లు దేశం విడిచి వెళ్లేందుకు బ్రిటన్‌ సాయం చేసిందన్న బోరిస్‌.. రిసెటిల్‌మెంట్‌ ప్రోగ్రాం ద్వారా ఇప్పటి వరకు 306 మంది బ్రిటీష్‌ పౌరులు, 2052 మంది అఫ్గన్‌ పౌరులను సురక్షితంగా తీసుకువచ్చామని తెలిపారు. బ్రిటన్‌లో ఆశ్రయం కోరుతున్న మరో 2 వేల మంది అఫ్గన్ల దరఖాస్తుల ప్రాసెసింగ్‌ పూర్తైందని, మరికొంత మందికి కూడా ఈ వెసలుబాటు కల్పించనున్నామని పార్లమెంటుకు తెలిపారు. 

చదవండి: Afghanistan: తొలి మహిళా గవర్నర్‌ను బంధించిన తాలిబన్లు!
Afghanistan: తాలిబన్లకు మరో షాక్‌! సాయం నిలిపివేత

Advertisement
Advertisement