ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. షార్క్ దాడిలో నికో ఆంటిక్ అనే 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. గత ఆదివారం నికో తన స్నేహితులతో కలిసి సిడ్నీలోని వాక్లూస్ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ రాళ్లపై నీటిలోకి దూకుతూ సరదాగా ఆడుతుండగా.. అకస్మాత్తుగా ఒక షార్క్ అతడిపై దాడి చేసింది.
వెంటనే ఆ పిల్లాడిని నీటిలో నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ దాడిలో నికో రెండు కాళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో నికో ఆంటిక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించాడు. ఈ విషయాన్ని బాలుడి కుటంబ సభ్యులు ధ్రువీకరించారు.
"మా కుమారుడు నికో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. చాలా ఉత్సాహంగా ఉండేవాడు. స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. అతడు మాతో గడిపిన క్షణాలను మేము ఎప్పటికీ గుర్తుంచుకుంటాం" అని నికో తల్లిదండ్రులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
గత రెండు రోజుల్లో నాలుగు షార్క్ దాడులు జరగడంతో సిడ్నీ సహా పలు తీరప్రాంతాల్లో చాలా వరకు బీచ్‌లను అధికారులు మూసివేశారు. భారీ వర్షాల వల్ల సముద్రపు నీరు మురికిగా మారడం వల్ల షార్క్‌లు తీరానికి ఎక్కువగా వస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


