
‘హెచ్1బీ’ ఫీజు పెంపుపై వైట్‌హౌస్ అధికారి: న్యూయార్క్ టైమ్స్
వారు వెంటనే తిరిగి రావాల్సిన పనిలేదని అమెరికా ఉన్నతాధికారి
చెప్పినట్లు ఏఎన్‌ఐ వార్తాసంస్థ వెల్లడి
న్యూయార్క్/వాషింగ్టన్: హెచ్1బీ వీసాల వార్షిక రుసుము పెంపుపై సర్వత్రా గగ్గోలు రేగిన నేపథ్యంలో ఈ పెంపు కేవలం కొత్త హెచ్1బీ దరఖాస్తుదారులకే వర్తిస్తుందని ‘వైట్‌హౌస్’ అధికారి ఒకరు తెలిపినట్లు ‘న్యూయార్క్ టైమ్స్’ శనివారం పేర్కొంది. ‘హెచ్1బీ ఫీజు పెంపునకు చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఆ సవాళ్లను అధిగమిస్తే అంతర్జాతీయ వృత్తి నిపుణులను తీసుకొనే కంపెనీలు ఒక్కో ఉద్యోగిపై ఏటా లక్ష డాలర్ల ఫీజు చొప్పున ఆరేళ్లపాటు చెల్లించాల్సి వస్తుంది.
అయితే ఈ ఫీజు కేవలం కొత్త హెచ్1బీ దరఖాస్తుదారులకే వర్తిస్తుంది’ అని ‘వైట్‌హౌస్’ ఉన్నతాధికారి పేర్కొన్నట్లు ‘న్యూయార్క్ టైమ్స్’ కథనం ప్రచురించింది. మరోవైపు స్వదేశాలకు వెళ్లిన ప్రస్తుత హెచ్1బీ వీసాదారులు నిర్దేశిత గడువులోగా హడావుడిగా తిరిగి అమెరికా చేరుకోవాల్సిన అవసరం లేదని అమెరికా ఉన్నతాధికారి ఒకరు చెప్పినట్లు ఏఎన్‌ఐ వార్తాసంస్థ పేర్కొంది.