కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల జాతీయస్థాయి ఈడబ్ల్యూ ఇండియా హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్‌లో ప్రభుత్వ కళాశాలల (అటానమస్) విభాగంలో 2026–27 సంవత్సరానికి 23వ స్థానం సాధించింది. ఓవరాల్ స్కోర్ 700కు గాను 462 స్కోర్ సాధించి ప్రతిష్టాత్మక కళాశాలగా గుర్తింపు పొందిందని ఆకళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జ్యోతి గురువారం తెలిపారు. ఈకాలేజీ 2023లో 23వ స్థానం, 2024లో 23, 2025లో 25, మళ్లీ 2026–27లో తిరిగి 23వ స్థానాన్ని దక్కించుకుంది. ఈమేరకు గురువారం వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం, ఓఎస్డీ వెంకట్రాంరెడ్డి తదితరులు ప్రిన్సిపాల్ జ్యోతి, అధ్యాపకులను అభినందించారు. ర్యాంకింగ్ పత్రాన్ని ప్రదర్శించారు.
కేయూ క్యాంపస్: కేయూలో రూ.6.90 కోట్ల వ్యయంతో గురువారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వర్సిటీ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో రూ.3.75 కోట్ల వ్యయంతో విద్యార్థులకు వర్క్‌షాప్ షెడ్ల నిర్మాణానికి కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రంతో కలిసి శంకుస్థాపన చేశారు. అలాగే, యూనివర్సిటీలోని మహిళా హాస్టళ్లు పద్మాక్షి, సావిత్రి బాయిపూలే, తదితర బ్లాక్‌ల ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇందుకు రూ.3.15 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. కార్యక్రమంలో ఓఎస్డీ వెంకట్రామ్‌రెడ్డి, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ కె.భిక్షాలు, కేయూ పాలకమండలి సభ్యులు సురేశ్‌లాల్, కె.అనితారెడ్డి, సుదర్శన్, చిర్రరాజు, వర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి.మనోహర్, అభివృద్ధి అధికారి ఆచార్య వెంకయ్య, ప్రొఫెసర్లు వాసుదేవరెడ్డి, ఎస్.జ్యోతి, ఈసం నారాయణ, టీజీడబ్ల్యూ ఐడీసీ ఇంజనీర్ అరుణ్‌కుమార్, నరేందర్‌రెడ్డి, శంకరయ్య పాల్గొన్నారు.
సౌత్‌జోన్ పోటీలకు పురుషుల
వెయిట్ లిఫ్టింగ్ జట్టు ఎంపిక
కేయూ క్యాంపస్: చెన్నయ్‌లోని వినాయక మిషన్ రీసెర్చ్ ఫౌండేషన్‌లో ఈనెల 21నుంచి 23వ తేదీ వరకు జరగనున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ పురుషుల వెయిట్ లిఫ్టింగ్ టోర్నమెంట్‌లో పాల్గొనే జట్టును గురువారం ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ టి.శాస్త్రి తెలిపారు. జట్టులో సొప్పరి తేజ, అభి రామ్‌కేత ఉన్నట్లు పేర్కొన్నారు. జట్టుకు హనుమకొండలోని జాగృతి డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఎ.రాజేశ్ మేనేజర్‌గా వ్యవహరిస్తారని తెలిపారు.
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్‌తో కిట్స్ కాలేజీ గురువారం రీ న్యూ ఎంఓయూ కుదుర్చుకున్నాయి. ఈమేరకు నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, కిట్స్ ప్రిన్సిపాల్ కె.అశోక్‌రెడ్డి పరస్పరం ఒప్పంద పత్రాలు అందజేసుకున్నారు. విద్య, పరిశోధనల్లో పరస్పరం భాగస్వాములు అయ్యేందుకు గతంలో చేసుకున్న ఎంఓయూ ఎంతో తోడ్పాటునివ్వగా మళ్లీ రీ న్యూ కుదుర్చుకున్నట్లు తెలిపారు. సెర్బ్, కార్స్, టేర్, ఐఐటీ గువహటి టెక్నాలజీ ఇన్నోవేషన్ అండ్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్, వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి రూ.88.71 లక్షల నిధులు సమకూరాయని తెలిపారు.
కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లాలో ఉపాధ్యాయులకు 95 శాతం లీవ్ ఎంట్రీలు పూర్తయ్యే వరకు సెలవులు మంజూరు చేయొద్దంటూ కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక తీవ్రంగా వ్యతిరేకించింది. ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని ఐక్యవేదిక ప్రతినిధులు గురువారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ అనారోగ్యం, వ్యక్తిగత, అత్యవసర పరిస్థితుల్లో సెలవులు అవసరమైన ఉపాధ్యాయులు అదనపు కలెక్టర్ వద్దకు వెళ్లి అనుమతి తీసుకోవడం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని పేర్కొన్నారు. కలెక్టర్ వెంటనే ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరారు.


