టెహ్రాన్: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ ఇరాన్ రాజధాని టెహ్రాన్ తీవ్ర ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఇక్కడి ప్రసిద్ధ ఇస్లామిక్ ప్రార్థనా స్థలం ‘గ్రాండ్ మొసల్లా' కాంప్లెక్స్ లక్షలాది మంది ఇరానీయులతో కిక్కిరిసిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త వైమానిక దాడిలో ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు మరణించారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, అలజడి కారణంగా దాదాపు నాలుగు నెలల ఆలస్యం తర్వాత ఇరాన్ ప్రభుత్వం ఇప్పుడు వారం రోజుల పాటు సాగే ఈ భారీ అంత్యక్రియల ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది.
ఈ అంత్యక్రియల ప్రార్థనలు కేవలం శోకసంద్రంగానే కాకుండా, ఇజ్రాయెల్, అమెరికాలపై ప్రతీకారం తీర్చుకోవాలనే నినాదాలతో హోరెత్తాయి. ప్రార్థనా మందిరంలో చేరిన లక్షలాది మంది ప్రజలు ఇరాన్ జాతీయ జెండాలతో పాటు, ప్రతీకారానికి చిహ్నమైన ఎరుపు రంగు జెండాలను ప్రదర్శించారు. ఖమేనీ మృతికి కారణమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులను అంతమొందించాలంటూ పెద్ద ఎత్తున ప్లకార్డులు, పోస్టర్లు, గ్రాఫిటీలను ప్రదర్శించారు.
అమెరికా నశించాలి,ఇజ్రాయెల్ నశించాలి అనే నినాదాల మధ్య.. ఇరాన్ మిలటరీ త్రివిధ దళాధిపతులు, అగ్రశ్రేణి రాజకీయ నాయకులు బహిరంగంగా హాజరయ్యారు. ట్రంప్‌ను చంపడం మా బాధ్యత అంత్యక్రియల వేళ లౌడ్‌స్పీకర్లలో ఈవెంట్‌ను నడిపిస్తున్న మొహమ్మద్ రసౌలి అనే కవి మాట్లాడుతూ..ఇకపై శవాల కఫనే మా వస్త్రం. ఖమేనీ రక్తం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం.. ట్రంప్‌ను హతమార్చడం ఇకపై మా బాధ్యత’అని పిలుపునివ్వడంతో లీడర్లు, ప్రజలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు.
ఈ ఉద్రిక్తతల మధ్య అర్మేనియాలో ఇరాన్ రాయబారి ఖలీల్ షిర్‌ఘోలామి ఎక్స్ వేదికగా స్పందిస్తూ అమెరికా, ఇజ్రాయెల్‌లపై తీవ్ర విమర్శలు చేశారు. ‘మీరు మనుషులను చంపగలరు కానీ వారి ఆదర్శాలను చంపలేరు. మీరు అయతుల్లా ఖమేనీని చంపడం ద్వారా ఒక అత్తరు సీసాను పగులగొట్టారు. ఇప్పుడు దాని సువాసన (ఆదర్శం) అంతటా వ్యాపించింది. నాగరికత, చరిత్ర, గౌరవం లేని మీకు ఇది ఎప్పటికీ అర్థం కాదు’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరాన్‌లోని వరుస పరిణామాలు అంతర్జాతీయంగా చర్చాంశనీయమయ్యాయి.


