ఢాకా: బంగ్లాదేశ్‌లోని నర్సింగడి జిల్లాలో శుక్రవారం రాత్రి అత్యంత అమానుష ఘటన చోటుచేసుకుంది. చంచల్ చంద్ర భౌమిక్ అనే 23 ఏళ్ల హిందూ యువకుడు తాను పనిచేసే గ్యారేజీలోనే దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని మసీదు మార్కెట్ ప్రాంతంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం దుండగులు బయటి నుంచి షాపు షట్టర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించారని, చంచల్ లోపలే చిక్కుకుని అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడని పోలీసులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, గంటసేపు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చి, అనంతరం మృతదేహాన్ని వెలికితీశారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. షాపు బయటి నుంచి ఒక వ్యక్తి నిప్పంటించి పారిపోతున్నట్లు కనిపిస్తున్న సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అయితే వాటిని ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఇది పథకం ప్రకారం చేసిన హత్యేనని చంచల్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చంచల్ తండ్రి గతంలోనే మరణించగా, అనారోగ్యంతో ఉన్న తల్లి, దివ్యాంగుడైన అన్నయ్య తమ్ముడికి ఆయనే ఏకైక దిక్కుగా ఉన్నాడు. అతనిని కిరాతకంగా హత్య చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సుమారు 17 కోట్ల జనాభా కలిగిన ముస్లిం మెజారిటీ దేశమైన బంగ్లాదేశ్‌లో 2024 రాజకీయ అస్థిరత తర్వాత పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. మైనారిటీలైన హిందువులు, సూఫీ ముస్లింలు మరియు ఇతరులపై దాడులు తీవ్రతరమయ్యాయి. ఫిబ్రవరిలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మతపరమైన హింస పెరుగుతుండటంపై ‘బంగ్లాదేశ్ హిందూ-బౌద్ధ-క్రిస్టియన్ ఐక్యతా మండలి’ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
బంగ్లాదేశ్‌లో మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న దాడుల పట్ల భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పరిస్థితులను తాము నిరంతరం గమనిస్తున్నామని భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ) స్పష్టం చేసింది. మైనారిటీలపై దాడులు ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి ఘటనలను వ్యక్తిగత కక్షలుగా చిత్రీకరించడం వల్ల తీవ్రవాద శక్తులు మరింత రెచ్చిపోతాయని ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ హెచ్చరించారు. అయితే, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్ మాత్రం భారత్ ఆరోపణలను అతిశయోక్తిగా అభివర్ణించడం గమనార్హం.


