నకిలీ ఫ్రాంచైజీ ముఠా అరెస్ట్‌

 వివరాలు వెల్లడిస్తున్న సైబరాబాద్‌ సీపీ స్టీపెన్‌ రవీంద్ర   - Sakshi

గచ్చిబౌలి: ఫ్రాంచైజీలు, డీలర్‌ షిప్‌లు ఇప్పిస్తామని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు. గురువారం సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాలకు చెందిన కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి నకిలీ వెబ్‌ సైట్లు సృష్టించి ఫ్రాంచైజీలు, డీలర్‌ షిప్‌లు ఇప్పిస్తామని ఫేస్‌బుక్‌, గూగుల్‌, యూ ట్యూబ్‌లలో ప్రకటనలు ఇస్తున్నారు. ఈ క్రమంలో బాచుపల్లికి చెందిన వ్యక్తి కేఎఫ్‌సీ ఫ్రాంచైజీ కోసం వెబ్‌ సైట్లో సంప్రదించాడు. ఫ్రాంచైజీ, అగ్రిమెంట్‌, ఎన్‌ఓసీ ఫీజులు, ఇంటీరియర్‌, మౌలిక వసతుల పేరిట అతడి నుంచి రూ.94.95 లక్షలు వసూలు చేశారు. నెలలు గడిచినా ఫ్రాంచైజీ విషయమై ఎవరూ స్పందించకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నోయిడా కేంద్రంగా ఈ దందా నడుస్తున్నట్లు గుర్తించారు. రాకేష్‌ కుమార్‌ అలియాస్‌ ఆదిత్య సింగ్‌, మహ్మద్‌ ఖాలీద్‌, యోగేందర కుమార్‌, పంకజ్‌ సరస్వత్‌, సరిత, రోషిని సింగ్‌ గౌతమ్‌లు ముఠాగా ఏర్పడి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వీరు 28 నకిలీ వెబ్‌ సైట్లు సృష్టించి మోసాలకు పాల్పడినట్లు తెలిపారు. ఆరుగురు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి 7 సెల్‌ ఫోన్లు, 3 ల్యాప్‌టాప్‌లు, 5 సీపీయూలు, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌, చెక్‌ బుక్‌లు, డెబిట్‌, సిమ్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో సైబరాబాద్‌ క్రైమ్స్‌ డీసీపీ కల్మేశ్వర్‌, సైబర్‌క్రైమ్‌ ఏసీపీ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top