
నేపిడా: మయన్మార్‌లోని లిన్ టా లు గ్రామంలోని ఒక బౌద్ధ ఆరామంపై మయన్మార్ సైన్యం వైమానిక దాడులకు తెగబడింది. ఈ ఘటనలో నలుగురు పిల్లలతో సహా 23 మంది పౌరులు మరణించారు. లిన్ టా లు గ్రామం దేశంలోని రెండవ అతిపెద్ద నగరమైన మండలేకు వాయువ్యంగా 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దాడి తెల్లవారుజామున జరిగినట్లు అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ)వెల్లడించింది.
ఈ ఘటనలో మొత్తం 23 మంది మరణించగా, దాదాపు 30 మంది గాయపడ్డారని ఏపీ తెలిపింది. గాయపడినవారిలో పది మంది పరిస్థితి విషమంగా ఉందని పేర్కొంది. కాగా స్వతంత్ర వార్తా సంస్థ డెమోక్రటిక్ వాయిస్ ఆఫ్ బర్మా ఈ ఘటనలో 30 వరకు మరణించి ఉండవచ్చని పేర్కొంది. మయన్మార్ సైన్యం ఈ ఘటనపై ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. జుంటా వ్యతిరేక ఘటనలకు కీలకంగా నిలిచిన సాగింగ్ ప్రాంతంలో సైనిక చర్యలు ముమ్మరమవుతున్నాయి. సైన్యం ఇటీవల ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున దాడులను ప్రారంభించింది.
స్థానిక తిరుగుబాటు గ్రూపుల నుండి ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ట్యాంకులు, యుద్ధ విమానాలను సైన్యం ఈ ప్రాంతంలో మోహరించింది. రాబోయే ఎన్నికలకు ముందు తన బలాన్ని ప్రదర్శించడానికే జుంటా ఇదంతా చేస్తోందనే ఆరోపణలున్నాయి. మయన్మార్‌లో సైనిక పాలనను జుంటా అని పిలుస్తారు. 2021 ఫిబ్రవరిలో ఆంగ్ సాన్ సూకీ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని గద్దె దించడం ద్వారా మయన్మార్ సైన్యం అధికారాన్ని చేపట్టింది. అప్పటి నుండి దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య మద్దతుదారులు, సైన్యం మధ్య వివాదం తీవ్రమైంది. ముఖ్యంగా సాగింగ్‌లో సైనిక నియంత్రణకు వ్యతిరేకంగా పౌరులు, స్థానిక మిలీషియా గ్రూపులు పోరాటాలు సాగిస్తున్నాయి.