మిగిల్చిన విషాదం | - | Sakshi
Sakshi News home page

మిగిల్చిన విషాదం

Nov 8 2026 1:19 AM | Updated on Nov 8 2026 1:19 AM

వివాహేతర

సంబంధం..

సరస్సు వద్దకు తీసుకెళ్తే.. అక్కాచెల్లెళ్లిద్దరు ఆహ్లాదం అనుకున్నారు.. అమ్మ చేయి పట్టుకుని బుడిబుడి అడుగులు వేశారు. సరదాగా ఆడుకున్నారు. పార్కంతా కలియదిరిగారు. తెల్లవారితే అందరి ఇళ్లలో దీపావళి వెలుగులు.. కానీ, తన భర్త చేసిన మోసంతో జీవితంలో కారు చీకట్లు అలుముకున్నాయి. తన గుండెలో గూడుకట్టుకున్న ఆవేదన, ఆక్రందనలకు మరణమే శరణ్యమనుకుంది. తాను చనిపోతే పిల్లలిద్దరు అనాథలవుతారని భావించి చున్నీతో పిల్లలిద్దరిని నడుముకు కట్టుకుంది. ఏంటమ్మా ఇలా చేస్తున్నావని చిన్నారులు అడిగేలోపే సరస్సులో దూకింది. ముగ్గురూ విగతజీవులయ్యారు. భర్త వివాహేతర సంబంధం మిగిల్చిన పెనువిషాదమిది.

ఖానాపురం/గీసుకొండ: కన్నవారిని కాదనుకుంది. సామాజిక వర్గాలు వేరైనా ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుంది. తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో మనస్తాపం చెందింది. ఇటు తల్లిగారింటికి వెళ్లలేదు. భర్త మోసం తట్టుకోలేక చావే దిక్కనుకుంది. కానీ, పిల్లలు దిక్కులేని వారవుతారనే భావనతో వారితో సహా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హృదయ విదారక ఘటన పాకాలలో చోటుచేసుకుంది. హనుమకొండ జిల్లా బైరాన్‌పల్లి గ్రామానికి చెందిన ఈరెల్లి మమత(30) చిన్నతనం నుంచి వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం ఎలుకుర్తిహవేలిలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉండి చదువుకుంది. చదువుకునే సమయంలో అదే గ్రామానికి చెందిన సుమన్‌ అనే యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరి సామాజిక వర్గాలు వేరు. పెద్దలకు ఇష్టంలేకపోయినా వారిని వదిలి ఆరేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకుంది. సుమన్‌ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, మెడికల్‌ డిప్లొమా చదివిన మమత నర్సంపేటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో పనిచేస్తోంది. వారికి హర్షిణి(4), కావ్య(3) ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. హర్షిణి నర్సరీ చదువుతుండగా కావ్య ఇంటివద్దే ఉంటోంది.

భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం..

వారిద్దరి సంసారం సజావుగా సాగుతుండగా సుమన్‌ గ్రామంలోని తనఇంటి సమీపంలోని ఓ మహిళతో 6 నెలల నుంచి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన మమత మానసికంగా కుంగిపోయింది. సొంత వారిని వదులుకుని ఇష్టపడిన వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంటే భర్త నమ్మించి మోసం చేశాడనే ఆవేదన చెందింది. ఈ విషయమై గ్రామంలోని పెద్ద మనుషులు రెండుసార్లు పంచాయితీ పెట్టి సుమన్‌ను హెచ్చరించారు. అతను తీరు మార్చుకోకపోగా ఆ మహిళతో పలుమార్లు ఇంట్లోనుంచి వెళ్లిపోయాడు. పోలీస్‌ కేసు కూడా నమోదైంది. ఈ క్రమంలో సుమన్‌, మమ త నర్సంపేట మండలం ముగ్దుంపురంలోని బంధువుల ఇంట్లో ఉంటున్నారు. రెండు రోజుల క్రితం సదరు మహిళతో కలిసి మళ్లీ వెళ్లిపోయాడు. దీంతో మమత ఎలుకుర్తి హవేలిలో తన ఇంటికి వెళ్లింది. శుక్రవారం రాత్రి ఆ మహిళ తరఫు భర్త, బంధువులు తన ఇంటికి వచ్చి తీవ్రంగా దూషించారు. అవమానంగా భావించిన మమత శనివారం ఉదయం డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి ఇద్దరు కూతుళ్లను వెంటబెట్టుకుని పాకాల సరస్సుకు వచ్చి చున్నీతో నడుముకు కట్టుకుని దూకి ఆత్మహత్య చేసుకుంది.

పిల్లలతో కాసేపు గడిపి..

సరస్సు పార్కులో మమత పిల్లలతో కాసేపు గడిపింది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని హైదరాబాద్‌లో ఉన్న బంధువులకు వాట్సాప్‌ ద్వారా లొకేషన్‌ వివరాలు పంపింది. తన వెంట తెచ్చుకున్న బ్యాగు, సెల్‌ఫోన్‌ బోటింగ్‌ పాయింట్‌ సమీపంలో పెట్టింది. అప్రమత్తమైన బంధువులు గ్రామంలోని కుటుంబ సభ్యులకు తెలిపి వెంటనే మమతకు ఫోన్‌ చేయగా బోటింగ్‌ సిబ్బంది ఫోన్‌ లిఫ్ట్‌ చేశారు. ఇద్దరు పిల్లలతో వచ్చిన మహిళ ఆత్మహత్య చేసుకుంటానని తెలిపిందని, వెంటనే కాపాడాలని కోరగా.. పార్కు, కట్ట ప్రాంతంలో వెతికి బోటింగ్‌ పాయింట్‌ వద్దకు చేరుకోగా ముగ్గురి మృతదేహాలు నీటిపై తేలాయి. ఎస్సై గుగులోతు రాంమోహన్‌కు సమాచారం తెలియడంతో అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వరంగల్‌ ఈస్ట్‌జోన్‌ డీసీపీ అంకిత్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి వివరాలు సేకరించారు. నర్సంపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి, నర్సంపేట, దుగ్గొండి సీఐలు శ్రీనివాస్‌, శంకర్‌రావు వివరాలు సేకరించారు. తహసీల్దార్‌ నంగునూరి రమేశ్‌ సమక్షంలో పంచనామా నిర్వహించి ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేటకు తరలించారు. తల్లీకూతుళ్ల మృతదేహాలను చూసి బంధువులు, అక్కడికి వచ్చిన ప్రతిఒక్కరూ కంటతడి పెట్టుకున్నారు. సుమన్‌ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

తల్లి గారింటికి వెళ్లలేక.. భర్త మోసం తట్టుకోలేక

తాను చనిపోతే పిల్లలు అనాథలవుతారని భావించి..

ఇద్దరు కూతుళ్లతో కలిసి తల్లి బలవన్మరణం

పాకాల సరస్సులో దూకి తనువు చాలించిన వైనం

ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఈస్ట్‌జోన్‌ డీసీపీ, అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement