సాక్షి, వరంగల్: అక్కడికి వచ్చినవి భూ వివాదాలు, వ్యక్తిగత సమస్యల అర్జీలు కాదు.. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల కన్నీటి గాథలు.. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లుల ఆవేదనలు.. చదువుకోవాలన్న తపన ఉన్నా ఆర్థిక స్థోమత లేక అల్లాడుతున్న బాలల దీనస్థితులు. తమ పాఠ శాలల సమస్యలపై విన్నపాలు. బాలల దినోత్సవం సందర్భంగా వరంగల్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ‘పిల్లల ప్రజావాణి’ చిన్నారుల సమస్యలకు ప్రత్యేక వేదికగా నిలిచింది. మొత్తం 12 ఫిర్యాదులు అందగా.. ఒక్కో అర్జీ వెనుక ఓ కుటుంబం పడుతున్న కష్టం, చిన్నారుల భవిష్యత్‌పై నెలకొన్న ఆందోళన కనిపించింది.
ఓ బాధిత తల్లీబిడ్డకు కలెక్టర్ తక్షణ అండ.. స్వధార్ హోమ్‌కు తరలింపు
పిల్లల ప్రజావాణికి 12 ఫిర్యాదులు
ఈ ఫొటోలో అధికారుల ఎదుట నిలబడిన చిన్నారి వరంగల్ వీవర్స్‌కాలనీకి చెందిన మోరె రక్షిత. తనకు తండ్రి లేడని, చదువుకోవడానికి ఇబ్బందులు పడుతున్నామని వేడుకుంది. మానసిక దివ్యాంగురాలైన తనకు సదరం సర్టిఫికెట్ అందించి పింఛన్ మంజూరు చేయాలని వేడుకుంది. స్పాన్సర్షిప్ పథకం ద్వారా ప్రభుత్వం సహాయం చేసి ఆదుకోవాలని విన్నవించింది.


