వరంగల్ అర్బన్: భర్తను కోల్పోయిన వితంతువులు. రెక్కలు ముక్కలు చేసుకునే నేత కార్మికులు. విధివంచితులైన దివ్యాంగులు. ప్రాణాలకు తెగించి బతుకు పోరాటం సాగించే గీత కార్మికులు. దిక్కుమొక్కూ లేని ఒంటరి మహిళలు.. ఇలా.. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఎంతో మంది పేదలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత సామాజిక పింఛన్లు మంజూరు చేసింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేదలకు పింఛన్ల రూపంలో ఆపన్న హస్తం అందించనుంది.
ఏర్పాట్లు పరిశీలించిన కమిషనర్ వెంకన్న
వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలో నిర్వహించనున్న చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. ఈనెల 17న వరంగల్ ఎల్బీ నగర్‌లోని ఏ–1 కన్వెన్షన్ హాల్‌లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈనేపథ్యంలో సోమవారం ఏర్పాట్లను కమిషనర్ వెంకన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎమ్మెల్యేలు, అధికారుల చేతుల మీదుగా పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. కమిషనర్ వెంట ఉప కమిషనర్ ప్రసన్నరాణి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సంజయ్‌కుమార్, మాధవీలత, ఇతర అధికారులున్నారు.
ఆక్రమణలపై అధిక ఫిర్యాదులు
వరంగల్ మహా నగరంలో అనధికారిక భవన నిర్మాణాలు, స్థలాల కబ్జాలపై గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్‌కు అర్జీలు పోటెత్తుతున్నాయి. బల్దియా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు మొత్తం 92 ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ అడిషనల్ కమిషనర్ సమ్మయ్య, సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్‌కుమార్, సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, ముఖ్య హార్టికల్చర్ అధికారి లక్ష్మారెడ్డి, డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, కార్యదర్శి అనిల్‌బాబు, పన్నుల అధికారి రామకృష్ణ, ఆరోగ్య అధికారి డాక్టర్ రాజేశ్ పాల్గొన్నారు.
24 గంటల్లో జమ చేయాలి..
ఆస్తి, ట్రేడ్ బిల్ కలెక్టర్లు ఫీజులను ఎట్టి పరిస్థితుల్లో 24 గంటల్లోగా మున్సిపల్ ఖజానాలో జమ చేయాలని లేకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి.వెంకన్న హెచ్చరించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
గ్రేటర్ పరిధిలో
కొత్త పింఛన్లు ఇలా..
వితంతువులు 5,141
దివ్యాంగులు 1,997
ఒంటరి మహిళలు 553
గీత కార్మికులు 170
చేనేత కార్మికులకు 112
మొత్తం 7,973
నేడు ఎమ్మెల్యేల చేతుల మీదుగా పంపిణీ
ఏర్పాట్లు పరిశీలించిన కమిషనర్ వెంకన్న


