సాక్షి, సిటీబ్యూరో: నాసిరకం ముడిసరుకుతో అల్లం–వెల్లుల్లి పేస్టు తయారు చేయడం... ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండటం కోసం రసాయనాలకు కలపడం... తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలకు సరఫరా చేసి విక్రయించడం... ఈ పంథాలో వ్యవస్థీకృతంగా దందా చేస్తున్న ముఠాకు మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. నలుగురు నిందితులను పట్టుకుని, వీరి నుంచి భారీ పరిమాణంలో నాసిరకం ముడిసరుకు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ ఎస్.రష్మి పెరుమాల్ బుధవారం వెల్లడించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనల ప్రకారం ఏ ఆహార పదార్థంలోనూ ప్రిజర్వేటివ్స్ వినియోగించకూడదని ఆమె పేర్కొన్నారు. గుజరాత్‌కు చెందిన రహీమ్ చారినియా బతుకుతెరువు కోసం నగరానికి వలసవచ్చి బేగంపేటలో స్థిరపడ్డాడు. డెక్కన్ ట్రేడర్స్ పేరుతో నిత్యావసర వస్తువులు వ్యాపారం చేస్తున్న ఇతను తేలిగ్గా డబ్బు సంపాదించాలని భావించాడు. నాసిరకం ముడిసరుకులతో అల్లం–వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకుగాను రాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పర్‌పల్లిలో ఓ కార్ఖానా ఏర్పాటు చేశాడు. మార్కెట్‌లో తక్కువ ధరకు లభించే నాసిరకం అల్లం, వెల్లుల్లి కొనుగోలు చేసి వాటిని ఉప్పర్‌పల్లిలోని కార్ఖానాలో ఏర్పాటు చేసిన మిషన్ ద్వారా పేస్టుగా మార్చి సిట్రిక్ యాసిడ్‌తో పాటు గుర్తుతెలియని పొడి కలుపుతూ ఆకర్షణీయమైన వాసన వచ్చేలా చేస్తున్నాడు. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండటం కోసం సిట్రిక్ యాసిడ్‌తో ఎర్రరంగు రసాయనాన్ని ప్రిజిర్వేటివ్‌గా కలుపుతున్నాడు. దీనిని ప్యాక్ చేసి బేగంపేటకు చెందిన పాండురంగారావు ద్వారా బేగంబజార్‌లో తెలంగాణ ఏజెన్సీ నిర్వహించే అజయ్ కుమార్ అఖీర్, నిఖిల్ ట్రేడర్స్ నిర్వాహకుడు ప్రదీప్ సంక్లాలకు సరఫరా చేస్తున్నాడు. వీరు ఈ అల్లం–వెల్లుల్లి పేస్ట్‌ను నగరంలోని దుకాణాలతో పాటు ఇతర జిల్లాలు, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లకు సరఫరా చేస్తున్నారు. కొన్నాళ్లుగా సాగుతున్న ఈ దందాపై సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది. ఇన్‌స్పెక్టర్ బి.రాజు నాయక్ నేతృత్వంలో ఎస్సైలు సీహెచ్ నవీన్‌కుమార్, ఎస్.సాయి కిరణ్ తమ బృందాలతో వలపన్నారు. పాటిగడ్డ వద్ద పాండురంగారావును పట్టుకున్నారు. ఇతడి విచారణలో పూర్తి వివరాలు వెలుగులోకి రావడంతో మిగిలిన ముగ్గురినీ అదుపులోకి తీసుకుని బేగంపేట పోలీసులకు అప్పగించారు. వీరి నుంచి 700 కేజీల అల్లం–వెల్లుల్లి పేస్ట్, 625 కేజీల అల్లం, 100 కేజీల వెల్లుల్లి, 20 కేజీల రసాయనాలు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రిజర్వేటివ్స్‌గా వాడుతున్న రసాయనాలకు గుర్తించడానికి నమూనాలకు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపనున్నారు. ఇలాంటి అల్లం–వెల్లుల్లి పేస్ట్ వాడటం ఆరోగ్యానికి హానికరం అని పోలీసులు పేర్కొన్నారు.
అల్లం, వెల్లుల్లి పేస్టు తయారీ
నిల్వ ఉండేందుకు రసాయనాల వినియోగం
ప్యాక్ చేసి ఇరుగు పొరుగు రాష్ట్రాలకూ సరఫరా
గుట్టురట్టు చేసిన సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ టీమ్