రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు

Nov 17 2026 1:50 AM | Updated on Nov 17 2026 1:50 AM

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు

● పోలీస్‌ కమిషనర్‌ శ్వేత

హన్మకొండ అర్బన్‌: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్వేత ఆదేశించారు. ప్రైవేట్‌ పాఠశాలల బస్సు డ్రైవర్లకు క్రమం తప్పకుండా మద్యం పరీక్షలు నిర్వహించాలని కోరారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌లో కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధ్యక్షతన ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. భద్రతా చర్యలు, ట్రాఫిక్‌ నియంత్రణ, రహదారి మౌలిక సదుపాయాల మెరుగుదల, పీఎం రాహత్‌ పథకం అమలు తదితర అంశాలపై సమీక్షించారు.

బస్సు డ్రైవర్లపై ప్రత్యేక నిఘా..

ఇటీవల ఓ ప్రైవేట్‌ పాఠశాల బస్సు డ్రైవర్‌కు నిర్వహించిన శ్వాస పరీక్షలో మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు గుర్తించామని, అతడి డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దుకు చర్యలు చేపట్టామని సీపీ చెప్పారు.

పైప్‌లైన్ల లీకేజీలు అరికట్టాలి..

నగరంలో పలుచోట్ల రహదారులపై పైప్‌లైన్ల లీకేజీలు అరికట్టాలని కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. రోడ్లపై మరమ్మతు పనులు ఉంటే త్వరగా పూర్తి చేయాలని, రహదారుల నిర్వహణపై సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.

భద్రతా చర్యలపై వివరణ

రహదారి భద్రతకు తీసుకుంటున్న చర్యలను ఆర్‌అండ్‌బీ ఈఈ దేవిక చౌహాన్‌, జాతీయ రహదారుల విభాగం మేనేజర్‌ లింగయ్య సమావేశంలో వివరించారు. సెంట్రల్‌ జోన్‌ డీసీపీ దార కవిత, గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ వెంకన్న, ట్రాఫిక్‌ అదనపు డీసీపీ ప్రభాకర్‌రావు, ఏసీపీ సత్యనారాయణ, ఇన్‌స్పెక్టర్‌ చేరాలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

డ్రగ్స్‌ పరీక్షల కిట్లకు రూ.లక్ష విరాళం

హసన్‌పర్తి: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ చేపడుతున్న కార్యక్రమాలకు ఇనుగాల చారిటబుల్‌ ట్రస్ట్‌ తన వంతు సహకారం అందించింది. డ్రగ్స్‌ పరీక్షల కిట్ల కొనుగోలుకు ట్రస్ట్‌ చైర్మన్‌ ఇనుగాల వెంకట్రాంరెడ్డి రూ.లక్ష విరాళం అందించారు. ఈమేరకు సోమవారం పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌.శ్వేతకు చెక్కును అందించారు. యువత, విద్యార్థులు మాదక ద్రవ్యాలు వినియోగిస్తే గుర్తించేందుకు పరీక్షలు నిర్వహించడం, మాదక ద్రవ్యాల విక్రయాలపై నిఘా పెంచడం వంటి చర్యలకు డ్రగ్స్‌ పరీక్షల కిట్లు ఎంతో అవసరమని గుర్తించి ఈ విరాళాన్ని అందించినట్లు వెంకట్రామిరెడ్డి తెలిపారు. కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement