నిమజ్జనం.. మరింత వేగవంతం! | Sakshi
Sakshi News home page

నిమజ్జనం.. మరింత వేగవంతం!

Published Mon, Sep 25 2023 3:58 AM

- - Sakshi

హైదరాబాద్: గణేష్‌ నవరాత్రుల్లో అత్యంత కీలక ఘట్టం సామూహిక నిమజ్జనం. దీనికోసం పోలీసులు హుస్సేన్‌సాగర్‌ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు దాదాపు మధ్య మండలం మొత్తాన్నీ సాధారణ వాహనాలకు ‘నో ఎంట్రీ జోన్‌’గా మారుస్తారు. ఈ కారణంగానే ఈ క్రతువును వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో పోలీసులు అనేక ప్రయోగాలు చేస్తుంటారు. ఇందులో భాగంగా ఈ ఏడాది మరో టెక్నిక్‌ను అమలులోకి తెస్తున్నారు. విగ్రహం ఉంచే ప్లాట్‌ఫామ్‌ కింద ఖాళీ ప్లాస్టిక్‌ డ్రమ్ములు ఏర్పాటు చేస్తున్నారు. నగర కొత్వాల్‌ సీవీ ఆనంద్‌, మధ్యమండల డీసీపీ ఎం.వెంకటేశ్వర్లుతో పాటు ఇతర ఉన్నతాధికారులు దీన్ని శనివారం రాత్రి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

పడేసే పని ఉండదు...
మండపాల నిర్వాహకులు గణేష్‌ విగ్రహాలను వాహనాల్లో హుస్సేన్‌సాగర్‌ వద్దకు తీసుకువస్తారు. అక్కడ నిమజ్జనం కోసం సిద్ధం చేసి ఉంచిన క్రేన్ల ప్లాట్‌ఫామ్‌ పైకి వీటిని ఎక్కిస్తారు. సాగర్‌ నీటి ఉపరితలం వద్దకు చేరిన తర్వాత ఆ ప్లాట్‌ఫామ్‌పై ఉండే సిబ్బంది విగ్రహాన్ని నీళ్లల్లోకి తోస్తారు. కొన్ని సందర్భాల్లో విగ్రహం ప్లాట్‌ఫామ్‌ వైర్‌కు పట్టుకోవడం, దాన్ని తప్పించి నీళ్లల్లో వేయడం జరుగుతుంటుంది. దీనికి పరిష్కారంగా నగర పోలీసులు గడిచిన ఆరేళ్ల నుంచి ప్రత్యేకంగా డిజైన్‌ చేయించిన హుక్‌ను వాడుతున్నారు. ఈసారి దానికంటే వేగంగా నిమజ్జనం పూర్తి చేయడానికి మరో కొత్త విధానం అవలంబించనున్నారు.

ప్లాట్‌ఫామ్‌కు కింద ప్లాస్టిక్‌ డ్రమ్స్‌...
ఈ విధానంలో భాగంగా విగ్రహాలను ఉంచే ప్లాట్‌ఫామ్‌కు కింది వైపు ఓ పక్కన ఒకటి లేదా రెండు ప్లాస్టిక్‌ డ్రమ్ములను ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి ఏర్పాటు ఉన్న ప్లాట్‌ఫామ్‌పై ఉన్న విగ్రహాన్ని నీటి ఉపరితలం వద్దకు తీసుకువెళ్లిన తర్వాత ప్రత్యేకంగా నీటిలోకి వేయాల్సిన అవసరం ఉండదు. క్రేన్‌ ఆపరేటర్‌ ప్లాట్‌ఫామ్‌ను కిందికి దించితే సరిపోతుంది. ఽఖాళీ డ్రమ్ము ఉన్న భాగం పైకి ఉండిపోయి.. మరోవైపు కిందికి వెళ్తుంది. ఫలితంగా ప్లాట్‌ఫామ్‌ పైన ఉన్న విగ్రహం ఆ వైపునకు పడిపోతుంది. ఈ విధానంగా నిమజ్జనం ఎవరి ప్రమేయం లేకుండా సాధారణ సమయం కంటే నాలుగు నుంచి ఆరు నిమిషాల ముందే ముగుస్తుంది.

ట్యాంక్‌బండ్‌ వద్ద ఏర్పాట్ల పరిశీలన...
​​​​​​​
ట్యాంక్‌బండ్‌ ఆధునికీకరణకు అనేక చర్యలు తీసుకున్న ప్రభుత్వం సర్వాంగ సుందరంగా తీర్చిదింది. దీంతో ఈ ఏడాది దానిపై అవసరమైన సంఖ్యలోనే క్రేన్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా ఎక్కువ ఎత్తు లేకుండా మధ్యస్తంగా ఉన్న వాటినే నిమజ్జనం చేయనున్నారు. ఎన్టీఆర్‌ మార్గ్‌, పీవీ నరసింహారావు మార్గ్‌ల్లో గతం కంటే ఎక్కువ క్రేన్లు ఉండనున్నాయి. వీటి ద్వారానే పెద్ద విగ్రహాల నిమజ్జనం జరుగుతుంది. సాగర్‌ చుట్టూ ఉండే అన్ని క్రేన్ల ప్లాట్‌ఫామ్‌లకు ఖాళీ డ్రమ్ములు ఏర్పాటు చేయనున్నారు. సామూహిక నిమజ్జనం సమీపిస్తుండటంతో అక్కడి ఏర్పాట్లను నగర కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు, క్రేన్ల ఏర్పాటు, ట్రాఫిక్‌ మళ్లింపులకు తీసుకుంటున్న చర్యల్లో అనేక మార్పులు చేర్పులను సూచించారు.

Advertisement
 
Advertisement