బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తత
హదీ అంత్యక్రియల తర్వాత పార్లమెంట్‌వైపు దూసుకొచ్చిన జనం
లాఠీచార్జి చేసి చెదరగొట్టిన పోలీసులు
హదీ జ్ఞాపకాలు సజీవం అంటూ నివాళులర్పించిన మహ్మద్ యూనస్
ఢాకా: ‘ఇంక్విలాబ్ మంచ్’నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత వేలాది మంది జనం బంగ్లాదేశ్ పార్లమెంట్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శనివారం పార్లమెంట్ వైపు ర్యాలీగా దూసుకొస్తున్న ప్రజలను పోలీసులు అడ్డుకున్నారు. లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
అతికష్టంమీద పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అంతకుముందు పార్లమెంట్ ప్రాంగణంలో హదీ మృతదేహం వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్, ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ, జమాత్ –ఇ–ఇస్లామీ, నేషనల్ సిటిజెన్ పార్టీ నేతలు, కార్యకర్తలు సహా వేలాది మంది జనం తరలివచ్చారు.
‘ఢిల్లీ లేదా ఢాకా.. ఢాకా, ఢాకా’, ‘హదీ రక్తం వృథా కావడానికి వీల్లేదు’అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బంగ్లాదేశ్ ఉనికి ఉన్నంతవరకూ హదీ జ్ఞాపకాలు ప్రజల హృదయాల్లో ఉంటాయని మహ్మద్ యూ నస్ నివాళులర్పించారు. హదీ అంత్యక్రియల సందర్భంగా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. హదీ మృతదేహాన్ని చూడడానికి సామాన్య ప్రజలకు అనుమతి ఇవ్వలేదు. దేశవ్యాప్తంగా శనివారం సంతాప దినంగా పాటించారు.
ఈ నెల 12వ తేదీన ఎన్నికల ప్రచారం కోసం వెళ్తున్న హదీపై దుండగులు కాల్పులు జరిపారు. పరిస్థితి విషమించడంతో సింగపూర్ కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. ఈ వార్త తెలిసిన వెంటనే బంగ్లాదేశ్‌లో జనం ఆందోళనకు దిగారు. గురువా రం రాత్రి పెద్ద ఎత్తున హింసాకాండ చోటుచేసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులపై, పత్రికా కార్యాలయాలపై దాడులు జరిగాయి. అల్లరిమూక దాడిలో హిందూ కార్మికుడు దీపూచంద్ర దాస్ మృతిచెందాడు. శుక్రవారం కల్లా పరిస్థితి అదుపులోకి వచ్చింది. శనివారం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని అధికారులు వెల్లడించారు.
జాతీయ కవి సమాధి పక్కనే..
షరీఫ్ ఉస్మాన్ హదీ మృతదేహాన్ని పార్ల మెంట్ నుంచి ఢాకా యూనివర్సిటీ క్యాంపస్‌కు తరలించారు. క్యాంపస్ మసీదు సమీపంలో బంగ్లాదేశ్ జాతీయ కవి కాజీ నజ్రుల్ ఇస్లామ్ సమాధి పక్కనే ఖననం చేశారు. 1976లో నజ్రుల్ ఇస్లామ్‌ను ఇక్కడ సమాధి చేశారు. ఆయన తిరుగుబాటు కవిగానూ పేరుగాంచారు. హింస, విద్వేషాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. తన కవితలతో ప్రజలను చైతన్యవంతులను చేశారు. నజ్రుల్ ఇస్లామ్ కవితలను హదీ తన ప్రసంగాల్లో తరచుగా ప్రస్తావిస్తూ ఉండేవారు.
దీపూచంద్ర హత్య కేసులో పది మంది అరెస్టు
బంగ్లాదేశ్‌లో హదీ హత్య నేపథ్యంలో హిందూ కారి్మకుడు దీపూచంద్ర దాస్(25)ను కొట్టి చంపిన కేసులో పది మంది నిందితులను పోలీసులు అరెస్టుచేశారు. గురువారం అల్లరి మూక దీపూచంద్రను దారుణంగా కొట్టి చంపి, దహనం చేసిన సంగతి తెలిసిందే.


