నాలా.. ఎన్నాళ్లు ఇలా? | - | Sakshi
Sakshi News home page

నాలా.. ఎన్నాళ్లు ఇలా?

May 13 2023 12:02 PM | Updated on May 13 2023 12:46 PM

- - Sakshi

హైదరాబాద్: ఏళ్లు గడుస్తున్నాయి కానీ వ్యూహాత్మక నాలా అభివృద్ధి (ఎస్‌ఎన్‌డీపీ) పనులు మాత్రం పూర్తి కావడం లేదు. ఎప్పటికప్పుడు పనుల పూర్తి గడువును పెంచుతూ పోతున్న అధికారులు తాజాగా వర్షాకాలం ప్రారంభానికి ముందే ఈ పనులు పూర్తిచేస్తామంటున్నారు. కానీవాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. 2020 అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు పలు లోతట్టుప్రాంతాలు నీటమునిగాయి. దాదాపు 40 వేల కుటుంబాలు కొద్దిరోజులపాటు వాన నీటిలోనే బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. ఇందుకు కారణం నాలాలనుంచి వరదనీరు సాఫీగా వెళ్లకపోవడం...నాలాలపై ఆక్రమణలు కారణమని గుర్తించి ఈ పరిస్థితి నివారణకు వరదనీరు సాఫీగా వెళ్లేలా నాలాలను ఆధునీకరించాలని నిర్ణయించారు. ఆ పనుల కోసమే ప్రత్యేకంగా ఎస్‌ఎన్‌డీపీ విభాగాన్ని ఏర్పాటు చేశారు.

రెండేళ్లు గడిచిపోయినా..
గ్రేటర్‌ నగరం, శివారు ప్రాంతాల్లో వెరసి వరద వెళ్లేందుకు ప్రధానంగా 473 కి.మీ.ల మేర నాలాలున్నాయి. వరద సమస్యలు అరికట్టేందుకు వీటిల్లో 78 కి.మీ.ల మేర నాలాలను ఆధునీకరించినా మొత్తం నాలా నెట్‌వర్క్‌లో 45 శాతం మేర సమస్యలు తీరడంతోపాటు లోతట్టు ప్రాంతాల ముంపు సమస్యలు సగం తగ్గుతాయని అంచనా వేశారు. ఆమేరకు ఎస్‌ఎన్‌డీపీ ఫేజ్‌–1 కింద జీహెచ్‌ఎంసీ, శివారు ప్రాంతాల్లో వెరసి రూ.985.45 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. 2021 వర్షాకాలం నాటికే పనులు పూర్తిచేయాలని భావించినప్పటికీ చేయలేకపోయారు. అన్నీ కాదు కదా ఏ ఒక్కటీ చేయలేకపోయారు. పనులు త్వరితంగా చేసేందుకని జోన్ల వారీగా ముగ్గురు చీఫ్‌ ఇంజినీర్లకు పర్యవేక్షణ బాధ్యతలప్పగించారు. ఆ సంవత్సరం అలా గడిచిపోగా, 2022 వేసవిలోగా పనులు పూర్తిచేస్తామన్నారు. కాకపోవడంతో డిసెంబర్‌ నాటికి పూర్తిచేయగలమన్నారు. ఎలాగోలా రెండు పనులు మాత్రం పూర్తిచేశారు. మిగతావి ఈ సంవత్సరం మార్చిలోగా పూర్తిచేస్తామన్నారు. ఎప్పటికప్పుడు 60 శాతానికి పైగా పూర్తయ్యాయని, మిగిలింది కొద్దిపనులే నని చెబుతున్నప్పటికీ ఎప్పటికీ పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. పూర్తిచేస్తామంటున్న ఇంజినీర్లు

ఇంజినీర్లు మాత్రం పనులు పూర్తికాకపోయినా..అన్నీ దాదాపు తుదిదశలోనే ఉన్నాయని, వర్షాకాలంలోగా పూర్తిచేస్తామని చెబుతున్నారు.అంతేకాదు.. ఫేజ్‌–1 పూర్తికావచ్చినందున ఫేజ్‌–2కు సైతం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. వాటి అంచనా వ్యయం జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ. 2141.22 కోట్లు కాగా, శివారుల్లో రూ.2993.93 కోట్లని పేర్కొన్నారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కు
అధికారులు పూర్తిచేస్తామంటున్నప్పటికీ, పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదని ఆయా ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. ఇటీవల కురిసిన ఒకటి రెండు వర్షాలకే నల్లకుంట, రామ్‌నగర్‌, పద్మాకాలనీ, నాగమయ్యకుంట, తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇంట్లోని సామాగ్రితోపాటు కార్లు, బైక్‌లు నీటమునిగి మరమ్మతులకు గురయ్యాయి. వర్షానికి కొట్టుకు వచ్చిన టన్నులకొద్దీ పూడిక, ప్లాస్టిక్‌వ్యర్థాలు, తదితరమైన వాటితో నడిచే దారి లేకుండా పోయింది. పనుల ప్రాంతాల్లోని తాత్కాలిక రిటైనింగ్‌వాల్స్‌ సైతం వర్షం ధాటికి దెబ్బతిని కాలనీలు నీట మునుగుతున్నాయి. పద్మాకాలనీలో స్థానికుల డిమాండ్‌ మేరకు నాలా అలైన్‌మెంట్‌ మార్చాల్సి వచ్చినందున పనుల్లో ఆలస్యమైందని అధికారులు పేర్కొన్నారు.

40 శాతం కూడా పూర్తికాని పనులు
శివార్లు కాకుండా జీహెచ్‌ఎంసీ పరిధిలో చేపట్టిన మొత్తం పనులు 36 కాగా, వాటిల్లో 14 మాత్రమే పూర్తయ్యాయి. మిగతావి పూర్తికాలేదు. జోన్ల వారీగా వివరాలిలా ఉన్నాయి.

జోన్‌ మొత్తం పూర్తయినవి పనులు

సికింద్రాబాద్‌ 8 3

కూకట్‌పల్లి 3 2

ఎల్‌బీనగర్‌ 9 3

చార్మినార్‌ 7 4

ఖైరతాబాద్‌ 7 0

శేరిలింగంపల్లి 2 2

మొత్తం 36 14

ఈ లెక్కన చూసినా 40 శాతం పనులు కూడా పూర్తికాలేదు. వీటిల్లో శేరిలింగంపల్లి జోన్‌లో నూరు శాతం పూర్తికాగా, ఖైరతాబాద్‌ జోన్‌లో ఒక్కటీ పూర్తికాకపోవడం గుర్తించవచ్చు. శివారు ప్రాంతాల్లోని పనులు ఇంతకంటే తక్కువగా జరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement