కాశిబుగ్గ: దంత సమస్యలతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి వచ్చిన వారు వైద్యం అందక తమ బాధను ‘పంటి’బిగువున ఓర్చుకుంటున్న పరిస్థితి. ఉమ్మడి జిల్లాతోపాటు ఇతర జిల్లాలనుంచి వచ్చే పేషంట్లు రోజురోజుకూ పెరుగుతున్నా.. చికిత్స అందించే వైద్యులు లేరు. కనీసం సీనియర్ రెసిడెంట్లను (ఎస్‌ఆర్) నియమించకపోవడం అధికారులకు నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎంజీఎంలో ప్రత్యేకంగా డెంటల్ విభాగం ఉన్నప్పటికీ అరకొర సిబ్బందితో కొనసాగుతోంది. ఇక ఒక డెంటల్ అసిస్టెంట్ సర్జన్‌తో పాటు ఒక డెంటల్ హైజనిస్టు పనిచేస్తున్నారు. ఆరునెలల క్రితం ఈ విభాగానికి సంబంధించిన ప్రొఫెసర్ బదిలీ అయినప్పటికీ, ఆయన స్థానంలో ఇంకా ఎవరినీ భర్తీ చేయలేదు. ఈ విభాగానికి నిత్యం ఐదారు వందల మంది ఓపీ పేషంట్లు వస్తుంటారు. చికిత్స చేసే పరికరాలు ఉన్నప్పటికీ వైద్య సిబ్బంది లేకపోవడం పెద్ద సమస్యగా మారింది.
ఎస్‌ఆర్‌లు లేని డెంటల్ విభాగం..
కాకతీయ మెడికల్ కళాశాల పరిధి ఎంజీఎం ఆస్పత్రిలో ప్రతీ విభాగానికి ప్రభుత్వం తరఫున ఇద్దరు సీనియర్ రెసిడెంట్లను (ఎస్‌ఆర్) నియమిస్తుంది. ఎంజీఎంలోని డెంటల్ విభాగానికి ఒక్క ఎస్‌ఆర్ కూడా లేరు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్తగా మంజూరైన నర్సంపేట, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు మెడికల్ కళాశాలకు ఇద్దరు చొప్పున ఎస్‌ఆర్‌లను నియమించారు. ఓపీ తక్కువగా ఉండే ఆ కాలేజీల్లో ఎస్‌ఆర్‌లు ఉండగా, అత్యధికంగా ఓపీ ఉన్న ఎంజీఎంకు మాత్రం ఒక్కరిని కూడా నియమించకపోవడం గమనార్హం.
ఆరోగ్యశ్రీ ఇంటర్వ్యూలో
ఎంపికైన వారు ఎక్కడ?
డెంటల్ విభాగంలో గతంలో ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు కాంట్రాక్టుపై విధులు నిర్వహించారు. ఈ ఇద్దరు వేర్వేరు కారణాలతో రావడం లేదు. గతేడాది ప్రారంభంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇద్దరు డెంటల్ అసిస్టెంట్ సర్జన్లను కాంట్రాక్టు పద్ధతిపై ఎంపిక చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. వీరి వద్ద రూ.1,000 చొప్పున దరఖాస్తు ఫీజు కూడా తీసుకున్నారు. ఇంటర్వ్యూకు 90 మంది అభ్యర్థులు వచ్చారు. వారిలో ఎవరిని ఎంపిక చేశారనేది స్పష్టత ఇవ్వకుండా ఫైల్ మూసివేసినట్లు తెలుస్తోంది. ఉన్న ఇద్దరు కాంట్రాక్టు వైద్యులు ఇంటిముఖం పట్టగా, కొత్తగా ఎంపికై న ఇద్దరు అడ్రస్ లేదు. దీంతో డెంటల్ విభాగం పరిస్థితి అధ్వానంగా తయారైంది.
ఎంజీఎంలోని డెంటల్ విభాగంలో ఎస్‌ఆర్‌లు కరువు
కొత్త మెడికల్ కాలేజీల్లో ఇద్దరు..
ఎంజీఎం ఆస్పత్రికి మాత్రం ఒక్కరూ లేరు
ఒక డెంటల్ అసిస్టెంట్ సర్జన్‌తో
కొనసాగుతున్న తీరు


