Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు? | Asaduddin Owaisi Strong Counter To Bilawal Bhutto Pak Leaders | Sakshi
Sakshi News home page

Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?

Apr 28 2025 5:20 PM | Updated on Apr 28 2025 6:27 PM

Asaduddin Owaisi Strong Counter To Bilawal Bhutto Pak Leaders

న్యూఢిల్లీ: సింధు జలాల నదీ ఒప్పందం నిలిపివేత నేపథ్యంతో భారత్‌ను ఉద్దేశించి పలువురు పాక్‌ నేతలు అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. వారిలో బిలావల్‌ భుట్టో జర్దారీ  చేసిన వ్యాఖ్యలకు ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ(Asaduddin Owaisi) స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చారు. నీ తాత, తల్లిని చంపిందెవరో ఒక్కసారి గుర్తు తెచ్చుకో అంటూ బిలావల్‌ను ఉద్దేశించి ప్రశ్న సంధించారాయన.

‘‘ఇవన్నీ పిల్ల మాటలు. అతని తాతకు ఏం జరిగిందో అతనికి తెలియదా? అతని తల్లిని ఉగ్రవాదులేగా చంపేశారు. కనీసం అది గుర్తున్నా? అతను అలా మాట్లాడి ఉండడు. అమెరికా సాయం చేస్తేనేగానీ ముందుకు నడవలేని దేశం పాకిస్తాన్‌. అలాంటిది మీరా మనల్ని చిన్నచూపు చూస్తోంది? అంటూ బిలావల్‌ను ఉద్దేశించి ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అతని తల్లిని చంపినప్పుడు అది ఉగ్రవాదం.. అదే మన అమ్మలను, బిడ్డలను చంపినప్పుడు అది ఉగ్రవాదం కాదా?. ఇది కూడా అర్థం చేసుకోలేనివాడికి మనం ఏం చెప్పినా వ్యర్థమే’’ అని ఒవైసీ వ్యాఖ్యానించారు.

పనిలో పనిగా పాక్‌ నేతలకూ ఆయన చురకలంటించారు. ‘‘ పాక్‌లో కూర్చుని అడ్డగోలుగా మాట్లాడొద్దు. పాక్ దేశ‌ మొత్తం బడ్జెట్‌.. మా దేశ రక్షణ బడ్జెట్‌ కంటే తక్కువే.మీరు ఏ దేశంలోకి చొరబడి అమాయకుల ప్రాణాలు తీస్తుంటే ఎవరూ మౌనంగా ఉండరు. మతం అడిగి మరీ చంపడం.. వికృతమైన పని. ఉగ్రవాదులు మరోసారి దాడి చేసే సాహసం చేయకుండా ప్రధాని మోదీ కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని ఒవైసీ అన్నారు.  

2007 డిసెంబర్‌ 30వ తేదీన రావల్పిండిలో జరిగిన ర్యాలీలో.. ఆత్మాహుతి దాడి జరిగి బెనజీర్‌ భుట్టోతో పాటు మరో 20 మంది బలయ్యారు. ఇక..పాక్‌ మాజీ అధ్యక్షుడు, ప్రధాని అయిన ఆమె తండ్రి జుల్ఫీకర్‌ అలీ భుట్టోను ఓ హత్య కేసుకుగానూ 1979 ఏప్రిల్‌ 4వ తేదీన ఉరి తీశారు. అయితే అది రాజకీయ ప్రేరేపిత కేసు అనే అభియోగాలు ఉన్నాయి. 

2023 దాకా విదేశాంగ మంత్రిగా పని చేసిన పీపీపీ నేత బిలావల్‌ భుట్టో.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కొనసాగుతున్నారు. ‘‘సింధూ నది మాదే. ఎప్పటికీ మాదే. నదిలో నీరైనా పారుతుంది లేదా వారి రక్తమైనా పారుతుంది. పాకిస్థాన్ గానీ అంతర్జాతీయ సమాజం కానీ ఈ యుద్ధ కాంక్షను అస్సలు సహించదు. వేల ఏళ్ల నాటి సింధూ నాగరికతకు తాము వారసులమని మోదీ అంటుంటారు. కానీ ఈ సంస్కృతికి పరిరక్షకులము మేమే. ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుంటాము’’ అంటూ ఓ ర్యాలీలో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను కేంద్ర మంత్రులు సహా భారత్‌లోని పలువురు నేతలు ఇప్పటికే ఖండించారు కూడా. 

Advertisement
 
Advertisement
Advertisement