20 ఏళ్లు వెదికినా తగిన జోడీ దొరకలేదని..

Bride Searched for her mr Right for 20 Years now Married Herself - Sakshi

బ్రిటన్‌కు చెందిన సారా విల్కిన్‌సన్ (42) అనే మహిళ  సరైన భాగస్వామి కోసం 20 ఏళ్లుగా వెదుకుతూనే ఉంది. అయినా ప్రయోజనం లేకపోవడంతో, ఇక మరోమార్గం లేదని ఒక నిర్ణయానికి వచ్చేసింది. 

ఇంగ్లండ్‌లోని ఫెలిక్స్‌స్టో నివాసి సారా ఇటీవల హార్వెస్ట్ హౌస్‌లో తనను తానే పెళ్లి చేసుకుంది. ఈ వివాహ వేడుక కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసింది. చిన్నప్పటి నుంచి పెళ్లిలో డైమండ్ రింగ్ ధరించాలని కలలుగనేదానినని, ఆ కలను ఇప్పుడు నెరవేర్చుకున్నానని సారా మీడియాకు తెలిపింది. 

బ్రిటిష్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం సారా వివాహం ముఖ్యాంశాలలో నిలిచింది. అయితే అధికారికంగా ఈ పెళ్లికి గుర్తింపు దక్కలేదు. సారా తన వివాహానికి ఘనమైన ఏర్పాట్లు చేసింది. అద్భుతమైన వివాహ వేదికను సిద్ధం చేసుకుంది. గ్రాండ్‌ వెడ్డింగ్‌ల మాదిరిగానే డెకరేషన్‌ నుంచి ఫుడ్‌, డ్రింక్స్‌ వరకు అన్ని ఏర్పాట్లు ఘనంగా చేసినట్లు సారా తెలిపింది. ఈ పెళ్లి వేడుకకు రూ.10 లక్షలు ఖర్చు చేసింది. తన పెళ్లి ఖర్చుల కోసం సారా చాలా ఏళ్లుగా పొదుపు చేస్తూ, డబ్బులు దాచింది. ఈ వివాహానికి సారా విల్కిన్సన్ సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. సారా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం తమకు ఆశ్చర్యం కలిగించిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. 

సారా స్నేహితురాలు,ప్రొఫెషనల్ వెడ్డింగ్ ప్లానర్ కేథరీన్ క్రెస్‌వెల్ ఈ వేడుకను నిర్వహించారు. సారా పెళ్లి వేడుకలో స్నేహితులమంతా కలుసుకోవడం ఆనందంగా ఉందని కేథరీన్ చెప్పింది. కాగా సారా తనను తాను వివాహం చేసుకున్నప్పటికీ, తనకు సరైన జోడీ దొరికే వరకూ వెదుకుతూనే ఉంటానని తెలిపింది.
ఇది కూడా చదవండి: నకిలీ న్యాయవాది విజయగాథ.. 26 కేసులు గెలిచి..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top