వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ పరిధిలో ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను మరింత మెరుగుపర్చేందుకు జీడబ్ల్యూఎంసీ, చైన్నెకి చెందిన ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎంఎస్‌ఎస్‌ఆర్‌ఎఫ్) సంయుక్తంగా అధ్యయనానికి గురువారం శ్రీకారం చుట్టాయి. వెల్‌కమ్ ట్రస్ట్ (యూకే) ఆర్థిక సహకారంతో అమలవుతున్న నాలుగేళ్ల పరిశోధన, కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా ఈ అధ్యయనం చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. అందులో భాగంగా గురువారం రెండు రోజుల శిక్షణలో భాగంగా తొలిరోజు గురువారం వరంగల్‌లోని దివ్య దీప్తి భవన్‌లో స్వయం సహాయక సంఘాల సభ్యులు, కాకతీయ యూనివర్సిటీ సోషల్ వర్కర్లు, సర్వేయర్లకు అవగాహన కల్పించారు. ఐఐటీ మద్రాస్, శ్రీ రామచంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ భాగస్వామ్యంతో చైన్నె, వరంగల్ నగరాల్లో ప్రజారోగ్యం, వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలను శాసీ్త్రయ ఆధారాలతో బలోపేతం చేయడం దీని లక్ష్యం అని ఎంఎస్‌ఎస్‌ఆర్‌ఎఫ్ ప్రతినిధి డా.ప్రతిభ గణేషన్ వెల్లడించారు. నగరంలో వివిధ ఆదాయ వర్గాలకు చెందిన 90 ఇళ్లతోపాటు మార్కెట్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, పాఠశాలలు, కార్యాలయాలు, ఆస్పత్రులు, బహిరంగ ప్రదేశాల్లో సర్వే నిర్వహించాలని సూచించారు. వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను పరిశీలించి పునర్వినియోగానికి అవకాశమున్న పదార్థాలను గుర్తించాలన్నారు. ఈఅధ్యయనం ద్వారా రోజువారీ వ్యర్థాల ఉత్పత్తి, సేకరణ, సేకరణకు నోచుకోని చెత్త శాతం, రీసైక్లింగ్ స్థాయిలతో పాటు ప్రస్తుత వ్యవస్థలోని లోపాలు, మౌలిక సదుపాయాల అవసరాలపై స్పష్టత రానుందని తెలిపారు. కార్యక్రమంలో సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, ఎంహెచ్‌ఓ రాజేశ్, ప్రతినిధులు మల్లం రాజేశ్, వెంకటేశ్వర్ రావు, రాజమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జీడబ్ల్యూఎంసీ, చైన్నె ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్
సంయుక్త పరిశోధన
సహాయక సంఘాలు,
సోషల్ వర్కర్లకు శిక్షణ


